BMW X1: ఎక్స్‌ సిరీస్‌లో బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధరెంతో తెలుసా?

బీఎండబ్ల్యూ (BMW India) ఎక్స్‌ సిరీస్‌లో మరో కొత్త కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో డ్రైవర్‌ అసిస్టెంట్ ఫీచర్లతోపాటు ప్రయాణికుల భద్రత కోసం అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

Published : 04 May 2023 17:47 IST

దిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW India) ఎక్స్‌ సిరీస్‌లో మరో కొత్త కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎండబ్ల్యూ ఎక్స్‌ 1 ఎస్‌డ్రైవ్‌18ఐ ఎమ్‌ స్పోర్ట్ (BMW X1 sDrive18i M Sport) పేరుతో తీసుకొచ్చిన ఈ కారును చెన్నైలోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌లో తయారు చేసినట్లు తెలిపింది. ఈ కారు ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 48.90 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇందులో 1.5 లీటర్‌ మూడు సిలిండర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఈ కారు 4,400-6,500 ఆర్‌పీఎం వద్ద 136 హెచ్‌పీ శక్తిని, 1,500-4,000 ఆర్‌పీఎం వద్ద 230 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను విడుదల చేస్తుంది. 9.2 సెకన్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. ఇందులో 7-స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ గేర్‌ ట్రాన్స్‌మిషన్‌ ఉంది. 

‘‘లగ్జరీ ఫీచర్లతో స్పోర్ట్స్‌ యాక్టివిటీ వెహికల్‌  (SAV) కావాలనుకునే వారి కోసం ఈ కారును డిజైన్ చేశాం. సిటీ డ్రైవ్‌తోపాటు, ఆఫ్‌ రోడ్‌ రైడ్‌లకు తరచుగా వెళ్లే వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ కారులో ఫీచర్లు ఉన్నాయి. జూన్‌ నుంచి కార్ల డెలివరీ ప్రారంభిస్తాం’’ అని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవా తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇందులో ఆధునిక డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌ ఉంది. ఇది డ్రైవర్‌ కారును రివర్స్ చేసే సమయంలో, పార్కింగ్‌ చేసేప్పుడు సాయపడుతుందని బీఎండబ్ల్యూ తెలిపింది. వీటితోపాటు డిజిటల్‌ కీ, 10.7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్‌ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌తోపాటు ప్రయాణికుల భ్రదత కోసం అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్స్‌ ఇస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని