Bournvita: ‘బోర్నవిటాలో అధిక షుగర్‌ కంటెంట్‌’.. వైరల్‌ వీడియోపై స్పందించిన కంపెనీ

Bournvita rejects viral video: బోర్నవిటాలో అధిక స్థాయిలో షుగర్‌ కంటెంట్‌ ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ కంపెనీ ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన కంపెనీ... వీడియో రూపొందించిన వ్యక్తికి లీగల్‌ నోటీసులు పంపింది.

Updated : 18 Apr 2023 15:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏళ్లుగా ప్రజాదరణ పొందుతున్న బోర్నవిటా (Bournvita) హెల్త్‌ డ్రింక్‌లో అధిక మొత్తంలో షుగర్‌ కంటెంట్‌ ఉందంటూ వైరల్‌ అవుతున్న వీడియోపై ఆ కంపెనీ స్పందించింది. సోషల్‌ మీడియోలో వైరల్‌ అవుతున్న వీడియో (Viral Video)ను ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేకుండా రూపొందించారని పేర్కొంది. ఈ వీడియోపై సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు కంపెనీ లీగల్‌ నోటీసు జారీ చేయగా.. సదరు వీడియో అతడు తొలగించడం గమనార్హం. అయినప్పటికీ వీడియో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఆ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.

బోర్నవిటా పేరుతో మోండలెజ్‌ ఇండియా సంస్థ ఏళ్లుగా హెల్త్‌ డ్రింక్‌ను విక్రయిస్తోంది. అయితే, తనకు తాను న్యూట్రిషియనిస్ట్‌గా, హెల్త్‌ కోచ్‌గా పేర్కొనే హిమంత్సింకా అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ బోర్నవిటాపై ఇటీవల ఓ వీడియో చేశాడు. ఈ హెల్త్‌ డ్రింక్‌లో అధిక స్థాయిలో షుగర్‌ కంటెంట్‌ ఉందని, కోకో పదార్థాలతో పాటు క్యాన్సర్‌ కారక రంగులను వినియోగించారని ఆరోపించాడు. ఈ వీడియోపై ఏప్రిల్‌ 13న మోండలెజ్‌ ఇండియా సంస్థ అతడికి నోటీసులు పంపింది. దీంతో ఆ వీడియోను డిలీట్‌ చేశాడు. వీడియోను తొలగిస్తున్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. చట్టపరంగా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని సంస్థను కోరాడు.

వీడియో డిలీట్‌ చేసినప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అప్పటికే దాదాపు 12 మిలియన్ల వ్యూస్‌ దక్కించుకున్న ఈ వీడియో ఇతర సోషల్‌ మీడియా వేదికలపైనా షేర్‌ అయ్యింది. నటుడు పరేశ్‌ రావల్‌, ఎంపీ కృతి ఆజాద్‌ వంటి వారు సైతం ఈ వీడియోను షేర్‌ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో బోర్నవిటా ఓ ప్రకటన విడుదల చేసింది. గడిచిన ఏడు దశాబ్దాలుగా తాము భారత ప్రజల నమ్మకాన్ని చూరగొన్నామని, దేశీయ చట్టాలను గౌరవిస్తూ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు పేర్కొంది. పోషకాహార నిపుణులు, ఆహార శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రూపొందిస్తున్నామని, తాము ఏయే పదార్థాలు వినియోగిస్తున్నామో స్పష్టంగా ప్యాకెట్‌పై పేర్కొంటున్నామని బోర్నవిటా పేర్కొంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో ఓ వీడియో భయాందోళనలు రేకెత్తిస్తున్న వేళ.. ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. న్యాయపరంగానూ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని