EPFO: ఈపీఎఫ్‌/ఈపీఎస్‌ కోసం ఈ- నామినేషన్‌ దాఖలు చేశారా?

ఆన్‌లైన్‌ ద్వారా ఈ-నామినేషన్‌ ఫైల్‌ చేసే చందాదారులు తమ యూఏఎన్‌ నంబరును ఈపీఎఫ్‌ పోర్టల్‌లో యాక్టివేట్‌ చేసుకుని ఉండాలి. 

Published : 29 Sep 2022 19:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)  తమ చందాదారులకు ప్రావిడెండ్‌ ఫండ్‌ (PF), పెన్షన్‌ (EPS), బీమా (EDLI) వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఒకవేళ ఈపీఎఫ్‌ ఖాతాదారుడు మరణిస్తే, ఎంప్లాయిస్‌ పెన్షన్‌ స్కీమ్‌, ఎంప్లాయిస్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సురెన్స్‌ స్కీమ్‌ ప్రయోజనాలు నామినీ లేదా ఆధారిత కుటుంబ సభ్యుల (జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు)కు త్వరగా అందేలా ఈ-నామినేషన్‌ సహాయపడుతుంది. ఈ-నామినేషన్‌ కోసం ఈపీఎఫ్‌ఓ ఎలాంటి గడువూ విధించ లేదు. అలాగే అడ్వాన్స్‌ క్లెయిమ్‌ ఫైలింగ్‌ కోసం కూడా ఈ-నామినేషన్‌ దాఖలు చేయనవసరం లేదు. నామినేషన్‌ సబ్మిట్‌ చేసేందుకు చందాదారులు ఈపీఎఫ్‌ఓ కార్యాలయాన్ని సందర్శించాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా సమర్పించవచ్చు. అయితే ఇందుకోసం ఉద్యోగులు తమ యూఏఎన్‌ నంబర్‌ను ఈపీఎఫ్‌ పోర్టల్‌లో యాక్టివేట్‌ చేసుకుని ఉండాలి. 

ఈ-నామినేషన్‌ దాఖలు చేయడం వల్ల ప్రయోజనాలు..

చందాదారుల కుటుంబ సభ్యుల భద్రత కోసం ఎంప్లాయిస్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సురెన్స్‌ స్కీమ్‌ (EDLI) ను రూ. 7 లక్షల ప్రయోజనంతో అందిస్తుంది. ఈ ప్రయోజనం కుటుంబ సభ్యులకు చేరేందుకు చందాదారులు ఈ-నామినేషన్‌ తప్పనిసరిగా సమర్పించాలి. ఈ-నామినేషన్‌ సబ్మిట్‌ చేయడం వల్ల చందాదారుల మరణానంతరం పీఎఫ్‌, పెన్షన్‌పండ్‌, బీమా ప్రయోజనాలు.. ఆన్‌లైన్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా సులభంగా, కాగితరహితంగా, త్వరగా లబ్ధిదారులకు చేరతాయి. ఈపీఎఫ్‌ నామినేషన్‌ ఫైల్‌ చేసిన తర్వాత అప్‌డేట్‌ కూడా ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌ ఈ-నామినేషన్‌ ఫైల్‌ చేసే విధానం..

ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం ఆధార్‌తో ధ్రువీకరించిన యూఏఎన్‌ ఉన్న సభ్యులు మాత్రమే ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో నామినేషన్‌ ఇవ్వగలరు. ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి కాబట్టి యూఏఎన్‌ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు సభ్యుని పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు సరైనవే అని నిర్ధారించుకోవాలి. అప్పుడే ఆధార్‌తో సరిపోలతాయి. దీంతో పాటు తండ్రి పేరు, వైవాహిక స్థితి, ఉద్యోగంలో చేరిన తేదీ, చిరునామా వంటి సమాచారాన్ని అందించాలి. అలాగే చందాదారులు తమ ఫోటోని సూచించిన విధంగా అప్‌లోడ్‌ చేయాలి. ఇది తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం మాత్రమే ఈ-నామినేషన్‌ ఫైలింగ్‌ సాధ్యపడుతుంది. 

  • ముందుగా epfindia.gov.in కి పేజీకి వెళ్లి మీ యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో ఈపీఎఫ్‌ ఖాతాకు లాగిన్‌ అవ్వాలి. 
  • ఆ తర్వాత ‘మ్యానేజ్‌’ సెక్షన్‌లో ‘ఈ-నామినేషన్‌’ ఆప్షన్ను ఎంచుకోవాలి. 
  • ఫ్యామిలీ ఉందా (Having Family) అనే ఆప్షన్‌ వస్తుంది. ఇక్కడ ‘యస్‌’ పై క్లిక్‌ చేసి మీ కుటుంబ సభ్యుల వివరాలు.. ఆధార్‌, పేరు, పుట్టిన తేదీ, లింగం, నామినీకి మీతో ఉన్న సంబంధం (రిలేషన్‌), చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్‌ చేయాలి. ఇక్కడ గార్డియన్‌ ఆప్షన్‌ ఉంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్‌. ఫోటో (100kb కంటే తక్కువ ఉండాలి) అప్‌లోడ్‌ చేయాలి. 
  • ఇక్కడ ఒకరి కంటే ఎక్కువ సభ్యుల వివరాలను కూడా ఎంటర్‌ చేయవచ్చు. ఇందుకోసం ‘యాడ్‌’ పై క్లిక్ చేయాలి. ఎక్కువ మంది సభ్యులను నామినేట్‌ చేసినప్పుడు ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా ఇక్కడే తెలపాలి. ఒకసారి వివరాల్నింటినీ సరి చూసుకుని ‘సేవ్‌ ఈపీఎఫ్‌ నామినేషన్‌’పై క్లిక్‌ చేస్తే తర్వాతి పేజీకి రీడైరెక్ట్‌ అవుతుంది. 
  • ఇక్కడ నామినేషన్‌ ఎంటర్‌ చేసిన సమయం, వ్యూ, ఎడిట్‌, ఈ-సైన్‌, డిలీట్‌ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ‘ఈ-సైన్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే, వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) జనరేట్‌ అవుతుంది. మీ ఆధార్‌కు అనుసందానమైన ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేసి ఈ-నామినేషన్‌ పూర్తి చేయవచ్చు. 

ఈపీఎఫ్‌ఓ ప్రకారం.. ఈ-నామినేషన్‌ సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

  • చందాదారులు.. ఒకరి కంటే ఎక్కువ కుటుంబ సభ్యులను నామినేట్‌ చేయవచ్చు. ఒకవేళ సభ్యుడికి వివాహం అయితే.. భార్య, పిల్లలను నామినీలుగా తప్పనిసరిగా చేర్చాలి. ఎందుకంటే పెన్షన్‌ ఫండ్‌ కోసం కుటుంబ సభ్యులుగా భార్య, పిల్లలనే నిర్వచించడం జరిగింది. 
  • ఫైలింగ్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందే కుటుంబ సభ్యుల ఆధార్‌, ఫోటోలను సిద్ధం చేసి ఉంచుకోవాలి. 
  • వివాహం కానీ, ఇతర కుటుంబ సభ్యులు లేని వారు మాత్రమే రిలేషన్‌తో సంబంధం లేకుండా ఎవరినైనా నామినేట్‌ చేయవచ్చు. పెన్షన్‌ నామినేషన్‌ లింక్‌ ఒక సభ్యుని నామినేట్‌ చేసేందుకు మాత్రమే అనుమతిస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో వివాహం జరిగి కుటుంబ సభ్యులు వస్తే ఈ-నామినీ చెల్లదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని