2023 ఏప్రిల్‌ నుంచి పెట్రోల్‌లో 20% ఇథనాల్‌

వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎంపిక చేసిన పెట్రోల్‌ బంకుల్లో 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (ఇ 20 పెట్రోల్‌) సరఫరాను ప్రారంభించనున్నట్లు చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ పురి

Published : 11 Aug 2022 05:29 IST

చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ పురి

పానీపట్‌ (హరియాణా): వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎంపిక చేసిన పెట్రోల్‌ బంకుల్లో 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (ఇ 20 పెట్రోల్‌) సరఫరాను ప్రారంభించనున్నట్లు చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ పురి వెల్లడించారు. ఆ తర్వాత క్రమంగా ఈ సరఫరా పెంచుతామన్నారు. పర్యావరణ సమస్యలకు పరిష్కారంతో పాటు, చమురు దిగుమతుల బిల్లు తగ్గించుకునేందుకు ఈ ప్రక్రియ దోహద పడుతుందన్నారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా ఇ 20 పెట్రోల్‌ సరఫరా చేస్తామని తెలిపారు. 2022 నవంబరుకు 10 శాతం ఇథనాల్‌తో పెట్రోల్‌ సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఈ ఏడాది జూన్‌లోనే లక్ష్యాన్ని భారత్‌ సాధించింది. దీంతో 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ సరఫరా లక్ష్యాన్ని 5 ఏళ్లు మందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రపంచ బయోఫ్యూయల్‌ దినోతవ్సం సందర్భంగా రెండో తరం (2జీ) ఇథనాల్‌ ప్లాంట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం అంకితం చేశారు. దేశంలో బయోఫ్యూయల్స్‌ వినియోగం, ఉత్పత్తి పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు ఈ ప్లాంట్‌ దోహదపడనుంది. ఐఓసీ రూ.900 కోట్ల పెట్టుబడులతో పానీపట్‌ రిఫైనరీ సమీపంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఏడాదికి 2 లక్షల టన్నుల వరి గడ్డిని 3 కోట్ల లీటర్ల ఇథనాల్‌గా ఈ ప్లాంట్‌లో మార్చనున్నారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ కలపడం వల్ల రూ.41,500 కోట్ల విదేశీ మారకపు ద్రవ్యం మిగిలిందని, 27 లక్షల టన్నుల గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలు తగ్గాయని, రైతులకు రూ.40,600 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని పురి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని