మ్యూచువల్‌ ఫండ్లు ఒకే రంగంలో మదుపు చేయాలంటే...

ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగమూ కీలక భూమిక పోషిస్తుంది. కొన్నిసార్లు కొన్ని రంగాలు వృద్ధి పథంలో దూసుకెళ్తుంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ వాటి స్థానంలోకి  కొత్తవి వస్తుంటాయి. భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తాయనుకునే రంగాల్లో మదుపు చేసి, లాభాలు ఆర్జించే వ్యూహంతో వచ్చినవే థీమ్యాటిక్‌ ఫండ్లు.

Published : 08 Mar 2024 00:39 IST

ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగమూ కీలక భూమిక పోషిస్తుంది. కొన్నిసార్లు కొన్ని రంగాలు వృద్ధి పథంలో దూసుకెళ్తుంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ వాటి స్థానంలోకి  కొత్తవి వస్తుంటాయి. భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తాయనుకునే రంగాల్లో మదుపు చేసి, లాభాలు ఆర్జించే వ్యూహంతో వచ్చినవే థీమ్యాటిక్‌ ఫండ్లు. వీటిని సెక్టోరియల్‌ ఫండ్లుగానూ పిలుస్తుంటారు. వీటి గురించి తెలుసుకుందాం..

కొన్ని నెలలుగా దేశీయ మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహం పెరిగింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్‌ బలమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అనేక కొత్త రంగాలూ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వినియోగం తదితర రంగాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ సమయంలోనే థీమ్యాటిక్‌/సెక్టోరియల్‌ ఫండ్లు ఆయా రంగాల్లో తమ సత్తా చాటేందుకు వస్తున్నాయి.
స్టాక్‌ మార్కెట్లో విస్తృతమైన అవకాశాలుంటాయి. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లు ఇలా అన్ని విభాగాల్లోనూ మదుపు చేస్తుంటాయి. వీటికి భిన్నంగా నిర్ణీత రంగంపైనే దృష్టి సారించేవే థీమ్యాటిక్‌ ఫండ్లు. వృద్ధికి అవకాశం ఉండే ట్రెండ్‌లు, పరిశ్రమలపై పెట్టుబడులు పెట్టడమే వీటి ప్రధాన లక్ష్యం.

ఉదాహరణకు.. ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్‌ శక్తికి గిరాకీ పెరిగింది. దీంతో సౌర, పవన విద్యుత్‌ కంపెనీలు, విద్యుత్‌ వాహనాల సంస్థలు, సంబంధిత కంపెనీల్లో మదుపు చేసేందుకు ప్రయత్నించవచ్చు. ఇలాంటి అవకాశాలను ఈ సెక్టోరియల్‌ ఫండ్లు అందిస్తాయన్నమాట.

ఎవరికి అనుకూలం?

ఈ ఫండ్లు ఒకే రంగానికి పరిమితం అవుతాయి. కాబట్టి, వీటిలో అధిక నష్టభయం ఉంటుంది. అన్ని వేళలా ఒకే తరహా పనితీరు చూపించకపోవచ్చు. కాబట్టి, పెట్టుబడిదారులు తమ నష్టభయం భరించే సామర్థ్యాన్ని సరిగా అంచనా వేసుకోవాలి. ఈ ఫండ్లు మదుపరుల మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఒక భాగం కావచ్చు. కానీ, మొత్తం పెట్టుబడులు వీటికే కేటాయించడం సరికాదు. మార్కెట్లు అస్థిరతను ఎదుర్కొంటున్నప్పుడు ఇవి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. కాబట్టి, వివిధ మార్కెట్‌ దశల్లో పెట్టుబడులు కొనసాగాలి. దీర్ఘకాలిక వ్యూహంతో, కాస్త నష్టభయం ఉన్నా ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే వీటిని ఎంచుకోవాలి.

వృద్ధిపై అంచనాలు..

థీమ్యాటిక్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు భవిష్యత్తులో వృద్ధి సాధించగలవు అని నమ్మే రంగాలను ఎంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని కంపెనీల పనితీరు బాగుండకపోవచ్చు. రానున్న రోజుల్లో మంచి ప్రతిఫలాలు ఇవ్వొచ్చు. ఇలాంటి ధోరణులను గుర్తించడం కీలకం. భవిష్యత్తును అంచనా వేయలేం. కానీ, వృద్ధికి ఉన్న అవకాశాలపై కాస్త అవగాహన ఉండాలి. అప్పుడే సరైన థీమ్యాటిక్‌ ఫండ్లను ఎంచుకోగలం.

నష్టభయం అంచనాలు..

నిర్ణీత రంగం వృద్ధి సామర్థ్యం గురించి విశ్వాసం ఉన్న పెట్టుబడిదారులకు థీమ్యాటిక్‌ ఫండ్లు అనుకూలంగా ఉంటాయి. మీరు నిర్ణీత పరిశ్రమను దగ్గరగా పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ ఫండ్లు అందరికీ సరిపోకపోవచ్చు. ప్రత్యేకించి బ్యాలెన్స్‌డ్‌, తక్కువ అనిశ్చితి ఉండే పోర్ట్‌ఫోలియోల కోసం చూస్తున్న వారు వీటిలో మదుపు చేయొద్దు. ముందుగా మీరు ఎంత మేరకు నష్టభయం భరించగలరనేది అర్థం చేసుకోండి.  

థీమ్యాటిక్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేప్పుడు పాటించాల్సిన సూత్రం.. అవగాహనతో కొంచెం పరిశోధన.. ప్రామాణిక సూచీలకు మించి రాబడిని ఆర్జించే శక్తి ఉన్న ఫండ్లను ఎంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. దేశ ఆర్థిక వృద్ధిలో భాగమై, ప్రతిఫలాన్ని అందుకునేందుకు థీమ్యాటిక్‌ ఫండ్లు ఒక మార్గంగా చెప్పొచ్చు. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేటప్పుడు పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకోవాలన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని