సూచీ కంపెనీల్లో మదుపు...

బరోడా బీఎన్‌పీ పారిబస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఒక ఇండెక్స్‌ పథకం అందుబాటులోకి వచ్చింది. బరోడా బీఎన్‌పీ పారిబస్‌ నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 22.

Published : 12 Jan 2024 00:05 IST

రోడా బీఎన్‌పీ పారిబస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఒక ఇండెక్స్‌ పథకం అందుబాటులోకి వచ్చింది. బరోడా బీఎన్‌పీ పారిబస్‌ నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 22. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. నిఫ్టీ 50 టీఆర్‌ఐ సూచీ ఆధారంగా ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ఇండెక్స్‌ పథకం కాబట్టి రిస్కు కొంత తక్కువగా ఉంటుంది. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా ఇలాంటి పథకాల్లో మదుపు చేయడం ఉత్తమం. అదే సమయంలో దీర్ఘకాలంలో లాభాలను ఆర్జించేందుకూ అవకాశముంది.


దీర్ఘకాలం కొనసాగితే...

డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక మల్టీ క్యాప్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. డీఎస్‌పీ మల్టీక్యాప్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 22. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.100 మదుపు చేయాలి. నిఫ్టీ 500 మల్టీక్యాప్‌ 50-25-25 టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా తీసుకుంటారు. మల్టీ క్యాప్‌ పథకం కాబట్టి, లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లపై పెట్టుబడి పెడుతుంది. తద్వారా నష్టభయం తగ్గించుకునే అవకాశం ఉంది. మార్కెట్‌ హెచ్చుతగ్గుల ప్రకారం పోర్ట్‌ఫోలియోను మార్చుకునే వీలుంది. దీర్ఘకాలిక మదుపరులకు ఈ పథకం అనువుగా ఉంటుంది.


వినియోగ రంగంలో...

క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ క్వాంట్‌ కన్జమ్షన్‌ ఫండ్‌ అనే కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. దేశీయంగా వినియోగం గణనీయంగా పెరుగుతున్న విషయం విదితమే. ఎఫ్‌ఎంసీజీ వస్తువులతో పాటు విలాస వస్తువులు, ఖరీదైన జీవనశైలిని ప్రతిబింబించే వస్తువులును కొనుగోలు చేసేందుకు వినియోగదార్లు వెనకాడటం లేదు. అందువల్ల ఈ రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించటమే లక్ష్యంగా క్వాంట్‌ కన్జమ్షన్‌ ఫండ్‌ను రూపొందించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 18. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ కన్సూమర్‌ డిస్‌క్రీషనరీ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ టీఆర్‌ఐ సూచీని దీనికి ప్రామాణికంగా తీసుకుంటారు.


వైవిధ్యమైన పెట్టుబడి...

క్విటీ షేర్లతో పాటు రుణ పత్రాలు, గోల్డ్‌ ఈటీఎఫ్‌లపై ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టి అధిక లాభాలు నమోదు చేసే లక్ష్యంగా సుందరమ్‌ మల్టీ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌ అనే కొత్త పథకం వచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 19. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.100. నిఫ్టీ 500 టీఆర్‌ఐ (65 శాతం), నిఫ్టీ షార్ట్‌ డ్యూరేషన్‌ డెట్‌ ఇండెక్స్‌ (10 శాతం), దేశీయ మార్కెట్లో బంగారం ధర (25 శాతం) ఆధారంగా ఈ పథకం పనితీరును మదింపు చేస్తారు. వైవిధ్యమైన పెట్టుబడులను ఇష్టపడే వారికి ఈ పథకం అనువుగా ఉంటుంది.


30 షేర్లలో..

వైవిధ్యమైన 30 షేర్లను ఎంచుకొని, దీర్ఘకాలం కోసం మదుపు చేయడం ద్వారా లాభాలను ఆర్జించే లక్ష్యంతో ఓల్డ్‌ బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి తొలి ఫండ్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ ఆధారిత పథకం ఓల్డ్‌ బ్రిడ్జ్‌ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 17 నుంచి 19 వరకూ అందుబాటులో ఉండనుంది. సిప్‌ ద్వారా కనీస పెట్టుబడి రూ.2,500. ఒకేసారి మదుపు చేయాలనుకునే వారు రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ సూచీ ప్రామాణికంగా ఇది పనిచేస్తుంది. స్మాల్‌, మిడ్‌, లార్జ్‌ క్యాప్‌ తరగతులకు చెందిన సంస్థల భవిష్యత్‌ పనితీరును అంచనా వేసుకుంటూ ఈ పథకం మదుపు చేస్తుంది. వృద్ధికి అవకాశం ఉన్న షేర్లలో తొందరగా మదుపు చేయడం అనే సూత్రం ఆధారంగా  ఈ ఫండ్‌ పనిచేస్తుందని ఓల్డ్‌ బ్రిడ్జ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఐఓ సామె కెన్నెత్‌ అండ్రాడే వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని