Budget 2024: ‘ఫేమ్‌’కు నిధుల కోత.. 44% తగ్గిన కేటాయింపులు

FAME allocations: విద్యుత్‌ వాహనాలకు ఉద్దేశించిన ఫేమ్‌ పథకానికి కేంద్రం నిధుల్లో కోత పెట్టింది. గత బడ్జెట్‌తో పోలిస్తే 44 శాతం మేర నిధుల కేటాయింపు తగ్గించింది.

Published : 01 Feb 2024 21:53 IST

Union Budget 2024 | దిల్లీ: విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (FAME) పథకానికి కేటాయింపుల్లో కేంద్రం కోత పెట్టింది. 2023 -24 బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి 44 శాతం మేర కేటాయింపులు తగ్గించింది. 2024-25 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.2,671.33 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అయితే, ఫేమ్‌-2 పథకాన్ని మరోసారి పొడిగిస్తారా? కొత్తగా ఫేమ్‌-3 పథకాన్ని తీసుకొస్తారా? అనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

2023-24 బడ్జెట్‌లో ఫేమ్ పథకానికి కేంద్రం రూ.5,171.97 కోట్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని  రూ.4807.4 కోట్లకు సవరించింది. సవరించిన అంచనాల ప్రకారం తాజా కేటాయింపులు 44 శాతం మేర తగ్గాయి. గతేడాది విద్యుత్‌ ద్విచక్రవాహనాలకు సబ్సిడీలో కోత పెట్టిన సంగతి తెలిసిందే. సబ్సిడీ కోసం స్థానికత నిబంధనను ఏడు కంపెనీలు విస్మరించాయన్న ఆరోపణల నేపథ్యంలో బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించడం గమనార్హం. గతంలో కిలోవాట్‌ బ్యాటరీకి రూ.15వేల చొప్పున ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని గతేడాది జూన్‌ 1 నుంచి రూ.10వేలకు తగ్గించారు. మరోవైపు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫేమ్‌-2 పథకం 2024 మార్చి 31తో ముగియనుంది. 2015 ఏప్రిల్‌లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ వాహన కొనుగోళ్లుపై ప్రోత్సాహకాలు, ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

బడ్జెట్‌లో ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణాకు వినియోగించే ఈ-బస్సులకు ప్రోత్సాహం అందిస్తామని బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈవీ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీల షేర్లు రాణించాయి. జేబీఎం ఆటో షేరు బీఎస్‌ఈలో 2.48 శాతం లాభపడి రూ.1963.20 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 4.96 శాతం మేర లాభపడింది. గ్రీవ్స్‌ కాటన్‌ సైతం ఓ దశలో 3 శాతం మేర లాభాల్లోకి వెళ్లింది. చివరికి 0.95 శాతం లాభంతో రూ.165.05 వద్ద ముగిసింది. ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ షేరు ఓ దశలో 6.21 శాతం మేర రాణించింది. లాభాల స్వీకరణతో 0.69 శాతం నష్టంతో రూ.1729 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని