SIP: 20 ఏళ్లలో రూ.5 కోట్లు కూడ‌బెట్టడం ఎలా..?

ఉద్యోగస్తులకు నెలవారిగా స్థిరమైన ఆదాయం ఉంటుంది కాబట్టి.. వీరికి సిప్‌ విధానం సరిగ్గా సరిపోతుంది

Updated : 26 Sep 2022 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులకు సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (సిప్‌) ఒక మంచి విధానం. ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలంటే చాలామందికి సాధ్యం కాకపోవచ్చు. నెలవారీ ఆర్జించిన మొత్తం నుంచి కొత్త మొత్తాన్ని పొదుపు చేసి.. దీర్ఘకాలం పాటు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో సిప్‌ విధానంలో మదుపు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని గత చరిత్ర చెబుతోంది.

ఉద్యోగులకు నెలవారీ స్థిరమైన ఆదాయం ఉంటుంది కాబట్టి.. వీరికి సిప్‌ విధానం సరిగ్గా సరిపోతుంది. అంతేకాకుండా వీరికి వార్షికంగా ఇంక్రిమెంట్లు ఉంటాయి. అలాగే, ఉద్యోగం మారినప్పుడు, ప్రమోషన్లు వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో జీతం పెరుగుదల ఉంటుంది. ఈ విధంగా వార్షిక ఆదాయం పెరిగిన ప్రతిసారీ సిప్‌ మొత్తాన్నిపెంచుకుంటూ పోతే.. త్వరగా మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఒకవేళ మీ లక్ష్యం 20 ఏళ్లలో రూ.5 కోట్లు కూడబెట్టడం అయితే.. నెలవారీ ఎంత సిప్‌ చేయాలో ఇప్పుడు చూద్దాం.. 

ఇందుకోసం కొంత రిస్క్‌ ఉండే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అయితే, దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగిస్తారు కాబట్టి నష్టభయం కొంత వరకు తగ్గుతుందనే చెప్పాలి. 20 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేవారు 12 నుంచి 15 శాతం వరకు రాబడి ఆశించవచ్చు. 

మీ లక్ష్యం పెద్దది కాబట్టి స్టెప్‌-అప్‌ సిప్‌ విధానం ద్వారా త్వరగా చేరుకోవచ్చు. నెలకు రూ. 23 వేలతో పెట్టుబడులు ప్రారంభించి, సిప్‌ మొత్తాన్ని వార్షికంగా 12 శాతం పెంచుకోవడం ద్వారా (12 శాతం రాబడి అంచనాతో) 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సమకూర్చుకోవచ్చు. ఇక్కడ 20 ఏళ్లలో పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.1,98,86,474. రాబడి రూ. 3,06,91,474. సమకూరే మొత్తం రూ. 5,05,77,946. స్టెప్‌ అప్‌ విధానంలో కాకుండా సాధారణ సిప్‌తో పెట్టుబడులు పెడితే సమయం ఎక్కువ పడుతుంది. 12 శాతం రాబడి అంచనాతో, నెలకు రూ. 23 వేల చొప్పున పెట్టుబడి పెడితే, రూ. 5 కోట్లు సమకూర్చుకునేందుకు సుమారు 26 ఏళ్లు ఎదురుచూడాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని