Insurance Agent: బీమా ఏజెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?

చాలా మందికి వారి వ్యక్తిగత జీవితంలో బీమా చాలా అవసరం. పాలసీ కొనుగోలు సమయంలో ఏజెంట్‌/అడ్వైజర్‌ అవసరం పడొచ్చు. వీరి గురించి ఇక్కడ తెలుసుకోండి.

Published : 15 Mar 2024 16:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీమా పాలసీలను అమ్మే వ్యక్తిని ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌/ అడ్వైజర్‌ అంటారు. ఏజెంట్‌ బీమా కంపెనీ అధీనంలో పని చేస్తాడు. కొంతమంది ఏజెంట్లు వివిధ కంపెనీల పాలసీలు సేల్ చేసినా.. ఎక్కువ మంది ఒక కంపెనీ పాలసీలనే విక్రయిస్తారు. ఏజెంట్‌, ఇంటి వద్ద నుంచే తమ కార్యకలాపాలను నిర్వహించొచ్చు. చాలా మంది జీవిత బీమా ఏజెంట్లు మనకు తెలిసే ఉంటారు. వీరు జీవిత బీమా పాలసీలతో పాటు జనరల్‌ ఇన్సూరెన్స్‌లో మోటారు ఇన్సూరెన్స్‌, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌, ఆరోగ్య బీమా వంటి పాలసీలు కూడా సేల్ చేస్తుంటారు. సరైన బీమా ఏజెంట్‌ ద్వారా బీమా తీసుకుంటే క్లయింట్‌కు చాలా ఉపయోగముంటుంది. బీమా ఏజెంట్‌ గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

బీమా ఏజెంట్‌

క్లయింట్ల అవసరాలతో సంబంధం లేకుండా కమీషన్‌ సంపాదించడానికి మాత్రమే సిద్ధంగా ఉన్న ఏజెంట్లు వ్యాపారంలో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. POSP (సర్టిఫైడ్​ పాయింట్​ ఆఫ్​ సేల్స్​ పర్సన్) సలహాదారుడిగా పనిచేయడం ద్వారా వివిధ బీమా కంపెనీల నుంచి అందించే విభిన్న జీవిత బీమా, టర్మ్‌, గ్రూప్‌, మోటార్‌, ఇతర ఇన్సూరెన్స్‌ పథకాలకు ఏజెంట్‌గా ఉండొచ్చు.

ఏజెంట్‌ ఎలా ఉండాలి?

ఏ బీమా ఏజెంట్‌కైనా ప్రాథమిక అర్హత.. చురుకుదనం, కమ్యూనికేషన్‌ ఉండడం. మీ కుటుంబ బాధ్యతలు, ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్యం, వ్యక్తిగత పరిస్థితుల పరంగా మీ అవసరాలు తీర్చగల పాలసీని కనుగొనడంలో మీకు సహాయం చేయడానికి జీవిత బీమా ఏజెంట్‌ పనిచేయాలి. మంచి బీమా ఏజెంట్‌ పాలసీదారుడి అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పాలసీల గురించి క్లయింట్‌తో చర్చించేటప్పుడు ఏజెంట్‌ నిజాయతీగా ఉండాలి. ఏజెంట్‌ మీ ప్రమాణాలకు అనుగుణంగా అనేక బీమా ఎంపికలను మీకు అందించగలగాలి. పాలసీలో వివరాలు, ప్రయోజనాలు, లోపాలను.. స్పష్టంగా, సరళంగా మీకు వివరించాలి. మీరు ఏవైనా ప్రశ్నలు వేస్తే.. వాటిని నిజాయతీగా అందించాలి. ఎక్కువ కమీషన్‌ వచ్చే పాలసీలను క్లయింట్లకు అంటగట్టడానికి ఏజెంట్లు ప్రయత్నించకూడదు. ఏ సమయంలో కూడా పాలసీ కొనుగోలుకు మీపై ఒత్తిడి చేయకూడదు.

పాలసీ పని తీరు, క్లెయిమ్స్‌ నిర్వహణ, ప్రీమియం ఖర్చులు, ప్రాసెస్ అప్‌డేట్స్‌, పాలసీ పునరుద్ధరణ వంటి అనేక స్థాయిలను క్లయింట్లకు అర్ధమయ్యేలా చెప్పాలి. అంతేకాకుండా మీరు పాలసీని కొనుగోలు చేసిన తర్వాత బీమా పట్టాలో క్లయింట్‌ వివరాలు తప్పులు లేకుండా ఉండేటట్లు ఏజెంట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత ప్రీమియం చెల్లింపుల వివరాలను సమీక్షించడానికి ఏజెంట్‌ అందుబాటులో ఉండాలి. పాలసీ కొనుగోలు చేసాక క్లయింట్‌కు మెరుగైన సర్వీస్‌ను అందించాలి. క్లెయిం సమయంలో క్లయింట్‌కు ఫాలోఅప్‌ సర్వీస్‌ అందించాలి.

ఏజెంట్‌ను ఎలా కనుగొనాలి?

మీరు బీమా పాలసీ కోసం కంపెనీ షార్ట్‌లిస్ట్ చేసుకుని ఉంటే ఆ కంపెనీని సంప్రదించి, ఏజెంట్‌ను కలవమని చెప్పవచ్చు. ఒకవేళ బీమాను ఎక్కడ నుంచి కొనుగోలు చేయాలనుకుంటున్నారో తెలియకపోతే, దీనిపై అనుభవమున్న వారి రిఫరెన్స్‌ తీసుకోవచ్చు. అనుభవమున్న ఏజెంట్‌ను కనుగొనడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో మాట్లాడండి. ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ కూడా మెరుగైన ఏజెంట్‌ను సూచించగలరు. లేదా మీకు పాలసీ కొనుగోలు చేయడానికి సహాయం అందించగలరు. మీకు సంబంధించిన వృత్తిపరమైన సలహాదారులైతే మీ ఆర్థిక పరిస్థితి గురించి ఇప్పటికే అవగాహన ఉన్నందున, నైపుణ్యం కలిగిన ఏజెంట్‌ను సిఫార్సు చేయగలరు.

ఏజెంట్‌ను ఎలా నిర్ధారించాలి?

బీమా ఏజెంట్లు వారు బీమాను విక్రయించే రాష్ట్రం ద్వారా లైసెన్స్‌ పొందాలి. ఐఆర్‌డీఏఐ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి బీమా ఏజెంట్‌ లేదా POSP (సర్టిఫైడ్​ పాయింట్​ ఆఫ్​ సేల్స్​ పర్సన్)కు జీవిత బీమా లేదా సాధారణ బీమా పాలసీలను విక్రయించడానికి లైసెన్స్‌ ఉండాలి. బీమా ఏజెంట్‌కు బీమా అందించే ముందస్తు నైపుణ్యం ఉన్నప్పుడు అది క్లయింట్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏజెంట్‌ విద్య, శిక్షణ, వృత్తిపరమైన అర్హత వివరాలను కనుగొనాలి. కొంత మంది బీమా ఏజెంట్లు మెరుగైన అర్హతలను పొందేందుకు అదనపు శిక్షణ, కోర్సులను పూర్తి చేస్తారు. ఈ అర్హతలో ఛార్టర్డ్‌ లైఫ్‌ అండర్‌ రైటర్‌ (CLU), ఛార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌ (CHFC), సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్ (CFP), ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ స్పెషలిస్ట్‌ (FSS) కూడా ఉండొచ్చు. ఈ అధునాతన అర్హతలు వృత్తి, నైతిక వ్యాపార పద్ధతుల పట్ల నిబద్ధతను సూచిస్తాయి. నైపుణ్యం కలిగిన బీమా ఏజెంట్‌ కస్టమర్‌కు ఉన్న ఏదైనా చట్టబద్ధమైన అవసరాన్ని నెరవేర్చడానికి విస్తృత శ్రేణి పాలసీలను, సేవలను అందించగలరు.

ఏజెంట్‌ వద్ద తెలుసుకోవాల్సినవి..

జీవిత బీమానే తీసుకుంటే ఇది ఎక్కువ కాలవ్యవధితో ఉంటుంది. ప్రీమియం చెల్లింపులు అనేక ఏళ్ల పాటు చేయాల్సి ఉంటుంది. క్లెయిం విషయంలో కూడా అనేక సందేహాలు క్లయింట్లకు ఉంటాయి. మీ కుటుంబ ఆర్థిక రక్షణ కోసం జీవిత బీమా చాలా అవసరం. కాబట్టి, దీన్ని జాగ్రత్తగా పూర్తి పరిశోధన చేసి తర్వాత కొనుగోలు చేయాలి. ఈ పాలసీల గురించి అనేక సందేహాలుంటాయి. వీటన్నింటినీ ఏజెంట్‌ను తప్పక అడిగి తెలుసుకోవాలి. ఏజెంట్‌ లైసెన్స్‌ ఎప్పుడు జారీ అయ్యింది?ఎన్నేళ్ల అనుభవం ఉంది? పాలసీ అమలులో ఉండే బీమా బ్రాంచ్‌ ఆఫీస్‌ అడ్రస్‌ వివరాలను అడగాలి. బీమా కంపెనీ క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో తెలుసుకోవాలి.

ఏజెంట్లు బీమా పాలసీ విక్రయించేటప్పుడు అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలను చెబుతారు. ఆ ప్రయోజనాలు రాతపూర్వకంగా పాలసీ డాక్యుమెంట్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి. చాలా జీవిత బీమా పాలసీలు మరణానికి పరిహారం చెల్లించే మొత్తాన్ని ప్రధాన ప్రయోజనంగా హామీ ఇస్తాయి. అసలు దీనికి సంబంధించిన క్లెయిం షరతులు ఏంటో ఏజెంట్‌ను ప్రశ్నించండి. పాలసీ ఒప్పందంలో పూర్తి నిబంధనలను ఏజెంట్‌ను అడిగి తెలుసుకోండి. చాలా ఆరోగ్య, మోటారు బీమా పాలసీలు రైడర్లతో వస్తాయి. వీటి విధివిధానాలను తెలుసుకోండి. ప్రీమియంలు చెల్లించకపోతే జరిమానాలు ఎంత ఉంటాయి? పాలసీ పునరుద్ధరణ ఆలస్యం అయితే ఏవైనా ప్రయోజనాలు మిస్‌ అవుతామో, లేదో తెలుసుకోవాలి. మీరు బీమా పాలసీని కొనుగోలు చేస్తుంటే పాలసీ నిబంధనలు, షరతులను ప్రభావితం చేసే ఊహించని సంఘటనల గురించి తెలుసుకోవాలి.

చివరిగా: జీవిత బీమా ఏజెంట్లందరూ ఒకేలా ఉండరు. కొన్ని బీమా పాలసీలు సంక్లిష్టంగా ఉంటాయి. కాబట్టి మీ అవసరాలను బట్టి, సరైన పాలసీని కనుగొనడంలో మీకు సహాయపడే అర్హత కలిగిన బీమా ఏజెంట్‌ మీకు అవసరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని