Tesla: రూ.16,600 కోట్లతో టెస్లా ప్లాంట్‌!

భారత్‌లో 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16,600 కోట్ల) పెట్టుబడులతో విద్యుత్తు కార్ల తయారీ ప్లాంటును పెట్టాలని అమెరికా దిగ్గజ సంస్థ టెస్లా భావిస్తోంది.

Updated : 25 Nov 2023 08:05 IST

తక్కువ సుంకం కోరుతున్న సంస్థ

దిల్లీ: భారత్‌లో 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16,600 కోట్ల) పెట్టుబడులతో విద్యుత్తు కార్ల తయారీ ప్లాంటును పెట్టాలని అమెరికా దిగ్గజ సంస్థ టెస్లా(Tesla) భావిస్తోంది. అయితే ఇందుకు కొన్ని షరతులు పెడుతున్నట్లు ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. తొలి రెండేళ్లలో భారత్‌కు ఎగుమతి చేసే వాహనాలపై 15% దిగుమతి సుంకాన్నే విధించాలని ప్రభుత్వాన్ని కోరుతోందని సమాచారం. టెస్లా కోరికలు ఏమిటంటే..

  • 12,000 వాహనాల దిగుమతికి తక్కువ సుంకం విధిస్తే భారత్‌లో 500 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడతాం.
  • ఒక వేళ 30,000 వాహనాల దిగుమతికి తక్కువ సుంకాన్ని వర్తింపజేస్తే, ప్లాంటుపై పెట్టుబడులను 2 బిలియన్‌ డాలర్లకు పెంచుతాం.
  • తొలి రెండేళ్లలో ‘భారత్‌ తయారీ’ కార్లలో 20% విడిభాగాలను స్థానికంగా సమీకరిస్తుంది. నాలుగేళ్లలో ఈ మొత్తాన్ని 40 శాతానికి పెంచుతుంది.

మోడళ్లు రావొచ్చు.. ధర ఎంత ఉండొచ్చు..: ఒక వేళ అన్నీ అనుకూలిస్తే భారత్‌కు టెస్లాకు చెందిన మూడు మోడళ్లు రావొచ్చు. మోడల్‌ 3, మోడల్‌ వై, కొత్త హ్యాచ్‌బ్యాక్‌ అందులో ఉండొచ్చని.. పన్ను కోతలు అమలైతే వీటి ధరలు రూ.38 లక్షలు, రూ.43 లక్షలు, రూ.20.75 లక్షల మేర ఉండొచ్చని అంచనా.

ప్రస్తుతం భారత్‌లోకి దిగుమతి అవుతున్న కారు ధర, బీమా, రవాణా విలువ అంతా కలిపి 40,000 డాలర్లపైన ఉంటే, 100 శాతం దిగుమతి సుంకం అమలవుతోంది. ఈ మొత్తం విలువ 40,000 డాలర్ల కంటే తక్కువ  ఉంటే.. సుంకం 70 శాతంగా ఉంది. జనవరిలో జరగబోయే ‘వైబ్రంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమిట్‌’లో టెస్లా పెట్టుబడుల ప్రకటన వెలువడవచ్చని ఇటీవలే ‘బ్లూమ్‌బర్గ్‌’ వార్తా సంస్థ పేర్కొన్న విషయం విదితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని