Health Insurance: ఆరోగ్య బీమా..నిబంధనలు తెలుసుకోండి

 వైద్య ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురైనప్పుడు  ఆర్థికంగా చిక్కులు ఎదురవ్వకుండా ఆరోగ్య బీమా పాలసీ ఒక తప్పనిసరి  అవసరంగా మారింది.

Updated : 05 Jan 2024 07:00 IST

 వైద్య ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురైనప్పుడు ఆర్థికంగా చిక్కులు ఎదురవ్వకుండా ఆరోగ్య బీమా పాలసీ ఒక తప్పనిసరి  అవసరంగా మారింది. ఈ పాలసీలో కొన్నిసార్లు నిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల క్లెయిం సమయంలో ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా సహ చెల్లింపు (కో-పే), తగ్గింపు (డిడక్టబుల్‌) విషయాల్లో పాలసీదారులకు కాస్త  గందరగోళం ఉంటుంది. వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆరోగ్య బీమా పాలసీలో సహ చెల్లింపు అంటే.. పాలసీ తీసుకునేటప్పుడు క్లెయిం మొత్తంలో పాలసీదారుడు చెల్లించాల్సిన నిర్ణీత శాతం అన్నమాట. బీమా పాలసీలో సహ చెల్లింపు మొత్తం లేదా నిర్ణీత శాతాన్ని స్పష్టంగా పేర్కొంటారు.

సాధారణంగా ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుందన్న కారణంతో చాలామంది సహ చెల్లింపు నిబంధనను ఎంచుకుంటారు. సహ చెల్లింపు శాతం ఎక్కువగా ఉంటే, ప్రీమియంలో ఆ మేరకు రాయితీ లభిస్తుంది. ఉదాహరణకు 10 శాతం సహ చెల్లింపు ఉన్న పాలసీతో పోలిస్తే, 15 శాతం సహ చెల్లింపు ఉన్న పాలసీకి ప్రీమియం తక్కువగా ఉంటుంది. మిగిలిన అంశాల్లో ఎలాంటి తేడా ఉండదు.

మంచిదేనా?: సహ చెల్లింపు అధికంగా ఉంటే ప్రీమియం భారం తగ్గుతుంది కదా అనే ఆలోచన రావచ్చు. కానీ, ఇది ఎంత మాత్రం సరికాదు. ఉదాహరణకు మీరు 10 శాతం సహ చెల్లింపుతో పాలసీ తీసుకున్నారనుకుందాం. ఆసుపత్రి బిల్లు రూ.20,000 అయ్యిందనుకుందాం. అప్పుడు రూ.2వేలు మీరు చేతి నుంచి చెల్లించాలి. ఇది పెద్దగా ఇబ్బంది కలిగించదు. కానీ, బిల్లు రూ.2లక్షలు తేలితే.. అప్పుడు రూ.20వేలు జేబు నుంచి ఖర్చు చేయాలి. ఇది భారమే కదా.. ఒక్క మాటలో చెప్పాలంటే.. కాస్త ప్రీమియం తక్కువగా ఉంటుందని చెప్పి, కో-పేను ఎంచుకోవడం ఏమాత్రం ఆచరణీయం కాదు.

కొన్ని సందర్భాల్లోనే ఆరోగ్య బీమా పాలసీలకు సహ చెల్లింపు నిబంధన ఉంటాయి. నిర్ణీత చికిత్సలకు సహ చెల్లింపును వర్తింపజేస్తాయి. కాబట్టి, పాలసీని తీసుకునేటప్పుడు ఈ నిబంధనల గురించి ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి.

తగ్గింపు విషయానికి వస్తే..

ఆసుపత్రిలో చేరినప్పుడు బిల్లు మొత్తంలో కొంత పాలసీదారుడు భరించాలి. నిర్ణీత మొత్తం తర్వాతే బీమా పాలసీ అమల్లోకి వస్తుంది. ఎంత మేరకు ఈ పరిమితి ఉంటుందన్న సంగతి పాలసీ తీసుకున్నప్పుడే నిర్ణయిస్తారు. ఇందులోనూ రకాలున్నాయి. ఒకటి పాలసీదారుడు సొంతంగా తీసుకోవచ్చు. మరోటి బీమా కంపెనీ కచ్చితంగా డిడక్టబుల్‌ను పేర్కొంటుంది. ఈ డిడక్టబుల్‌ ఎంత అనే ఆధారంగా ప్రీమియంలోనూ రాయితీ లభిస్తుంది. తక్కువ ప్రీమియం చెల్లించాలనుకునే వారు స్వచ్ఛంద తగ్గింపును ఎంచుకోవచ్చు. కానీ, ఇది సరైన నిర్ణయం కాదు. ఉదాహరణకు మీరు రూ.5 లక్షల బీమా పాలసీ తీసుకున్నారనుకుందాం. ఆసుపత్రిలో చేరినప్పుడు రూ.50వేల వరకూ పాలసీని వినియోగించను అని చెప్పొచ్చు. దీనివల్ల ప్రీమియం తగ్గుతుంది. కానీ, ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లినప్పుడు భారంగా మారుతుంది.


తేడా ఏమిటంటే..

సహ చెల్లింపును ఎంచుకున్నప్పుడు బిల్లు మొత్తంలో నిర్ణీత శాతాన్ని సొంతంగా భరించాల్సి ఉంటుంది. అదే తగ్గింపు లేదా మినహాయింపు ఎంచుకున్నప్పుడు ముందుగానే ఆ మేరకు కచ్చితంగా చేతి నుంచి చెల్లించాల్సిందే.
ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకునేటప్పుడు పూర్తి అవగాహన ఉండాలి. ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. మీ ఆరోగ్య చరిత్ర, అలవాట్లు, ఇప్పటికే ఉన్న వ్యాధుల వివరాలన్నీ అందించాలి. తక్కువ ప్రీమియం ఉంటుందనే ఆలోచనతో పాలసీని తీసుకుంటే.. తర్వాత నష్టం మనకే. స్వల్పకాలిక ప్రయోజనాలను చూడొద్దు. క్లిష్ట సమయంలో ఆ పాలసీ మనకు ఎంత వరకూ ఉపయోగపడుతుందన్నదే ఎంపికలో కీలకం కావాలి.

 భాస్కర్‌ నెరుకార్‌, హెడ్‌-హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని