Education Loan: విద్యా రుణం ఎలా చెల్లించాలా.. అని ఆందోళన చెందుతున్నారా?

చదువు పూర్తి చేసి, సంపాదన ప్రారంభించిన తర్వాత విద్యారుణం చెల్లింపులు ప్రారంభించవచ్చు. ఉద్యోగం వచ్చిన తరువాత ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు కొన్ని వ్యూహాలను అనుసరించాలి.

Updated : 11 Nov 2022 18:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉన్నత చదువుల కోసం బ్యాంకులు విద్యా రుణాలను అందిస్తుంటాయి. అయితే, ఈ అప్పు తీర్చాల్సిన బాధ్యత ఆ విద్యార్థిపైనే ఉంటుంది. చదువు పూర్తయ్యాక ఈఎంఐ పద్ధతిలో రుణాన్ని తీర్చవచ్చు. సాధారణంగా చదువు పూర్తయిన 12 నెలల తర్వాత గానీ, ఉద్యోగం వచ్చిన 6 నెలల్లో గానీ, ఏది తక్కువ సమయం అయితే అంతలోపు ఈఎంఐ చెల్లింపులు ప్రారంభమవుతాయి. కాబట్టి, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేసి అప్పు తీర్చవచ్చు. మంచి ప్యాకేజీతో ఉద్యోగం వస్తే పర్వాలేదు. కానీ, జీతం తక్కువగా ఉంటే.. విద్యారుణం ఎలా తీర్చాలా? అని ఆందోళన మొదలవుతుంది. అటువంటి వారు అనుసరించాల్సిన మార్గాలను ఇప్పుడు చూద్దాం..

మారటోరియం పీరియడ్‌..

విద్యా రుణం తీసుకున్న నాటి నుంచి ఈఎంఐలు చెల్లింపులు మొదలుకావు. చదువు పూర్తిచేసి సంపాదన ప్రారంభమైన తర్వాత రుణ చెల్లింపులను ప్రారంభించవచ్చు. దీన్నే మారటోరియం పీరియడ్‌ అంటారు. సాధారణంగా ఈ కాలంలో రుణంపై వర్తించే వడ్డీ మొత్తాన్ని కూడా అసలు మొత్తానికి జోడించి, ఈఎంఐను లెక్కిస్తారు. కాబట్టి, రుణ మొత్తం పెరగకుండా ఈ మారటోరియం కాలంలో ఎప్పటికప్పుడు వడ్డీ చెల్లించడం ద్వారా భారం తగ్గించుకోవచ్చు. 

పార్ట్‌టైమ్‌ జాబ్‌..

రుణం లేకపోతే సంపాదనలో అధిక భాగాన్ని పెట్టుబడులకు మళ్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి, విద్యా రుణం భవిష్యత్‌లో భారం కాకుండా త్వరగా చెల్లించడం మంచిది. ఇందుకు చదువుకుంటున్నప్పుడే.. తీరిక సమయంలో పార్ట్‌-టైమ్‌ జాబ్‌ చేయవచ్చు. ప్రస్తుతం అనేక అవకాశాలు అందుబాటులో ఉంటున్నాయి. మీకు ఏదైనా సబ్జెక్ట్‌పై గ్రిప్‌ ఉంటే ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో ట్యూషన్లు చెప్పవచ్చు. గ్రాఫిక్‌ డిజైన్‌ లేదా కంటెంట్‌ రైటింగ్‌ లేదా మరేదైనా పనుల్లో నైపుణ్యం ఉంటే ఫ్రీలాన్సర్లుగా పనిచేయవచ్చు. ఏదైనా ప్రత్యేక కళ ఉంటే యూట్యూబ్‌లో వీడియో పోస్ట్‌ చేయడం వంటివి కూడా చేసి డబ్బు సంపాదించి విద్యార్థి దశలోనే కొంత రుణం తీర్చేయవచ్చు. అయితే, ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఏ పని చేసినా, ఏ దశలోనైనా చదువును నిర్లక్ష్యం చేయకూడదు.

పొదుపు అలవాటు..

సంపాదించడం చాలా మంది చేస్తుంటారు. అయితే, సంపాదించిన మొత్తంలో ఎంత వరకు పొదుపు చేయగలిగామనేదే ముఖ్యం. మీ జీవనశైలి ఆదాయానికి తగినట్లుగా ఉండాలి. సాధారణంగా కళాశాల దశలో ఉన్నప్పుడు, ఉద్యోగం ప్రారంభమైన కొత్తలో విందులు, విలాసాలు, దుస్తులు, గ్యాడ్జెట్ల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. అయితే, కనీస అవసరాలతో పొదుపుగా ఉంటూ బడ్జెట్‌ ప్రకారం నడుచుకుంటే పొదుపు చేస్తూనే ఎక్కువ మొత్తం రుణ చెల్లింపుల కోసం కేటాయించగలుగుతారు. 

ఆదాయం తక్కువుంటే..

ఎక్కువ కాలపరిమితిని ఎంచుకుంటే వడ్డీ రూపంలో చెల్లించే మొత్తం పెరిగినప్పటికీ.. ఈఎంఐ తగ్గుతుంది. తక్కువ జీతం ఉన్నప్పుడు క్రమం తప్పకుండా చెల్లింపులు చేసే విధంగా ఈఎంఐ ఎంచుకోవాలి. సెక్యూర్డ్‌ (ఆస్తి తాకట్టు ఉన్న) విద్యా రుణాల చెల్లింపులకైతే బ్యాంకులు 10 సంవత్సరాల వరకు కూడా సమయం ఇస్తాయి.

భవిష్యత్‌ ఆదాయం..

ఉద్యోగంలో ముందుకు వెళ్లే కొద్దీ అనుభవం పెరుగుతుంది. దీంతో పాటే జీతం కూడా పెరుగుతుంది. జీతం పెరిగనప్పుడు ఎక్కువ మొత్తంలో చెల్లించేందకు ప్రయత్నించవచ్చు. ఒకవేళ భవిష్యత్‌లో మీ పనితీరు నచ్చి పనిచేసే సంస్థ ప్రోత్సాహకాలు, బోనస్‌లు ఇచ్చి, ఎక్కవ మొత్తంలో డబ్బు చేతికందితే ముందస్తు చెల్లింపులు చేయవచ్చు. చాలా వరకు ప్రధాన బ్యాంకులు ముందస్తు చెల్లింపులపై ఎలాంటి రుసములూ విధించడం లేదు.

చివరిగా..

విద్యారుణం తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తుంటే.. మీరు ఏ కోర్సు చదవాలనుకుంటున్నారు? ఆ కోర్సు చదవడం వల్ల ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? ఏ యూనివర్సిటీల్లో ఆ కోర్సు అందుబాటులో ఉంది? క్యాంపస్‌ ఇంటర్వ్యూలు జరుగుతాయా? వంటి విషయాలను ముందుగానే రీసెర్చ్‌ చేయాలి. ఖరీదైన కోర్సులో చేరడం వల్ల మంచి ఉద్యోగం వస్తుందని తెలిసిన వాళ్లు, బంధువులు, స్నేహితులు సలహాలు ఇస్తుంటారు. కానీ, ఖరీదైన కోర్సు ఎంచుకోవడం ముఖ్యం కాదు. అందులో మీకు ఎంత ఆసక్తి ఉందనేదే ముఖ్యం. ఆసక్తి ఉంటే తర్వగా లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని