Digital Loans: డిజిటల్‌ రుణాలు...తస్మాత్‌ జాగ్రత్త!

యూపీఐ ఆధారిత చెల్లింపులతో భారత్‌ ఒక విప్లవాన్ని సృష్టించింది. ఇదే సమయంలో పలు ఫిన్‌టెక్‌ సంస్థలు ప్రజలకు సులభంగా రుణాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి

Updated : 04 Aug 2023 07:14 IST

యూపీఐ ఆధారిత చెల్లింపులతో భారత్‌ ఒక విప్లవాన్ని సృష్టించింది. ఇదే సమయంలో పలు ఫిన్‌టెక్‌ సంస్థలు ప్రజలకు సులభంగా రుణాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. డిజిలాకర్‌, వీడియో ఆధారిత కేవైసీలాంటి సాంకేతికతలతో అడిగిన వారికి వెంటనే అప్పులు ఇచ్చేస్తున్నాయి. ఇ-కామర్స్‌ సైట్లలో ఒక వస్తువును కొన్నంత సులభంగా ఇప్పుడు డిజిటల్‌ రుణాలూ అందుబాటులోకి వస్తున్నాయి. కొంత కాలం క్రితం పలు వివాదాలకూ కారణం అయ్యాయి. ఇటీవలి కాలంలో కొంత నెమ్మదించినా.. మళ్లీ ఇప్పుడు వీటి జోరు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అప్పులు అందించే యాప్‌ల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తీసుకోవాల్సి వస్తే తెలుసుకోవాల్సిన విషయాలేమిటో చూద్దాం.

అప్పు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆర్‌బీఐ అనుమతి ఉన్న సంస్థలనే ఎంచుకోవాలి. బ్యాంకులు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలేవైనా సరే తప్పకుండా ఆర్‌బీఐ దగ్గర నమోదై ఉంటాయి. వీటి నుంచి మాత్రమే రుణం తీసుకోవాలి. ఆర్‌బీఐ గుర్తించని సంస్థల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు తీసుకోవద్దు. ఫోన్లలో, యాప్‌లలో మాత్రమే రుణం ఇచ్చే వారు తర్వాత మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడతారని మర్చిపోవద్దు. గతంలో ఇలాంటి అనుమతి లేని సంస్థలపై ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంది. అయినప్పటికీ కొన్ని సంస్థలు చట్ట విరుద్ధంగా రుణాలను ఇస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే మేలు.

అర్హతను తెలుసుకోండి...    

సాధారణంగా ఆదాయం, క్రెడిట్‌ స్కోరు ఆధారంగా ఆర్థిక సంస్థలు మీ రుణ అర్హతను నిర్ణయిస్తాయి. మీకు స్థిరమైన ఆదాయం, మంచి స్కోరు (750 కి మించి) ఉంటే బ్యాంకు నుంచి రుణం తీసుకోండి. మీకు తక్కువ అర్హత ఉంటే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ)ను ఎంచుకోండి. మీ క్రెడిట్‌ స్కోరు ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ఉండండి. తక్కువ నిబంధనలు, వడ్డీతో రుణం తీసుకునేందుకు మీ క్రెడిట్‌ స్కోరు ఉపకరిస్తుంది.

రుసుములు చూడండి..

మీ రుణ అర్హత వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది. మంచి స్కోరున్నప్పుడు తక్కువ వడ్డీ రేటుకు రుణం తీసుకునేందుకు ప్రయత్నించాలి. ఇప్పటికే తీసుకున్న రుణాలకు చెల్లింపులు ఆలస్యమైతే.. మీ స్కోరు తగ్గుతుంది. ఇలాంటప్పుడు వడ్డీ పెరుగుతుంది. రుణం తీసుకునేటప్పుడు అన్ని రుసుములనూ జాగ్రత్తగా పరిశీలించండి. ఇందులో మీ వార్షిక వడ్డీ రేటూ ఉండాలి. రుణ పరిశీలనా రుసుము, ఆలస్య/ముందస్తు చెల్లింపులకు వర్తించే ఛార్జీలు తెలుసుకోవాలి. ఆర్‌బీఐ నియంత్రిత రుణదాత ఈ వివరాలన్నీ తప్పనిసరిగా రుణగ్రహీతతో పంచుకోవాలి. ఇవన్నీ మీకు చెప్పడం లేదంటే.. కాస్త ఆలోచించాల్సిందే.  

సమాచారం సురక్షితంగా

రుణగ్రహీత సమాచారాన్ని ఎంతో సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్థిక సంస్థలదే. రుణాన్ని ఇచ్చేటప్పుడు అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించాలి. నియంత్రిత పద్ధతిలో మాత్రమే సంబంధిత అంశాల్ని మూడో సంస్థలకు (లోన్‌ ప్రొవైడర్లు, రికవరీ ఏజెన్సీల వంటివి) అందించాలి. చాలా సందర్భాల్లో కొన్ని యాప్‌లు ఫొటోలు, వీడియోల వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించడం, రుణగ్రహీత ఫోన్‌లో ఉన్న నంబర్లను తీసుకొని, స్నేహితులు, బంధువులకు ఫోన్‌ చేయడంలాంటివి జరిగాయి. ఇవన్నీ చట్ట వ్యతిరేకం. ఇలాంటి వాటి వలలో మీరు చిక్కుకోవద్దు. ఆర్‌బీఐ నియంత్రణలో ఉండే సంస్థల నుంచే అప్పు తీసుకోవడం సురక్షితం.

రుసుములు పోల్చుకోండి..

ఆన్‌లైన్‌లో అప్పు కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ముందుగా వడ్డీ రేట్లు, రుసుములు, తిరిగి చెల్లించేటప్పుడు ఉండే నిబంధనలు, షరతులను పోల్చి చూసుకోండి. అన్ని నియంత్రిత సంస్థలూ ఆన్‌లైన్‌లో ఈ సమాచారాన్ని అందిస్తాయి. పేరు తెలియని రుణదాతల నుంచి రుణం తీసుకుంటే.. తర్వాత చిక్కులు తప్పవు.

సమయానికి చెల్లించండి

మీ రుణాన్ని సకాలంలో, పూర్తిగా చెల్లించడం మంచిది. ఇది మీ క్రెడిట్‌ స్కోరును మెరుగుపరుస్తుంది. ఆలస్యమైతే మీ స్కోరు దెబ్బతింటుంది. సెటిల్‌మెంట్‌లాంటి వాటిని నివారించండి. మీ బాకీని పూర్తిగా తీర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. చెల్లింపు ఆలస్యం అయినప్పుడు రుణదాతకు ఆ విషయాన్ని తెలియజేయండి. మీరు రుణాన్ని చెల్లిస్తున్న క్రమంలో ఎప్పటికప్పుడు క్రెడిట్‌ స్కోరును సరిచూసుకోండి. కొన్నిసార్లు రుణదాతలు రుణం తీర్చిన విషయాన్ని క్రెడిట్‌ బ్యూరోలకు చెప్పరు. ఇలాంటి సందర్భాల్లో రుణగ్రహీతల క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది.


అవసరం ఉంటేనే..

డిజిటల్‌ రుణాలు సులభంగా లభిస్తాయి. కానీ, ఇస్తున్నారు కదా అని అప్పు చేయడం ఎప్పుడూ మంచిది కాదు. మీకు అవసరం ఉండి, తిరిగి చెల్లించేందుకు సౌకర్యవంతంగా ఉన్నప్పుడే అప్పు తీసుకోవాలి. ఒకేసారి బహుళ రుణాల కోసం దరఖాస్తు చేయొద్దు. ఇవన్నీ మిమ్మల్ని అప్పుల ఊబిలోకి లాగుతాయి. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తాయి.
అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని