ఆరోగ్య బీమా.. ఒకటికి మించి పాలసీలుంటే..

పెరుగుతున్న అనారోగ్య సమస్యలు, జీవన శైలి వ్యాధులు, కొవిడ్‌-19 లాంటి మహమ్మారుల వల్ల ఆరోగ్య బీమా పాలసీలకు ప్రాధాన్యం పెరిగింది. చాలామంది అదనపు రక్షణ కావాలని కోరుకుంటూ.. ఒకటికి మించి వీటిని తీసుకుంటున్నారు. పెరుగుతున్న

Updated : 19 Aug 2022 06:28 IST

పెరుగుతున్న అనారోగ్య సమస్యలు, జీవన శైలి వ్యాధులు, కొవిడ్‌-19 లాంటి మహమ్మారుల వల్ల ఆరోగ్య బీమా పాలసీలకు ప్రాధాన్యం పెరిగింది. చాలామంది అదనపు రక్షణ కావాలని కోరుకుంటూ.. ఒకటికి మించి వీటిని తీసుకుంటున్నారు. పెరుగుతున్న వైద్య ఖర్చులను తట్టుకునేందుకు ఇది అవసరమూ అవుతోంది. ఈ నేపథ్యంలో రెండు లేదా అంతకు మించి ఆరోగ్య బీమా పాలసీలున్నప్పుడు క్లెయిం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

అనారోగ్యంలో ఆర్థిక కష్టం రాకుండా ఆరోగ్య బీమా పాలసీ తోడుంటుంది. ఆధునిక చికిత్స పద్ధతులు, ఇతర అనేక కారణాలతో నేడు వైద్య ద్రవ్యోల్బణం నానాటికీ పెరుగుతోంది. మారుతున్న ఈ అవసరాలకు తగ్గట్టుగా పాలసీ మొత్తాన్నీ, సంఖ్యనూ పెంచుకోవాల్సిందే. ఇదే సమయంలో అవసరం వచ్చినప్పుడు పరిహారం పొందేందుకు అనుసరించాల్సిన మార్గాలు, అందించాల్సిన పత్రాలు, ఇంటి వద్ద చికిత్సకు ఏ విధంగా క్లెయిం చేసుకోవాలిలాంటి అంశాలపై అవగాహన ఉండాలి.

నగదు రహిత చికిత్స కోసం..

ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు రెండు పాలసీలు తీసుకుంటున్నారు. యాజమాన్యం అందించే బృంద బీమా పాలసీతోపాటు, వ్యక్తిగతంగా కుటుంబానికి అంతటికీ వర్తించేలా మరో పాలసీ తీసుకుంటున్నారు. కొంతమంది సొంతంగానే రెండు వేర్వేరు కంపెనీల నుంచి పాలసీలను తీసుకుంటారు. అనారోగ్య పరిస్థితుల్లో పాలసీ నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో చేరి, నగదు రహిత చికిత్స పొందేందుకు వీలవుతుంది. అప్పుడు అక్కడ ఒక పాలసీని వినియోగించుకునేందుకు వీలుంది. ఒకవేళ చికిత్స ఖర్చు పాలసీ మొత్తాన్ని మించిపోతే.. అప్పుడు రెండో బీమా సంస్థ నుంచి ఆ అదనపు మొత్తాన్ని క్లెయిం చేసుకోవచ్చు. దీనికోసం ఆసుపత్రి నుంచి బిల్లులన్నీ తీసుకోవాలి. మొదటి బీమా సంస్థ చెల్లించిన పరిహారం వివరాలనూ జత చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఆసుపత్రి రెండు బీమా సంస్థల నెట్‌వర్క్‌లోనూ ఉండొచ్చు. ఇలాంటప్పుడు.. ఆ బీమా సంస్థలను సంప్రదించి, నగదు రహిత చికిత్సకు అనుమతిస్తారా? లేదా రీఇంబర్స్‌మెంట్‌ చేసుకోవాలా అనేది తెలుసుకోవాలి. చికిత్స ఖర్చు అధికంగా అవుతుందని అనుకుంటేనే రెండు పాలసీలు ఉన్న విషయాన్ని ఆసుపత్రికి తెలియజేయండి.

నెట్‌వర్క్‌ ఆసుపత్రి కాకుండా..

మీరు తీసుకున్న రెండు బీమా సంస్థల నెట్‌వర్క్‌ జాబితాలో లేని ఆసుపత్రిలో చేరారు అనుకుందాం. ఇలాంటప్పుడు పాలసీదారుడు ఆసుపత్రి బిల్లులను చెల్లించి, ఆ తర్వాత పరిహారం కోసం బీమా సంస్థలను సంప్రదించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు క్లెయిం పత్రం పూర్తి చేసి, దానికి ప్రతి బిల్లునూ జత చేయాలి. వైద్య పరీక్షల నివేదికలు, ఎక్స్‌-రేలు తదితరాలన్నీ అందించాలి. ముందుగా ఎంత మొత్తానికి క్లెయిం చేసుకుంటున్నారన్నది చూసుకోండి. రెండు పాలసీల్లో ఏది అధిక మొత్తం అందిస్తుందో దాని కోసం దరఖాస్తు చేసుకోండి. ఒక పాలసీ పూర్తిగా వాడుకున్న తర్వాత అధికంగా అయ్యే మొత్తాన్ని రెండో బీమా సంస్థ నుంచి రాబట్టుకోవచ్చు. అయితే, దీనికోసం బిల్లులన్నింటినీ ఆసుపత్రి అధీకృతం (అటెస్టేషన్‌) చేయాలి. మొదటి బీమా సంస్థ ఇచ్చిన క్లెయిం వివరాలనూ తప్పనిసరిగా జత చేయాలి. అప్పుడే రెండో బీమా సంస్థ అధికంగా అయిన మొత్తాన్ని చెల్లిస్తుంది.

ఇతర ఖర్చుల మాటేమిటి?

సాధారణంగా ఆసుపత్రిలో చేరే ముందు.. ఇంటికి వెళ్లిన తర్వాత కొన్ని ఖర్చులు అవుతుంటాయి. ఆరోగ్య పరీక్షలు, మందులు, ఇతర వ్యయాలు ఇందులో ఉంటాయి. బీమా సంస్థలు ఆసుపత్రిలో చేరకముందు, ఇంటికి వెళ్లాక 60 రోజుల వరకూ అయ్యే ఖర్చును చెల్లిస్తుంటాయి. కొన్నిపాలసీల్లో ఫిజియోథెరపీ ఇతర చికిత్సలకు అయ్యే ఖర్చులకు క్లెయిం రాకపోవచ్చు. ప్రత్యేకంగా పాలసీలో వీటికీ పరిహారం ఇస్తామనే నిబంధన ఉంటేనే ఇది వర్తిస్తుంది. మీ దగ్గర ఉన్న పాలసీల్లో ఇలాంటి చికిత్సలకూ పరిహారం లభిస్తుందా చూసుకోండి. వర్తిస్తే ఆ బీమా సంస్థకు క్లెయిం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  

ఒకటికి మంచి పాలసీలున్నప్పుడు ఆర్థికంగా రక్షణ పెరుగుతుంది. పాలసీలను ఎంచుకునేటప్పుడు నియమ నిబంధనలు ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. బృంద బీమా పాలసీ ఉన్న బీమా సంస్థ నుంచే వ్యక్తిగత పాలసీని తీసుకోవడం వల్ల క్లెయిం పరిష్కారం మరింత వేగంగా జరిగేందుకూ అవకాశం ఉంది. టాపప్‌ పాలసీలను ఎంచుకునేటప్పుడూ ఇదే సూత్రం వర్తిస్తుంది. బీమా తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్య సమాచారంలో దాపరికం లేకుండా చూసుకోవాలి. చిన్న పొరపాటు చేసినా బీమా సంస్థ క్లెయింను తిరస్కరించే అవకాశం ఉంది.

- భాస్కర్‌ నెరుకార్, హెడ్‌-హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts