Mobile Phone: మొబైల్‌ ఫోన్‌ విడి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించిన కేంద్రం

మొబైల్‌ ఫోన్‌ విడి భాగాలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీని వల్ల దేశీయంగా తయారీ విలువ పెరిగి, ఎగుమతులు పుంజుకుంటాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated : 31 Jan 2024 13:08 IST

దిల్లీ: మొబైల్‌ ఫోన్‌ (Mobile Phone) విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 15 శాతం నుంచి పది శాతానికి తగ్గించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో స్మార్ట్‌ ఫోన్‌ అసెంబ్లింగ్‌ కంపెనీలకు లబ్ధి చేకూరనుంది. ‘‘బ్యాటరీ కవర్లు, కెమెరా లెన్స్‌, ఫోన్‌ వెనుక భాగం కవర్‌, జీఎస్‌ఎమ్ యాంటెన్నాతోపాటు ఫోన్‌ తయారీ కోసం ఉపయోగించే ప్లాస్టిక్‌, మెటల్ తదితర విడిభాగాలపై దిగుమతి సుంకం పది శాతానికి తగ్గించాం’’ అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

భారత్‌లో అసెంబ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు దేశీయంగా మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం తోడ్పడుతుందని మొబైల్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు ఎగుమతులూ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్‌లో భారత మొబైల్‌ పరిశ్రమ వృద్ధిని, పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తుందని ‘ఇండియా సెల్యులార్‌ అండ్ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌’ (ICEA)  తెలిపింది. 

కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ (Union Budget 2024)లో ఫోన్‌ విడిభాగాల దిగుమతిపై విధించే సుంకంలో ఎలాంటి కోత పెట్టొద్దని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (GTRI) కొద్ది రోజుల క్రితం కోరింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ సత్ఫలితాలిస్తున్న నేపథ్యంలో ఎలాంటి మార్పులు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. లేదంటే భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో నమోదవుతున్న వృద్ధి దెబ్బతింటుందని వివరించింది. ఈ క్రమంలో జీటీఆర్‌ఐ వాదనతో ఐసీఈఏ విభేదించింది. దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే దేశీయంగా ఫోన్ల తయారీ విలువ 28 శాతం పెరిగి.. 82 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని