Educational Loan: ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్‌ లోన్‌.. ప్రయోజనాలివే..

డబ్బు కోసం ఆందోళన చెందకుండా పిల్లలు వారు కోరుకున్న విద్యను అభ్యసించే అవకాశం ఎడ్యుకేషన్‌ లోన్‌ అందిస్తుంది. అదే కాకుండా మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

Published : 21 Jan 2023 17:35 IST

  

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ, విదేశాల్లో ఉన్నత చదువుల కోసం బ్యాంకులు విద్యా రుణాలను అందిస్తున్నాయి. ఇవి విద్య కోసం అయ్యే 100% ఖర్చులను కవర్‌ చేస్తాయి. కాబట్టి డబ్బు కోసం ఆందోళన చెందకుండా పిల్లలు వారు కోరుకున్న విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది. ఎడ్యుకేషన్‌ లోన్‌ ద్వారా చదువుకోవడం వల్ల మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. 

కుటుంబంపై ఒత్తిడి ఉండదు..

ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకోవడం వల్ల కుటుంబంపై ఆర్థికంగా ఒత్తిడి తగ్గుతుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, బాండ్ల పెట్టుబడులను మధ్యలోనే నిలిపివేయనవసరం లేదు. ఆస్తులను విక్రయించడం లేదా పదవీ విరమణ కోసం, ఇతర లక్ష్యాల కోసం దాచుకున్న మొత్తం తీయాల్సిన అవసరం ఉండదు.

బాధ్యతగా ఉంటారు..

విద్యార్థులు తమ చదువులను పూర్తి చేసిన తర్వాత మాత్రమే చెల్లింపులు ప్రారంభమవుతాయి. కాబట్టి వెంటనే చెల్లించాలనే ఆందోళన ఉండదు. అలాగే ఎడ్యుకేషన్‌ లోన్‌ ఉంటే విద్యార్థులకు బాధ్యత ఉంటుంది. కాబట్టి పట్టుదలగా చదవి మంచి ఉద్యోగం సాధించేందుకు మరింతంగా ప్రయత్నిస్తారు. 

విస్తృతమైన ఖర్చులను కవర్‌ చేస్తుంది..

విదేశాల్లో చదువు కోవాలంటే ట్యూషన్‌ ఫీజు మాత్రమే కాకుండా జీవన, ప్రయాణ, స్టడీ మెటీరియల్‌, ల్యాప్‌టాప్‌.. ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇలాంటి ఖర్చులను కూడా విద్యా రుణాలు కవర్‌ చేస్తాయి. 

సొంతంగా చదువుకునే వీలు..

విద్యార్థులు కుటుంబంపై ఆధారపడకుండా సొంతంగా చదువుకునే గొప్ప అవకాశాన్ని ఎడ్యుకేషన్‌ లోన్‌ కల్పిస్తుంది. రుణం తీసుకుని చదువుకుని, జాబ్ వచ్చాక చెల్లింపులు చేయడం వల్ల.. తల్లిదండ్రులకు భారం కాకుండా చదువుకోగలిగామనే తృప్తి ఉంటుంది.

క్రెడిట్‌ స్కోరు..

చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సాధించిన తర్వాత చెల్లింపులు ప్రారంభమవుతాయి. కాబట్టి కెరీర్‌ ప్రారంభంలోనే మంచి క్రెడిట్‌ స్కోరును నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. మంచి క్రెడిట్‌ ప్రొఫైల్‌ ఉంటే భవిష్యత్‌లో తక్కువ వడ్డీకే త్వరగా రుణాలు లభిస్తాయి. 

పన్ను ప్రయోజనాలు..

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80ఈ కింద ఎడ్యుకేషన్‌ లోన్‌పై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఎడ్యుకేషన్‌ లోన్‌ దరఖాస్తుదారుడు/ సహ దరఖాస్తుదారుడు గరిష్ఠంగా 8 ఏళ్ల పాటు ఈ ప్రయోజనం పొందొచ్చు. మినహాయింపు మొత్తంపై గరిష్ఠ పరిమితి లేదు. 

అంతేకాకుండా విదేశీ విద్యారుణాలపై టీసీఎస్‌ (మూలం వద్ద వసూలు చేసే పన్ను) తగ్గింపు లభిస్తుంది. ఒక విద్యార్థి విద్యా రుణంపై కాకుండా.. సొంతంగా విదేశాల్లో చదువుకుంటే విదేశీ మారకపు లావాదేవీలు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలు దాటితే, 5% టీసీఎస్‌ వర్తిస్తుంది. ఒకవేళ విద్యా రుణంతో చదువుకుంటే 0.5% కంటే తక్కువ టీసీఎస్‌కు అర్హత ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని