SpiceJet: ముంబయి జంటకు స్పైస్‌జెట్‌లో 19% వాటా!

ముంబయికి చెందిన వ్యాపార వేత్త హరిహర మహాపాత్ర, ఆయన భార్య ప్రీతి కలిసి స్పైస్‌జెట్‌లో రూ.1100 కోట్ల పెట్టుబడి పెట్టి, 19% వాటా కొనుగోలు చేయనున్నారు.

Published : 21 Dec 2023 08:38 IST

రూ.1100 కోట్ల పెట్టుబడులు

ముంబయికి చెందిన వ్యాపార వేత్త హరిహర మహాపాత్ర, ఆయన భార్య ప్రీతి కలిసి స్పైస్‌జెట్‌లో రూ.1100 కోట్ల పెట్టుబడి పెట్టి, 19% వాటా కొనుగోలు చేయనున్నారు. స్పైస్‌జెట్‌ తాజాగా చేపడుతున్న నిధుల సమీకరణ ప్రతిపాదనలో ఈ జంట అతిపెద్ద వాటాదార్లుగా నిలవడం గమనార్హం. 13 కోట్ల కన్వర్టబుల్‌ వారెంట్లు, 32.08 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల(ఒక్కోటీ రూ.50) జారీ ద్వారా రూ.2254 కోట్ల నిధుల సమీకరణకు డిసెంబరు 19న వాటాదార్ల అనుమతిని స్పైస్‌జెట్‌ కోరింది. వాటాదార్ల సమ్మతి కోసం సమర్పించిన పత్రాల ప్రకారం.. ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో మహాపాత్ర జంటతో పాటు మరో 58 మందికి ఈక్విటీ షేర్లు జారీ చేయాలని ప్రతిపాదించారు. రూ.1000 కోట్ల పెట్టుబడుల నిమిత్తం ప్రీతికి 20 కోట్ల షేర్లను(17.66% వాటా)ను జారీ చేస్తారు. రూ.100 కోట్ల పెట్టుబడుల కోసం ఆమె భర్త హరిహర మహాపాత్రకు 1.77% వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను జారీ చేస్తారు.

వారెంట్లు, షేర్ల బదిలీ అనంతరం ఏరిస్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ 3.53%, ఎలారా క్యాపిటల్‌ 8.83% వాటాను పొందుతాయి. దీంతో ప్రమోటరు అజయ్‌ సింగ్‌ వాటా 56.49 శాతం నుంచి 38.55 శాతానికి తగ్గుతుంది.

ఎవరీ మహాపాత్ర?: మహాపాత్ర యూనివర్సల్‌ లిమిటెడ్‌ సహ వ్యవస్థాపకుడే హరిహర మహాపాత్ర. 2011న ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. స్థిరాస్తి, మౌలికం, కన్సల్టింగ్‌, కన్జూమర్‌, రిటైల్‌ రంగాల్లో సేవలందిస్తున్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంది. ప్రీతి విజయవంతంగా పలు అంతర్జాతీయ బ్రాండ్లను ఐరోపా, ఆసియా మార్కెట్లలో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని