ఆర్థిక వృద్ధికి అడుగులిలా

కొత్త ఏడాది సమీపిస్తోంది.. మంచి, చెడు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. 2024కు స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నాం. ఆర్థికంగా ఇప్పుడు మనం ఎక్కడున్నాం..

Updated : 29 Dec 2023 07:06 IST

కొత్త ఏడాది సమీపిస్తోంది.. మంచి, చెడు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. 2024కు స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నాం. ఆర్థికంగా ఇప్పుడు మనం ఎక్కడున్నాం.. ఏ స్థాయికి చేరాలని అనుకుంటున్నాం అని సమీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఈ నేపథ్యంలో మనం ఆర్థిక వృద్ధిని సాధించేందుకు ఏం చేయాలి? దీనికోసం పాటించాల్సిన కొన్ని సూత్రాలు మీకోసం...

ఇప్పటి వరకూ ఏం చేశాం? మున్ముందు ఏం చేయాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు.. ఆకాంక్షలు తీరేందుకు అవసరమైన సంపదను సృష్టించుకోవాల్సిన తరుణమిది. ఈ నేపథ్యంలో 2024లో ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరేందుకు 24 మార్గాలను చూద్దాం.

  1. ఈ రోజు తీసుకున్న సరైన ఆర్థిక నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఏదైనా ఖర్చు చేసే ముందు ప్రతి నెలా మీ ఆదాయంలో 20 శాతం ఆదా చేయడం నేర్చుకోండి. 3-6 నెలలకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా ఉంచుకోండి.

  2. డిపాజిట్‌ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మెరుగైన రాబడి కోసం దీర్ఘకాలిక రికరింగ్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ప్రారంభించండి. 5-10 ఏళ్ల డిపాజిట్లపై 6.5-8శాతం వరకూ వడ్డీని బ్యాంకులు అందిస్తున్నాయి. మీ పొదుపు ప్రయత్నాలను పెంచేందుకు ఈ రోజే ఎఫ్‌డీని ప్రారంభించండి.

  3. వ్యక్తులు భిన్నంగా ఉండొచ్చు. కానీ, అందరి ఆర్థిక అవసరాలూ దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. అందరమూ సొంతిల్లు, పొదుపు, మంచి ఆరోగ్యం,  పిల్లలకు ఉన్నత చదువులు, స్థిరమైన ఆదాయం కోరుకుంటాం. 2024లో ఈ ప్రతి ఆర్థిక లక్ష్యాన్ని ఎలా సాధించాలనే దానిపై లోతుగా ఆలోచించండి.

  4. ఆదాయ వ్యయాలపై బడ్జెట్‌ ఉండాలి. డబ్బు అవసరాలు (అద్దె, ఆహారం), కోరికలు (కొనుగోళ్లు, ప్రయాణాలు), లక్ష్యాలకు (ఇల్లు కొనుగోలు) ఇలా ప్రతి అంశానికీ బడ్జెట్‌ ప్రకారమే కేటాయింపులు ఉండాలి.

  5. ఆదాయపు పన్ను మినహాయింపు పొందేందుకు సెక్షన్‌ 80సీని ఉపయోగించుకోండి. దీనికోసం ఒక ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో నెలనెలా క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా మదుపు చేయండి. గత 20 ఏళ్లుగా ఇవి సగటున 12-15 శాతం వరకూ రాబడినిస్తున్నాయి.

  6. పదవీ విరమణపై దృష్టి పెట్టండి. ఉద్యోగంలో చేరిన వెంటనే దీనికి శ్రీకారం చుట్టాలి. మీ వార్షిక అవసరాలకు సరిపోయే మొత్తాన్ని 25 రెట్ల వరకూ జమ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ ద్వారా నెలకు రూ.500లతో పెట్టుబడిని ప్రారంభించండి.

  7. ఆస్తులను కూడబెట్టే ప్రయత్నం చేయండి. ఈక్విటీలు, బంగారం, స్థిరాస్తి, బాండ్లు, అంకురాల్లో పెట్టుబడులు ఇలా వైవిధ్యంగా ఆలోచించండి. చిన్న మొత్తాలతో పెట్టుబడులు ప్రారంభించండి. వాటిని క్రమంగా పెంచుకుంటూ వెళ్లండి. బంగారంలో మదుపు చేయాలనుకున్నప్పుడు గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, వాణిజ్య స్థిరాస్తులలో పెట్టుబడుల కోసం రీట్స్‌ వంటివి ఎంచుకోండి.

  8. మీ ఆర్థికారోగ్యాన్ని తెలుసుకునేందుకు క్రెడిట్‌ స్కోరు ఎంతో కీలకం. ఇది బాగున్నప్పుడే మీకు మంచి నిబంధనలతో రుణం లభిస్తుంది. ఇది తక్కువగా ఉన్నప్పుడు దాన్ని సరిచేసుకునేందుకు ప్రయత్నించాలి.

  9. క్రెడిట్‌ కార్డు బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించేయండి. మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై రివార్డులను పెంచుకోండి. రివార్డుల ద్వారా ఆదా అయిన మొత్తాన్ని మీరు సంపాదించినట్లే లెక్క.

  10. చిన్న మొత్తాల్లో రుణాలు ఇచ్చేందుకు డిజిటల్‌ రుణ సంస్థలు విపరీతంగా ఉన్నాయి. ఎవరి నుంచి రుణం తీసుకుంటున్నారో చూసుకోండి. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల వంటి ఆర్‌బీఐ నియంత్రణ సంస్థల నుంచి మాత్రమే రుణం తీసుకోండి. అధిక వడ్డీ రుణాలను వీలైనంత తొందరగా తీర్చేయండి.

  11. 2024లో అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రయత్నించండి. రెండు మూడు విధాలుగా ఆదాయాన్ని ఆర్జించినప్పుడే మీ లక్ష్యాలను వేగంగా అందుకోగలరు. దీనికి ఉపయోగపడే కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి.

  12. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం చేయొద్దు. దీనివల్ల అపరాధ రుసుములు చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్‌ స్కోరూ దెబ్బతింటుంది. మీ క్రెడిట్‌ కార్డు చెల్లింపులు, విద్యుత్‌, నీటి బిల్లులు, ఈఎంఐలను నేరుగా బ్యాంకు ఖాతాలో నుంచే చెల్లింపులు జరిగేలా‘ఆటోమేట్‌’ చేయండి.

  13. పన్ను ఆదా చేసుకునేందుకు అనువైన మార్గాలను చూసుకోండి. ఎంత పన్ను చెల్లించాలి? దాన్ని ఎలా ఆదా చేయాలి? అంచనాలుండాలి. వీలైనంత తొందరగా పన్ను మినహాయింపు పెట్టుబడులను పూర్తి చేయండి.

  14. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక రక్షణ ఉండేలా చూసుకోండి. దీనికోసం కుటుంబం అంతటికీ వర్తించేలా కనీసం రూ.10 లక్షల విలువైన ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి. కనీసం రూ.40 లక్షల సూపర్‌ టాపప్‌ పాలసీ ఉండాలి.

  15. అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేలా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోండి. మీ వార్షికాదాయానికి కనీసం 20 రెట్ల వరకూ విలువైన పాలసీని తీసుకోండి.

  16. రుణాన్ని సాధ్యమైనంత వేగంగా వదిలించుకోండి. అప్పుడే ఆర్థిక ప్రశాంతత దొరుకుతుంది. మీ రుణ మొత్తంలో ఏటా 5 శాతాన్ని అదనంగా చెల్లించేందుకు ప్రయత్నించండి. దీనివల్ల అనుకున్న వ్యవధికన్నా ముందే అప్పు తీరుతుంది. వడ్డీ భారమూ తగ్గుతుంది.

  17. ఒక వస్తువు కావాలనుకున్నప్పుడు వెంటనే దాన్ని కొనుగోలు చేయొద్దు. కనీసం వారంపాటు దాని గురించి ఆలోచించాలి. అది లేకుండా ఎన్ని రోజులు ఉండగలరో చూసుకోండి. మరీ అవసరం అనిపిస్తేనే దాన్ని కొనుగోలు చేయండి.

  18. ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఇంటి విలువలో కనీసం 30 నుంచి 50 శాతం వరకూ మీ దగ్గర సొంత డబ్బు ఉండాలి. మిగిలిన మొత్తాన్నే అప్పుగా తీసుకోండి.

  19. డిజిటల్‌ చందాలు ఆర్థికంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మీకు ఎంత మేరకు అవసరమో వాటికే చందాలు చెల్లించండి. సమయం, డబ్బు రెండూ ఆదా చేసుకోండి.

  20. పెట్టుబడి పథకాల తీరు వేగంగా మారిపోతోంది. మీ జీవిత లక్ష్యాలను సాధించేందుకు అత్యుత్తమ మార్గాన్ని తెలుసుకోవాలి. దీనికోసం పత్రికలను చదవండి. నిపుణుల సూచనలు వినండి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవడం మంచిది.

  21. నైపుణ్యాలను పెంచుకోవాలి. దేశీయ ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగున్న నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందుకు తగిన నైపుణ్యాలుంటే చాలు.

  22. మీ పొదుపు, పెట్టుబడి, డీమ్యాట్‌ ఖాతాలకు నామినీ పేర్లు ఉన్నాయా చూసుకోండి. లేకపోతే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయండి.

  23. ఆదాయపు పన్ను మినహాయింపు పొందడం కోసం విరాళాలు ఇవ్వడమూ ఒక మార్గం. మీకు నచ్చిన స్వచ్ఛంద సంస్థలకు వీలైనప్పుడల్లా విరాళాలు ఇవ్వడం ద్వారా సమాజానికి తిరిగి ఇచ్చిన సంతృప్తి పొందొచ్చు.

  24. ఆర్థిక పురోగతికి ఓర్పు, క్రమశిక్షణ అవసరం. హెచ్చుతగ్గులు వస్తుంటాయి. పోతుంటాయి. లక్ష్యాలను సాధించినప్పుడు ఆ విజయాన్ని ఉత్సవంగా నిర్వహించుకోండి. మీకు మీరే ఇచ్చుకునే ప్రోత్సాహం అది.

అధిల్‌శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని