బాండ్లలో మదుపు చేస్తుంటే...

నష్టభయం తక్కువగా ఉన్న పథకాల్లో మదుపు చేయాలి.. నెలనెలా వడ్డీ రూపంలో ఆదాయం అందుకోవాలని భావించే వారికి బాండ్లు ఒక మంచి మార్గం.

Published : 09 Jun 2023 00:33 IST

నష్టభయం తక్కువగా ఉన్న పథకాల్లో మదుపు చేయాలి.. నెలనెలా వడ్డీ రూపంలో ఆదాయం అందుకోవాలని భావించే వారికి బాండ్లు ఒక మంచి మార్గం. వీటిలో మదుపు చేయడం, రాబడి ఎలా వస్తుందో అర్థం చేసుకుంటే ఒక నమ్మకమైన ఆదాయ వనరును సృష్టించుకోవవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

ప్రభుత్వాలు, సంస్థలు తమ నగదు అవసరాల కోసం రుణం తీసుకునేందుకు బాండ్లను జారీ చేస్తుంటాయి. ఒక బాండులో పెట్టుబడి పెడుతున్నారంటే.. వాటిని జారీ చేసిన వారికి నిర్ణీత వ్యవధికి అప్పు ఇస్తున్నట్లు లెక్క. బదులుగా సాధారణ వడ్డీని చెల్లిస్తూ, గడువు తీరిన నాడు అసలు మొత్తాన్ని తిరిగి ఇస్తారు. ఇందుకు వాగ్దానంగా మీకు బాండును జారీ చేస్తారు. కొన్ని బాండ్లు నెలనెలా వడ్డీని ఇస్తే, కొన్ని మూడు, ఆరు నెలలు, ఏడాదికోసారి వడ్డీనిస్తాయి. 10 ఏళ్ల వ్యవధికి రూ.1,00,000 బాండులో 12 శాతం వడ్డీకి మదుపు చేశారనుకుందాం. అప్పుడు నెలనెలా రూ.1,000 రాబడిని అందుకోవచ్చు. స్థిరంగా నగదు రావాలి లేదా దీర్ఘకాలంపాటు వడ్డీ జమ కావాలని భావించేవారికి బాండ్లు ఒక ఆకర్షణీయమైన ఎంపిక అని చెప్పొచ్చు.

క్రమం తప్పకుండా: బాండ్లు హామీతో కూడిన వడ్డీ రేటును అందిస్తాయి. ఇతర పెట్టుబడులతో పోలిస్తే మదుపరులు తమ రాబడిని కచ్చితంగా అంచనా వేసుకోవచ్చు.

నష్టభయం: షేర్లతో పోలిస్తే బాండ్లలో అనిశ్చితి తక్కువగా ఉంటుంది. మార్కెట్‌ పతనం అవుతున్నప్పుడూ మూలధనానికి పెద్దగా ఇబ్బంది ఉండదు.

అనుకూలంగా: బాండ్లు నిర్ణీత వ్యవధులతో ఉంటాయి. మదుపరులు తమకు నచ్చిన వ్యవధికి వీటిని తీసుకోవచ్చు. ఆర్థిక లక్ష్యాలను బట్టి, వ్యవధులను నిర్ణయించుకుందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి.


ఎఫ్‌డీలకు ప్రత్యామ్నాయమా?

పెట్టుబడికి హామీ అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే. మరి ఈ బాండ్లు వీటికి ప్రత్యామ్నాయమా అనే సందేహం రావడం సహజం. ఎఫ్‌డీలతో పాటు మరో భిన్నమైన పథకాన్ని ఎంచుకోవాలనుకున్నప్పుడు బాండ్లు పరిశీలించవవచ్చు.

* బాండ్లు సాధారణంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటును చెల్లిస్తాయి. మీరు మీ పెట్టుబడి కాల వ్యవధికి అనుగుణంగా మెచ్యూరిటీ తేదీలను ఎంచుకోవచ్చు.

* బాండ్లను ఎక్స్ఛేంజీల్లో సులభంగా క్రయవిక్రయాలు చేయొచ్చు. పెట్టుబడిదారులకు నగదు అవసరమైనప్పుడు, పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేసుకోవాలనుకున్నప్పుడు ఇవి సౌలభ్యంగా ఉంటాయి. మరోవైపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ముందుగా వెనక్కి తీసుకుంటే.. జరిమానా ఉంటుంది. మారుతున్న ఆర్థిక అవసరాలకు నిధుల సమీకరణను ఇది నిరోధిస్తుంది.

బాండ్లకు నిర్ణీత లాకిన్‌ వ్యవధి అంటూ ఉండదు. మార్కెట్‌ పరిస్థితులను బట్టి, పెట్టుబడిదారులు వాటిని విక్రయించుకోవచ్చు. ఉపసంహరణకు ఎలాంటి అపరాధ రుసుములూ ఉండవు.


ప్రతికూలతలూ ఉన్నాయి...

బాండ్లు అనేక ప్రయోజనాలు అందిస్తున్నప్పుటికీ.. కొన్ని పరిమితులూ, ప్రతికూలతలూ ఉన్నాయి.

వడ్డీ రేటు: బాండ్ల ధరలు, వడ్డీ రేట్ల మధ్య విలోమ సంబంధం ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ల విలువ తగ్గుతుంది. ఇది పెట్టుబడిదారుల మూలధనంపై ప్రభావం చూపిస్తుంది.

నష్టభయం: బాండ్లను జారీ చేసిన వారు దివాలా తీసే ప్రమాదం లేకపోలేదు. సాధారణంగా తక్కువ రేటింగ్‌ బాండ్లలో ఈ పరిస్థితి ఎదురవుతుంది.

ద్రవ్యోల్బణం: కాలక్రమేణా ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటుంది. స్థిరమైన వడ్డీ కోసం చూసినప్పుడు, అందించే రాబడి కొనుగోలు శక్తిని క్షీణింపజేస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బాండ్లలో రాబడి రాకపోవచ్చు.

నగదుగా మార్చుకోవడం: కొన్ని బాండ్లను ఎక్స్ఛేంజీల్లో అంత సులభంగా విక్రయించలేం. అప్పుడు నగదుగా మార్చుకోవడంలో ఇబ్బంది రావచ్చు. ఎఫ్‌డీల్లో కనీసం అపరాధ రుసుము వర్తిస్తుంది. ఇందులో ఆ సౌలభ్యమూ ఉండదు.

బాండ్లలో మదుపు చేయడం సులభమే. డీమ్యాట్‌ ఖాతా ఉంటే చాలు. నిమిషాల్లోనే బాండ్లలో మదుపు చేయొచ్చు. వీటిలో మదుపు చేసినప్పుడు అన్ని వివరాలూ ముందుగానే తెలుసుకోవాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకున్నాకే ముందడుగు వేయాలి.

విశాల్‌ గోయెంకా, సహ వ్యవస్థాపకుడు, ఇండియాబాండ్స్‌.కామ్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని