మన మొబైల్‌లోనే.. బంగారం నాణ్యత ధ్రువీకరణ

బంగారం ధరలు మండిపోతున్న నేపథ్యంలో.. కొనుగోలుదారుల చెల్లించే సొమ్ముకు తగిన స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణం పొందడంలో, వారు మోసపోకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Updated : 22 Apr 2023 07:22 IST

ఈనాడు వాణిజ్య విభాగం : బంగారం ధరలు మండిపోతున్న నేపథ్యంలో.. కొనుగోలుదారుల చెల్లించే సొమ్ముకు తగిన స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణం పొందడంలో, వారు మోసపోకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బీఐఎస్‌ కేర్‌ యాప్‌ను విడుదల చేసింది. మన మొబైల్‌లో ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, ఆభరణంపై ఉండే హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్‌ యునీక్‌ ఐడెంటిఫికేషన్‌) నంబరు అసలుదో, కాదో ధ్రువీకరించుకోవచ్చు. హాల్‌మార్కింగ్‌ నంబరును కేటాయించడంలో కొన్ని అసైనింగ్‌ సెంటర్లు మోసాలు చేస్తున్నందునే, ప్రతి ఆభరణానికీ ప్రత్యేక హెచ్‌యూఐడీ ముద్రించాలని ప్రభుత్వం ఆదేశించింది.

* ప్రతి బంగారం, వెండి, వజ్రాభరణానికీ హెచ్‌యూఐడీ ఉండాలి.

* కుందన్‌, వ్యాక్స్‌, జాడవ్‌ ఆభరణాలకు, 2 గ్రాముల లోపు ఆభరణాలకు ఇది ఉండదు.  

ప్రతి హాల్‌మార్కింగ్‌ ఆభరణంపై ఇవి ఉంటాయి

పసిడి, వెండి, వజ్రాభరణాలకు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) నిర్దేశించిన ప్రమాణాల మేరకు హెచ్‌యూఐడీ తప్పనిసరి.

2021 జులైకి ముందు.. ఆభరణంపై బీఐఎస్‌ చిహ్నం, పసిడి స్వచ్ఛత (22 క్యారెట్‌/ 916, 18 క్యారెట్‌/750, 14 క్యారెట్‌/585); హాల్‌మార్కింగ్‌ కేంద్ర గుర్తు/సంఖ్య, ఆభరణ దుకాణ చిహ్నం/సంఖ్య ముద్రించేవారు. వెండి ఆభరణాలకైతే స్వచ్ఛత (990, 970, 925, 900, 835, 800)తో పాటు మిగిలిన చిహ్నాలు ఉండేవి.

2021 జులై నుంచి బీఐఎస్‌ చిహ్నం, పసిడి స్వచ్ఛత, 6 అంకెలు-అక్షరాలతో కూడిన హెచ్‌యూఐడీ మాత్రమే ముద్రిస్తున్నారు. హెచ్‌యూఐడీని కేంద్రీకృత సాఫ్ట్‌వేర్‌తో రూపొందించారు. ప్రతి ఆభరణానికి ఈ సంఖ్య ప్రత్యేకంగా ఉంటుంది.

* ప్రస్తుతం పసిడిలో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల ఆభరణాలకు; వెండిలో 990, 970, 925, 900, 835, 800 స్వచ్ఛత కలిగిన ఆభరణాలకూ హెచ్‌యూఐడీ ముద్రిస్తున్నారు. పసిడి ఆభరణానికి రూ.35, వెండి ఆభరణానికి రూ.25 మాత్రమే ఇందుకు వ్యయం అవుతుంది.

* హెచ్‌యూఐడీని ఆభరణాలపై తయారీ సంస్థలే వేయిస్తుంటాయి. స్థానిక తయారీదార్లు, ఆభరణాల విక్రేతలు అందుబాటులోని అసైనింగ్‌ కేంద్రాల్లో ముద్రింప చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణాలో 38, ఆంధ్రప్రదేశ్‌లో 66 అధీకృత కేంద్రాలున్నట్లు బీఐఎస్‌ వెబ్‌సైట్‌ వెల్లడిస్తోంది.

ఇలా పరిశీలించుకోవాలి

విక్రయశాలలో ఆభరణాలు కొనుగోలు చేస్తున్నప్పుడు, దానిపై ఉండే హెచ్‌యూఐడీ వివరాలను మన మొబైల్‌లో ఉండే బీఐఎస్‌ కేర్‌ యాప్‌లో నమోదు చేయగానే, ఆ నంబరు అసలైనదా లేక నకిలీయా అనేది తెలిసిపోతుంది. ఎవరు తయారు చేశారు, ఏ సంవత్సరం-నెలలో రూపొందించారు అనే వివరాలు కూడా వస్తాయి. ఇందువల్ల ప్రతి ఆభరణ విక్రయం నమోదు కావడంతో పాటు, ప్రభుత్వానికి పన్ను ఆదాయం కచ్చితంగా లభిస్తుంది.

ఇకపై డీలర్లకే ప్రధాన బాధ్యత

సాధారణంగా ముంబయి, కోల్‌కతా, గుజరాత్‌లలోని డీలర్లకు ఇక్కడి విక్రేతలు ఆర్డరు ఇచ్చి ఆభరణాలు చేయిస్తుంటారు. హెచ్‌ఐయూడీ బాధ్యతను కూడా ఇకపై వ్యాపారులు డీలర్లకే అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందువల్ల ఒకవేళ ఆభరణం నాణ్యతలో తేడా ఏమైనా ఉంటే, సంబంధిత డీలర్‌పైనే వినియోగదారు కేసు పెట్టాల్సి వస్తుంది. స్థానికంగా హాల్‌మార్కింగ్‌/అసైనింగ్‌ కేంద్రాల్లోనూ హెచ్‌యూఐడీనీ ఆభరణాల తయారీదార్లు/విక్రయశాలల వారు వేయించొచ్చు. కానీ యాప్‌లో మనం ధ్రువీకరించుకోవచ్చు కనుక, నకిలీకి వీలుండదు.

జరిమానాలు 120%

హెచ్‌యూఐడీ లేకుండా ఆభరణాలు విక్రయిస్తే, ఆయా దుకాణాల్లోని సంబంధిత సరకు విలువపై 120% జరిమానా విధించడంతో పాటు, దుకాణాన్ని సీజ్‌ చేసేలా నిబంధనలు రూపొందించారు. ‘హెచ్‌యూఐడీతో నగలు విక్రయించడం వల్ల నకిలీ హాల్‌మార్కింగ్‌ను నిరోధించవచ్చు. అయితే ప్రభుత్వం తగిన నిఘా వేయకపోతే, ఇవీ నకిలీవి ముద్రించే వీలుంది. కొనుగోలుదారుకు బీఐఎస్‌ కేర్‌ యాప్‌పై అవగాహన లేదని భావిస్తే, విక్రయదార్లు మోసం చేయొచ్చు. ఈ ముద్ర లేకుండా, జీఎస్‌టీ 3 శాతాన్ని మినహాయిస్తామని విక్రేత చెపితే, అమాయక కొనుగోలుదారులు సుముఖత వ్యక్తం చేయొచ్చు. ఆభరణాల విక్రయశాలలన్నింటినీ తనిఖీ చేసే వ్యవస్థ లేనందున, ఆభరణాలను తయారు చేసి, దుకాణాలకు సరఫరా చేసే డీలర్లపై కఠిన నిఘా పెడితే, చాలావరకు నకిలీలను నియంత్రించవచ్చు. యాప్‌లో ఆభరణ తయారీ సమయం కూడా ఉంటోంది. ఇది తొలగిస్తే బాగుంటుంద’ని బుశెట్టి జ్యూయలర్స్‌ అధినేత బుశెట్టి రామ్మోహనరావు చెప్పారు.

హెచ్‌యూఐడీ వల్ల ఆరోగ్యానికీ భరోసా

హాల్‌మార్క్‌ను లేజర్‌ యంత్రంతో ముద్రించేస్తారు. అదే హెచ్‌యూఐడీ వేయాలంటే ఆభరణాన్ని కాల్చడంతో పాటు, స్క్రాప్‌ తీస్తారు. ఇందువల్ల బంగారంతో పాటు ఇరేడియం, పెల్లేడియం వంటి శరీరానికి హాని కలిగించే, క్యాన్సర్‌ వ్యాధికి కారణమయ్యే పదార్థాలను కలిపారా అనేది వెల్లడవుతుంది కనుక ఆరోగ్యానికీ భరోసా ఉంటుందని రామ్మోహనరావు వెల్లడించారు. బంగారంలో ఇలాంటివి కలిపినప్పుడు పరీక్షించినా, స్వచ్ఛత మారదు. అయితే ఆభరణాన్ని కరిగించినప్పుడు స్వచ్ఛత తగ్గుతుంది. నగ తయారీలో బంగారానికి జింక్‌, రాగి, వెండి మాత్రమే కలపాల్సి ఉంది. వేరే పదార్థం ఏమి కలిసినా, హెచ్‌యూఐడీ వేయరు. వెండిలో కూడా జెస్‌ అనే పదార్థం కలిపి మోసగించే అవకాశం ఉంది. కరిగించినప్పుడే స్వచ్ఛత నిర్థారణ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని