Stock Market: ఒక్కసారిగా అమ్మేశారు

మదుపర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 1% నష్టపోయాయి. విదేశీ అమ్మకాలు కొనసాగడం, ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు నష్టాలకు కారణమయ్యాయి. రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ వంటి పెద్ద షేర్లు కుదేలవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

Updated : 29 Sep 2023 07:44 IST

రూ.2.95 లక్షల కోట్ల సంపద ఆవిరి

దుపర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 1% నష్టపోయాయి. విదేశీ అమ్మకాలు కొనసాగడం, ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు నష్టాలకు కారణమయ్యాయి. రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ వంటి పెద్ద షేర్లు కుదేలవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 83.19 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.38% పెరిగి 96.18 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై లాభపడగా, టోక్యో, హాంకాంగ్‌ నష్టపోయాయి. ఐరోపా సూచీలు నీరసంగా కదలాడాయి.

  • సూచీల నష్టాల నేపథ్యంలో బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గురువారం ఒక్కరోజే రూ.2.95 లక్షల కోట్లు తగ్గి రూ.316.65 లక్షల కోట్లకు చేరింది.
  • సెన్సెక్స్‌ ఉదయం 66,406.01 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇంట్రాడేలో 65,423.39 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 610.37 పాయింట్ల నష్టంతో 65,508.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 192.90 పాయింట్లు కోల్పోయి 19,523.55 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 19,492.10-19,766.65 పాయింట్ల మధ్య కదలాడింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 కుదేలయ్యాయి. టెక్‌ మహీంద్రా 4.59%, ఏషియన్‌ పెయింట్స్‌ 3.97%, విప్రో 2.36%, ఎం అండ్‌ ఎం 2.10%, ఇన్ఫోసిస్‌   1.91%, ఐటీసీ 1.87%, కోటక్‌ బ్యాంక్‌ 1.86%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.72%, టైటన్‌ 1.66%, హెచ్‌యూఎల్‌ 1.64% చొప్పున నష్టపోయాయి. ఎల్‌ అండ్‌ టీ 1.69%, పవర్‌గ్రిడ్‌ 0.73%, యాక్సిస్‌ బ్యాంక్‌  0.60% లాభపడ్డాయి. బీఎస్‌ఈలో 2158 షేర్లు నష్టాల్లో ముగియగా, 1504 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 128 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
  • నిరాశపరిచిన యాత్రా ఆన్‌లైన్‌: యాత్రా ఆన్‌లైన్‌ షేర్ల అరంగేట్రం నిరుత్సాహకరంగా సాగింది. ఇష్యూ ధర రూ.142తో పోలిస్తే బీఎస్‌ఈలో షేరు   8.45% నష్టంతో రూ.130 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఒక దశలో 10.28% తగ్గి రూ.127.40 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 4.26% కోల్పోయి రూ.135.95 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2,133.28 కోట్లుగా నమోదైంది.
  • అదానీ గ్రూపునకు చెందిన రెండు కంపెనీల్లో తన వాటానంతా విక్రయించాలని నిర్ణయించినట్లు అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఐహెచ్‌సీ) వెల్లడించింది. ‘అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌లో తన వాటాలను ఒక కొనుగోలుదారుకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామ’ని ఐహెచ్‌సీ తెలిపింది. ఆ కొనుగోలుదారు పేరు మాత్రం వెల్లడించలేదు.

ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ నుంచి కొత్తగా రెండు సిమెంటు బ్రాండ్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ కొత్తగా విశిష్ఠ, స్టీల్‌క్రేట్‌ అనే రెండు సిమెంటు బ్రాండ్లను ఆవిష్కరించింది. నాగార్జున సిమెంట్‌ విశిష్ఠ అనేది పీపీసీ (పోర్ట్‌ల్యాండ్‌ పొజొలోనా సిమెంట్‌) కాగా, స్టీల్‌క్రేట్‌ బ్రాండ్‌ను పర్యావరణానికి మేలు చేసే గ్రీన్‌ సిమెంట్‌గా కంపెనీ అభివర్ణించింది. ఈ 2 బ్రాండ్లతో అత్యంత నాణ్యమైన సిమెంటును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది. కాగా, ప్రస్తుతం నెలకు 3 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. దీన్ని 30% పెంచడానికి విశిష్ఠ బ్రాండ్‌ ముందుండి నడిపించగలదని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని