WhatsApp: వాట్సప్‌లోనే బస్సు టికెట్ల జారీ.. ప్రవేశ పెట్టే యోచనలో దిల్లీ ప్రభుత్వం!

WhatsApp: దిల్లీ మెట్రో రైల్‌ తరహాలో బస్సు ప్రయాణికులకూ వాట్సప్‌ ద్వారా టికెట్లు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Updated : 11 Dec 2023 11:07 IST

దిల్లీ: బస్సుల్లో ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా దిల్లీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వాట్సప్‌ (WhatsApp) ద్వారా టికెట్లు జారీ చేసే అంశాన్ని అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఈ తరహా సేవలను అందిస్తోంది. దాన్నే బస్సు ప్రయాణికులకూ విస్తరించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రయాణికులకు శుభవార్త చెబుతామని అక్కడి అధికారులు తెలిపారు.

దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ వాట్సప్‌ (WhatsApp) ద్వారా టికెట్లను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని ఈ ఏడాది మే నెలలో కొన్ని మార్గాల్లో ప్రారంభించింది. దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించటంతో మరిన్ని మార్గాలకూ విస్తరించింది. అయితే, వాట్సప్‌ ద్వారా కొనుగోలు చేసే టికెట్ల సంఖ్యపై పరిమితి ఉంటుంది.

రెండేళ్లుగా ఇళ్లు కొనడం కష్టమవుతోంది!

దిల్లీ మెట్రో టికెట్‌ కొనడానికి ప్రయాణికులు ‘హాయ్‌’ అని వాట్సప్‌లో ఒక నంబర్‌కు మెసేజ్‌ చేయాల్సి ఉంటుంది. లేదా మెట్రో స్టేషన్లలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్‌ చేసి కూడా టికెట్‌ పొందొచ్చు. అయితే, వాట్సప్‌ ద్వారా కొనుగోలు చేసిన టికెట్‌ను రద్దు చేసుకునే వెసులుబాటు మాత్రం ఉండదు. అలాగే క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే చిన్న మొత్తంలో కన్వీనియెన్స్‌ ఫీజు కూడా వసూలు చేస్తారు. యూపీఐ ఆధారిత పేమెంట్స్‌కు మాత్రం ఎలాంటి అదనపు రుసుము ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని