Hero Electric: హీరో ఎలక్ట్రిక్‌ నుంచి 3 విద్యుత్‌ స్కూటర్లు.. ₹85వేల నుంచి మొదలు

Hero Electric: హీరో ఎలక్ట్రిక్‌ మూడు కొత్త స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. విద్యుత్‌ స్కూటర్లకు డిమాండ్‌ పెరుగుతున్న దృష్ట్యా రాబోయే రెండు మూడేళ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షలకు పెంచాలని ఆ కంపెనీ నిర్ణయించింది.

Published : 15 Mar 2023 20:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ (Hero Electric) కొత్త విద్యుత్‌ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆప్టిమా సీఎక్స్‌ 5.0 (Optima CX5.0) (డ్యూయల్‌ బ్యాటరీ), ఆప్టిమా సీఎక్స్‌ 2.0 (Optima CX5.0) (సింగిల్‌ బ్యాటరీ), ఎన్‌వైఎక్స్‌ (NYX) (డ్యూయల్‌ బ్యాటరీ) స్కూటర్లను ఆ కంపెనీ తీసుకొచ్చింది. ఈ స్కూటర్ల ధరలు రూ.85వేల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభమై రూ.1.30 లక్షలుగా ఉన్నాయి.

Optima CX2.0 మోడల్‌ 2kWh బ్యాటరీతో వస్తుంది. సింగిల్‌ ఛార్జ్‌తో 89 కిలోమీటర్లు రేంజ్‌ ఇస్తుంది. గరిష్ఠంగా 48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. నాలుగున్నర గంటల్లో బ్యాటరీని ఫుల్‌ ఛార్జ్‌ చేయొచ్చు. Optima CX5.0 మోడల్‌ 3kWh బ్యాటరీతో వస్తుంది. సింగిల్‌ ఛార్జ్‌తో 113 కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఈ బైక్‌ టాప్‌స్పీడ్‌ 55 Kmph. NYX మోడల్‌లో సైతం CX5.0 వినియోగించిన బ్యాటరీనే వాడారు. ఈ మోడల్‌ టాప్‌ స్పీడ్‌ 48 kmph. సింగిల్‌ ఛార్జ్‌తో 113 కిలోమీటర్ల రేంజ్‌ వస్తుంది. ఈ మూడు స్కూటర్లు రెండేసి రంగుల్లో లభ్యమవుతున్నాయి. అన్ని డీలర్‌షిప్‌ల వద్ద ఈ స్కూటర్లు లభ్యం కానున్నాయి.

10 లక్షల వాహనాలు టార్గెట్‌

రాబోయే 2-3 ఏళ్లలో ఏటా 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయబోతున్నట్లు హీరో ఎలక్ట్రిక్‌ తెలిపింది. విద్యుత్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్‌లో దాదాపు రూ.1,200 కోట్ల పెట్టుబడితో 20 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. తద్వారా తమ తయారీ యూనిట్ల నుంచి రాబోయే రెండు మూడేళ్లలో ఏడాదికి 10 లక్షల వాహనాలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు హీరో ఎలక్ట్రిక్‌ ఎండీ నవీన్‌ ముంజల్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ కంపెనీకి చెందిన లక్ష వాహనాల విక్రయాలు జరుగుతాయని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అవి 2.5 లక్షలకు చేరుతాయన్నారు. ప్రస్తుతం భారతదేశంలో విద్యుత్‌ ద్విచక్రవాహనాల డిమాండ్‌ ఎక్కువగా ఉందన్నారు. హీరో ఎలక్ట్రిక్‌ కూడా ఆ దశగా ముందడుగు వేస్తోందన్నారు. ప్రస్తుతం తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు లుథియానాలో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని