Gold hallmarking: తప్పనిసరి హాల్‌మార్కింగ్ పరిధిలోకి మరిన్ని జిల్లాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే..

Mandatory gold hallmarking: గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి నిబంధనను మరికొన్ని జిల్లాల్లో కేంద్రం అమల్లోకి తెచ్చింది. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 343కు చేరింది.

Published : 08 Sep 2023 15:43 IST

Gold hallmarking | దిల్లీ: బంగారు నగలకు హాల్‌మార్కింగ్‌ (Gold hallmarking) తప్పనిసరిచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మరిన్ని జిల్లాలకు కేంద్రం వర్తింపజేసింది. మూడో దశలో భాగంగా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 55 జిల్లాల్లో కొత్తగా అమల్లోకి తీసుకొచ్చింది. ఏపీ నుంచి 5, తెలంగాణలో 4 జిల్లాలు తాజాగా ఈ జాబితాలో చేరాయి. బంగారం స్వచ్ఛతను సూచించే హాల్‌మార్కింగ్‌ను 2021 జూన్‌ 16 వరకు స్వచ్ఛందంగా అమలు చేయాలని సూచించింది. ఆ తర్వాత నుంచి దశలవారీగా అమలు చేస్తూ వస్తోంది. మూడో దశతో దేశవ్యాప్తంగా 343 జిల్లాల్లో తప్పనిసరి నిబంధన అమల్లోకి వచ్చినట్లయ్యింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

2021 జూన్‌ 23న తొలుత 256 జిల్లాల్లో బంగారు (Gold) ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి (mandatory gold hallmarking) నిబంధనను కేంద్రం తీసుకొచ్చింది. 2022 ఏప్రిల్‌ 4న నుంచి రెండో ఫేజ్‌లో భాగంగా 32 జిల్లాలను, తాజాగా 55 జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేశారు. హాల్‌మార్కింగ్‌కు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) ఈ నిబంధనను సమర్థంగా అమలు చేస్తోందని, రోజుకు సగటున 4 లక్షల బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ జరుగుతోందని కేంద్రం తెలిపింది. రిజిస్టర్డ్‌ జువెలర్స్‌ సంఖ్యతో పాటు పరీక్ష, హాల్‌ మార్కింగ్‌ కేంద్రాల సంఖ్య సైతం పెరిగిందని పేర్కొంది. బీఐఎస్‌ కేర్‌ యాప్‌ ద్వారా వినియోగదారులు ఆభరణాల స్వచ్ఛతను ఆభరణంపై ఉండే హెచ్‌యూఐడీ ఎంటర్‌ చేసి తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది. బీఐఎస్‌ కేర్‌ యాప్‌ డౌన్‌లోడ్స్‌ సైతం 2021-22లో 2.3 లక్షలుగా ఉండగా.. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 12.4లక్షలకు చేరినట్లు వెల్లడించింది.

యాన్యుటీ.. జీవితాంతం పింఛను వచ్చేలా

తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలు ఇవే..

బంగారు నగలకు తప్పనిసరిగా హాల్‌మార్క్‌ ఉండాలన్న నిబంధనను విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 12 జిల్లాల్లో ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఇది వరకు మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాలు మాత్రమే ఈ నిబంధన పరిధిలో ఉండేవి. ఇప్పుడు మేడ్చల్‌ మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలను చేర్చింది. దీంతో తెలంగాణలో హాల్‌మార్క్‌ నిబంధన వర్తించే జిల్లాల సంఖ్య 12కి పెరిగింది. ఏపీలో ఇది వరకు ఈ నిబంధన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఉండేది. తాజాగా అన్నమయ్య, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, నంద్యాల జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని