జీ- సోనీ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఇంతకుమునుపు సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా) సంస్థల విలీనానికి జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) గురువారం ఆమోదం తెలిపింది.

Published : 11 Aug 2023 02:32 IST

ముంబయి: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఇంతకుమునుపు సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా) సంస్థల విలీనానికి జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) గురువారం ఆమోదం తెలిపింది. హెచ్‌వీ సుబ్బారావు, మధు సిన్హా నేతృత్వంలోని ఎన్‌సీఎల్‌టీ, ముంబయి ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.82,000 కోట్ల) విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా కంపెనీ అవతరణకు ఈ పరిణామం దారి చూపనుంది.

  •  ఈ రెండు సంస్థల విలీనంపై నెలకొన్న అభ్యంతరాలన్నింటినీ ధర్మాసనం తోసిపుచ్చింది. విలీనానికి సంబంధించి యాక్సిస్‌ ఫైనాన్స్‌, జేసీ ఫ్లవర్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌, ఐడీబీఐ బ్యాంక్‌, ఐమ్యాక్స్‌ కార్ప్‌, ఐడీబీఐ ట్రస్టీషిప్‌ వంటివి లేవనెత్తిన అభ్యంతరాలపై వాదనలు విన్న తర్వాత, జులై 11న ఎన్‌సీఎల్‌టీ తన తీర్పును రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే. గురువారం తీర్పును వెలువరించింది.
  •  జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్‌ తమ వ్యాపారాలను విలీనం చేసేందుకు 2021 డిసెంబరులో ఒప్పందం కుదుర్చుకున్నాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ), బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ), కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ), సెబీల నుంచి విలీనానికి అనుమతులు లభించాక.. ఎన్‌సీఎల్‌టీ అనుమతుల కోసం ఇరు మీడియా సంస్థలు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి. అయితే కొన్ని రుణ సంస్థలు అభ్యంతరాలు లేవనెత్తడంతో విలీన ప్రక్రియను ట్రైబ్యునల్‌ నిలిపేసింది. తాజాగా ఆ అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ.. ఇరు సంస్థల విలీన ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. ఈ పరిణామం నేపథ్యంలో గురువారం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు దూసుకెళ్లింది. బీఎస్‌ఈలో ఇంట్రాడేలో 19.99% దూసుకెళ్లి 52 వారాల గరిష్ఠమైన రూ.290.50ను చేరింది. చివరకు 17.95 శాతానికి లాభాన్ని పరిమితం చేసుకుని రూ.285.55 వద్ద స్థిరపడింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని