IMF: 8% వృద్ధి అంచనా మాది కాదు.. అది ఆయన వ్యక్తిగతం: ఐఎంఎఫ్‌

భారత వృద్ధి అంచనాలను త్వరలో వెలువరించనున్నామని ఐఎంఎఫ్‌ తెలిపింది. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ అంచనాలతో తమకు సంబంధం లేదని స్పష్టంచేసింది.

Published : 05 Apr 2024 15:52 IST

IMF| వాషింగ్టన్‌: భారత వృద్ధి అంచనాలపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ స్పందించింది. వృద్ధి అంచనాలు ఆయన వ్యక్తిగతమని, వాటితో తమకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది. ఐఎంఎఫ్‌ వెలువరించిన అంచనాలకు భిన్నంగా భారత్ 8 శాతం వృద్ధి సాధిస్తుందన్న సుబ్రమణియన్‌ వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఐఎంఎఫ్‌ అధికార ప్రతినిధి జూలీ కొజాక్‌ ఈమేరకు సమాధానం ఇచ్చారు. ఆ అంచనాలతో తమకు సంబంధం లేదన్నారు.

త్వరలో యూపీఐతో క్యాష్‌ డిపాజిట్‌

ఇటీవల దిల్లీలో జరిగిన కార్యక్రమంలో సుబ్రమణియన్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. గత 10 ఏళ్లుగా అవలంబించిన విధానాలు రెట్టింపు చేసి, సంస్కరణలను వేగవంతం చేస్తే 2047 వరకు భారత్‌ 8 శాతం వృద్ధితో దూసుకెళ్లగలదని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ఏడాది జనవరిలో భారత వృద్ధి అంచానాలను 6.5 శాతంగా ఐఎంఎఫ్‌ పేర్కొంది. సుబ్రమణియన్‌ అంచనాలు అందుకు భిన్నంగా ఉండడంపై మీడియా ప్రతినిధులు ఐఎంఎఫ్‌ ప్రతినిధిని ప్రశ్నించారు. దీనిపై కొజాక్‌ మాట్లాడుతూ.. వివిధ దేశాల ప్రతినిధులతో కూడిన ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఐఎంఎఫ్‌లో ఉంటుందని, తమ సిబ్బందితో పోలిస్తే వారి అభిప్రాయాలు భిన్నంగా ఉండొచ్చని కొజాక్‌ పేర్కొన్నారు. మరికొన్ని వారాల్లో భారత వృద్ధి అంచనాలను వెలువరిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని