మహీంద్రా వార్షిక లాభం రూ.10,282 కోట్లు

వ్యాపార విభాగాలన్నీ రాణించడంతో గత ఆర్థిక సంవత్సరానికి రికార్డు లాభాన్ని మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) నమోదుచేసింది. 2021-22లో ఏకీకృత నికర లాభం రూ.6,577 కోట్లు కాగా.. 2022-23లో 56% అధికంగా రూ.10,282 కోట్లకు చేరింది.

Published : 27 May 2023 02:05 IST

రూ.16.25 డివిడెండు

ముంబయి: వ్యాపార విభాగాలన్నీ రాణించడంతో గత ఆర్థిక సంవత్సరానికి రికార్డు లాభాన్ని మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) నమోదుచేసింది. 2021-22లో ఏకీకృత నికర లాభం రూ.6,577 కోట్లు కాగా.. 2022-23లో 56% అధికంగా రూ.10,282 కోట్లకు చేరింది. సంస్థ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభం. ఆదాయం రూ.90,171 కోట్ల నుంచి 34% పెరిగి రూ.1,21,269 కోట్లకు చేరింది.

* జనవరి- మార్చిలో నికర లాభం రూ.2,637 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాల లాభం రూ.2,237 కోట్లతో పోలిస్తే ఇది 18% ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.25,934 కోట్ల నుంచి రూ.32,366 కోట్లకు పెరిగింది.

సంస్థ మెరుగైన పనితీరుకు, 62% వృద్ధితో వాహన వ్యాపార విభాగం కీలక పాత్ర పోషించిందని కంపెనీ తెలిపింది. కొత్త మోడళ్లు, సరఫరా పరిస్థితులు మెరుగవ్వడం కలిసొచ్చాయి. మహీంద్రా యాక్సె 37%, మహీంద్రా లాజిస్టిక్స్‌ 24%, క్లబ్‌ మహీంద్రా 22% వృద్ధిని కనబర్చాయి. ‘స్పోర్ట్‌ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ)  ఆదాయ మార్కెట్‌ వాటాలో తిరిగి మొదటి స్థానాన్ని దక్కించుకున్నామ’ని ఎంఅండ్‌ఎం మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ అనిశ్‌ షా తెలిపారు. తేలికపాటి వాణిజ్య వాహనాలు, వ్యవసాయ యంత్రాలు, విద్యుత్‌ త్రిచక్ర వాహనాల విభాగాలు కూడా కంపెనీ అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేశాయని పేర్కొన్నారు. ఫలితాలకు సంబంధించి మరికొన్ని వివరాలు ఇలా..

* 2022-23లో 6.98 లక్షల వాహనాలను ఎంఅండ్‌ఎం విక్రయించింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికం. 2021-22లో విక్రయించిన 4,65,601 వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 50 శాతం ఎక్కువ.

* వాహన వ్యాపార విభాగ ఆదాయం 35% వృద్ధితో రూ.16,400 కోట్లుగా నమోదైంది.

* ఎస్‌యూవీ విభాగంలో 19.6% మార్కెట్‌ వాటాతో నాలుగో త్రైమాసికంలోనూ అగ్రస్థానంలో కొనసాగినట్లు కంపెనీ పేర్కొంది. 2023 మే 1 నాటికి 2.92 లక్షల ఎస్‌యూవీలకు బుకింగ్‌లు ఉన్నాయని తెలిపింది.

* 2022-23లో వ్యవసాయ యంత్రాల విభాగంలో 4.04 లక్షల అమ్మకాలు నమోదయ్యాయి.

* ట్రాక్టర్ల అమ్మకాలు 3,50,981 నుంచి 15% పెరిగి 4,03,981కు చేరాయి.

* రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.16.25 (325%) డివిడెండు చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని