Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. అధిక రాబడి వచ్చేలా

అధిక రాబడి ఆశించేవారు.. నష్టభయం భరించేందుకు సిద్ధంగా ఉండాలి. హామీతో కూడిన రాబడిని అందించే పథకాలను ఎంచుకోవాలంటే.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) ముందుంటాయి.

Updated : 28 Apr 2023 04:15 IST

అధిక రాబడి ఆశించేవారు.. నష్టభయం భరించేందుకు సిద్ధంగా ఉండాలి. హామీతో కూడిన రాబడిని అందించే పథకాలను ఎంచుకోవాలంటే.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) ముందుంటాయి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ఆర్‌బీఐ ఏడాది కాలంగా కీలక వడ్డీ రేటును పెంచడం ప్రారంభించింది. మరోవైపు తక్కువ వడ్డీ రేట్లు కొనసాగుతున్నప్పుడు చాలామంది ఎఫ్‌డీలకు ప్రత్యామ్నాయాలను వెదికారు. దీంతో బ్యాంకులను నగదు కొరత వేధిస్తోంది. డిపాజిటర్ల నుంచి డబ్బును సేకరించేందుకు మంచి ప్రతిఫలం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గత కొంత కాలంగా ఎఫ్‌డీల వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. నిర్ణీత వ్యవధులకు 9 శాతానికి పైగానే వడ్డీ అందుతోంది. ఈ నేపథ్యంలో ఈ డిపాజిట్లను ఎంచుకునేటప్పుడు ఏం చేయాలో చూద్దాం.

వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో ప్రస్తుతం ఫిక్స్‌డ్‌  డిపాజిట్లు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఏడాది క్రితం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గరిష్ఠంగా 5.5 శాతం వడ్డీని అందించింది. ఇప్పుడు ఇది 7.10 శాతానికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లాంటివీ 7.1 శాతం, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 7.2 శాతం వరకూ వడ్డీనిస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్లకు 0.50 శాతం అధికంగానే వడ్డీ లభిస్తుంది. యెస్‌ బ్యాంకు సీనియర్లకు 8.51 శాతం దాకా వడ్డీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

9 శాతం వరకూ..

పెద్ద బ్యాంకులకు పోటీగా కొత్త తరం స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ) దూకుడుగా వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. సీనియర్‌ సిటిజన్లకు సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 999 రోజుల వ్యవధికి 9.05 శాతం (యాన్యువలైజ్డ్‌ ఈల్డ్‌) వడ్డీని చెల్లిస్తోంది. ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ 559 రోజుల డిపాజిట్‌పై 8.20 శాతం, 560 రోజుల డిపాజిట్‌పై 8.45 శాతం ఇస్తోంది. యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 1001 రోజుల వ్యవధికి సీనియర్‌ సిటిజన్లకు 9.5 శాతం వడ్డీని అందిస్తోంది. వడ్డీని నెలవారీ చెల్లిస్తామని చెబుతోంది. 181-201రోజులు, 501 రోజుల వ్యవధికి 9.25 శాతం చొప్పున ఇస్తోంది. ఈక్విటాస్‌ ఎస్‌ఎఫ్‌బీ 888 రోజులకు 8.50 శాతం వడ్డీనిస్తోంది. ఇవే కాకుండా ఇతర స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులూ... వివిధ వ్యవధులకు 8 శాతానికి పైగానే వడ్డీని ఇస్తున్నాయి. ఫిన్‌కేర్‌ ఎస్‌ఎఫ్‌బీ 750 రోజుల వ్యవధికి సీనియర్‌ సిటిజన్లకు 8.71 శాతం వడ్డీ ఇస్తోంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లోనూ రూ.5లక్షల లోపు డిపాజిట్లకు డీఐసీజీసీ ద్వారా బీమా రక్షణ ఉంటుంది.

వ్యవధులు జాగ్రత్తగా...

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు ఎంచుకున్న వ్యవధిపై ఆధారపడి ఉంటాయన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకులు అన్ని వ్యవధుల డిపాజిట్లపైనా అధిక వడ్డీని ఇవ్వడం లేదు. కాబట్టి, వ్యవధిని ఎంపిక చేసుకునే విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. చాలా బ్యాంకులు ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల వ్యవధి డిపాజిట్లపైనే గరిష్ఠ వడ్డీని అందిస్తున్నాయి. కాబట్టి, అవసరాన్ని బట్టి ఎంత వ్యవధికి డిపాజిట్‌ చేయాలన్నది నిర్ణయించుకోవాలి. ఒక బ్యాంకు ఏడాది వ్యవధికి గరిష్ఠ వడ్డీని చెల్లిస్తుంటే.. అందులోనే ఎఫ్‌డీ చేయొచ్చు. ‘ఆటో రెన్యువల్‌’ సౌకర్యాన్ని ఎంచుకోవద్దు. ఏడాది తర్వాత వడ్డీ రేట్లను సమీక్షించి, అదే బ్యాంకులో కొనసాగొచ్చు. లేదా మార్చుకోవచ్చు. రెండేళ్ల వరకూ డబ్బు అవసరం లేదు అనుకుంటే.. దాదాపు 8 శాతానికి పైగా ఇస్తున్న బ్యాంకులను ఎంచుకోవచ్చని నిపుణుల సూచన.

విడివిడిగా..

పెద్ద మొత్తంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని అనుకున్నప్పుడు మరో పద్ధతినీ అనుసరించేందుకు ప్రయత్నించవచ్చు. గరిష్ఠ వడ్డీ ఇస్తున్న ఒక బ్యాంకులో ఏడాది డిపాజిట్‌, మరో బ్యాంకులో రెండేళ్లు, ఇంకో బ్యాంకులో మూడేళ్ల వ్యవధికి డిపాజిట్‌లను చేసే అంశాన్ని పరిశీలించవచ్చు. ఇలా ఒకే బ్యాంకులో కాకుండా.. వేర్వేరు వ్యవధులకు వేర్వేరు బ్యాంకులను ఎంచుకోవాలి. దీనివల్ల రాబడి అధికంగా వస్తుంది. ఇందులోనూ ప్రభుత్వ, ప్రైవేటు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు ఉండేలా చూసుకోవాలి. అయిదేళ్లకు మించి డిపాజిట్‌ చేయాలనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ బ్యాంకులనే దృష్టిలో పెట్టుకోవాలి.

ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.2 లక్షలను ఎఫ్‌డీ చేయాలని అనుకుంటే.. రూ.50వేల చొప్పున ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్ల లేదా ప్రత్యేక వ్యవధి పథకాలను ఎంచుకొని, డిపాజిట్‌ చేయాలి. అదీ వేర్వేరు బ్యాంకుల్లో చేయడం మంచిది.

ప్రత్యేక డిపాజిట్లూ..

కొన్ని బ్యాంకులు ప్రత్యేక డిపాజిట్లను అందిస్తున్నాయి. ఇప్పటికే వ్యవధి ముగిసినప్పటికీ మరికొంత కాలం వీటిని పొడిగించడం గమనార్హం. ఇందులో ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ పేరుతో అందిస్తున్న 400 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది జూన్‌ 30 వరకూ అందుబాటులో ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్‌ అమృత్‌ మహోత్సవ్‌ ఎఫ్‌డీని 444 రోజుల వ్యవధికి సీనియర్‌ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీని ఇస్తోంది. ఇండియన్‌ బ్యాంక్‌ అందిస్తోన్న ఇండ్‌ సూపర్‌ 400 రోజులకు 7.25శాతం అందిస్తోంది. సీనియర్లకు 0.50శాతం అదనం. ఇది జూన్‌ 30వరకూ అందుబాటులో ఉంటుంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‘శుభ్‌ ఆరంభ్‌ డిపాజిట్‌’ పేరుతో అందిస్తున్న ప్రత్యేక పథకంలో 501 రోజుల వ్యవధికి సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 7.80 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.65శాతం వడ్డీని అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని