పన్ను ఆదా ఇలా చేద్దాం

ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేసింది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

Updated : 22 Mar 2024 03:31 IST

ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేసింది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. చివరి నిమిషంలో ఆందోళన లేకుండా, సరైన ప్రణాళికతో పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరం. మరి, దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

పన్ను ప్రణాళిక పేరుతో చాలామంది ఏదో ఒక పథకంలో మదుపు చేసేస్తుంటారు. ఇవి వారి ఆర్థిక లక్ష్యాలకు ఏ మేరకు సాయం చేస్తాయనే విషయాన్ని పట్టించుకోరు. దీంతో భవిష్యత్తులో వీటి నుంచి పెద్దగా రాబడులు అందకపోవచ్చు. ఫలితంగా ఆర్థిక లక్ష్యాల సాధన భారం అయ్యే ఆస్కారం ఉంది. ఇలాంటి సందర్భాలు ఎదురవ్వకుండా ముందునుంచే అప్రమత్తంగా ఉండాలి.

ఎంత మదుపు చేయాలి?

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉంది. ఇందులో భాగంగా మీరు ఇప్పటికే కొన్ని పెట్టుబడులు పెట్టి ఉంటారు. ఉద్యోగ భవిష్య నిధి, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, గృహరుణం అసలు, జీవిత బీమా పాలసీల్లాంటి వాటిని ఇందులో చూపించుకోవచ్చు. ఇవన్నీ పోను ఇంకా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా చూసుకోండి. ఆ తర్వాతే పెట్టుబడి పథకాల గురించి ఆలోచించాలి. అవసరం లేకుండా పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి, ఇప్పటికే ఉన్న పెట్టుబడులను ఒకసారి సమీక్షించుకోండి. అప్పుడు మీకు పూర్తి స్పష్టత వస్తుంది.

భవిష్యత్‌లోనూ ఇబ్బంది లేకుండా..

పన్ను ఆదా పథకాలను ఎంచుకునేటప్పుడు తొందర పనికిరాదు. దీనివల్ల భవిష్యత్‌లో ఆర్థికంగా ఇబ్బందులు రావొచ్చు. సమయం లేకపోవడంతో చాలామంది తక్షణమే పెట్టుబడులకు అవకాశం కల్పించే పథకాలను ఎంచుకుంటారు. ఇవి కొన్నిసార్లు దీర్ఘకాలిక పథకాలు కావొచ్చు. వీటివల్ల ఇప్పటికిప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, రానున్న ఏళ్లలో ఆదాయం ఎలా ఉంటుంది? కొత్త పన్ను విధానంలోకి మారే అవకాశాలున్నాయా?లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఈ తరహా పథకాలను ఎంచుకోవాలి.

నష్టభయం పరిమితంగా..

పన్ను చెల్లింపుదారులు తమ పన్ను ఆదా కోసం పెట్టుబడులను ఎంచుకునేటప్పుడు నష్టభయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మూడేళ్ల లాకిన్‌ వ్యవధితో వస్తాయి. వీటిలో కొంత నష్టభయం ఉంటుంది. ఈ తరహా ఫండ్లలో ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచీ క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్‌)లో మదుపు చేయడం మంచిది. ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టడం అంత ఆచరణీయం కాదు. సెక్షన్‌ 80సీలో మదుపు చేయాల్సిన మొత్తంలో సగం ఈ ఫండ్లకు కేటాయించడం ఉత్తమం. దీనివల్ల నష్టభయాన్ని తగ్గించుకోవచ్చు.

సురక్షిత పథకాల్లో..

సెక్షన్‌ 80సీ పరిమితిని పూర్తి చేసుకునేందుకు సురక్షితంగా ఉంటూ, రాబడికి హామీ ఉన్న పథకాలనూ పరిశీలించవచ్చు. ఇందులో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, సుకన్య సమృద్ధి యోజన, పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలాంటివి ఉంటాయి. వీటిద్వారా పన్ను ఆదా చేసుకోవడంతోపాటు, కచ్చితమైన రాబడినీ పొందవచ్చు. ఆయా పథకాల వ్యవధులు మీకు అనుకూలమేనా అనేది ఒకసారి చూసుకున్నాకే వీటిలో పొదుపు చేయడం మంచిది.

80సీకి అదనంగా..

జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్‌)ను ఎంచుకోవడం ద్వారా అదనంగా పన్ను మినహాయింపు పొందేందుకు వీలుంది. సెక్షన్‌ 80సీలో రూ.1,50,000 పరిమితి మించిన తర్వాత.. రూ.50వేలను ఇందులో మదుపు చేయొచ్చు. టైర్‌-1 ఖాతాలో ఎన్‌పీఎస్‌ తీసుకున్నప్పుడే పన్ను మినహాయింపు లభిస్తుంది. వ్యక్తికి 60 ఏళ్లు
పూర్తయ్యాక పథకంలో ఖాతాలోని మొత్తం నుంచి 60 శాతం డబ్బును వెనక్కి తీసుకునే వీలుంటుంది. 40 శాతాన్ని తప్పనిసరిగా పింఛను పథకాల కొనుగోలుకు వినియోగించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని