Health Emergency: ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?

జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి మనం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి..

Published : 19 Mar 2024 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్యం విషయంలో అప్రమత్తత ఎవరికైనా చాలా అవసరం. మీరు ఆర్థికంగా సిద్ధంగా లేకుంటే ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం చాలా కష్టం. ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు దానికి గణనీయమైన మొత్తం ఖర్చవుతుంది. మెడికల్‌ ఎమర్జెన్సీ సమయంలో నిధుల కోసం పరిగెత్తడం కంటే అలాంటి పరిస్థితులకు ముందు నుంచి సిద్ధంగా ఉండడం చాలా మంచిది. డబ్బు ఆదా చేయడానికి, అవసరమైన ఆరోగ్య సంరక్షణను పొందడానికి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఊహించని వైద్య ఖర్చుల కోసం ఒక ప్రణాళికను కలిగి ఉండడం ముఖ్యం. దీని గురించి ఆర్థికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకునే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

బడ్జెట్‌

ప్రతి వ్యక్తికీ లేదా కుటుంబానికి వేర్వేరు ఆరోగ్య సంరక్షణ అవసరాలు ఉండొచ్చు. అందుకు మీ నెలవారీ బడ్జెట్‌లో కొంత భాగాన్ని ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం ప్రత్యేకంగా కేటాయించాలని ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇందులో బీమా ప్రీమియంలు, రెగ్యులర్‌ చెకప్‌లు, అత్యవసర ఆరోగ్య నిధికి సమకూర్చిన పొదుపు ఉండాలి. ఆరోగ్య బీమాకు, హెల్త్‌ చెకప్‌లకు చేసే ఖర్చును వ్యయం కింద చూడకూడదు. ఆరోగ్యంపై చేసే పెట్టుబడిగానే భావించాలి.

అత్యవసర నిధి

ఆర్థిక అత్యవసర లేదా ఊహించని సంఘటనల కోసం సిద్ధం కావడానికి మొదటి అడుగు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం. అనారోగ్యాలు చెప్పిరావు. అకస్మాత్తుగా ఆసుపత్రి పాలయిన వారిని ఎంతో మందిని చూస్తుంటాం. ఇవే సంఘటనలు ఎవరికైనా జరగొచ్చు. కాబట్టి, ఆరోగ్య సంక్షోభాల కోసం ప్రత్యేకంగా 6 నెలల సంపాదన మొత్తాన్ని అత్యవసర నిధిగా సమకూర్చుకోవాలి. దీన్ని స్వల్పకాలిక ఎఫ్‌డీలు లేదా సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలో ఉంచవచ్చు. క్రమం తప్పకుండా చేసే కొద్ది మొత్తం కూడా అత్యవసర సమయాల్లో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ఫండ్‌ బహుళ అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి, ఆసుపత్రి బిల్లులను చెల్లించడానికి మీకు స్వల్ప మొత్తం అవసరమైనప్పుడు మీ ఇతర పెట్టుబడులను రక్షించడంలో మీకు సహాయపడుతుంది.

రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్‌లు

మన ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించినా సుమారుగా 45-50 సంవత్సరాలు దాటిన తర్వాత రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్‌లను చేయించుకోవడం చాలా ఉత్తమం. ఆరోగ్య పరీక్షల ద్వారా ముందస్తు అనారోగ్య లక్షణాలను గుర్తించడం వల్ల, రోగం మరింత పెరగకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. రాబోయే కాలంలో ఏర్పడే చికిత్స ఖర్చులను తగ్గించవచ్చు. ఆరోగ్యవంతమైన జీవితకాలాన్ని పెంచుకోవచ్చు.

ఆరోగ్య బీమా

పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల దృష్ట్యా, ప్రతి వ్యక్తి వారి ఆర్థిక స్థితిని కోల్పోకుండా వైద్య ఖర్చులను తట్టుకోవడానికి తగిన ఆరోగ్య సంరక్షణ పాలసీని ఎంచుకోవాలి. ఆరోగ్య బీమా అనేది వైద్య అవసరాల కోసం ఆర్థికంగా సిద్ధం కావడానికి అత్యంత ప్రాధాన్య అవసరాల్లో ఒకటి. దీనివల్ల జీవితంలో ఎలాంటి ఆరోగ్య ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి ఆర్థికంగా సిద్ధంగా ఉండొచ్చు. వైద్య ఖర్చుల వల్ల కలిగే ఆర్థిక ఒత్తిడిని తట్టుకోవడానికి ఆరోగ్య బీమా చాలా ముఖ్యమైనది. అత్యవసర పరిస్థితులు, ఆసుపత్రిలో చేరడం, తీవ్రమైన అనారోగ్యాలను కవర్‌ చేసే ప్లాన్‌ల కోసం చూడండి. ఆరోగ్య బీమా పథకాలు ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయొచ్చు. మీ అవసరాలు, బడ్జెట్‌కు సరిపోయే వాటిని కనుగొనడానికి ఆరోగ్య బీమా ప్రీమియంలను, విధానాలను సరిపోల్చండి.

మీకు ఆరోగ్య బీమా ఉన్నట్లయితే నెట్‌వర్క్‌ ఆసుపత్రులను ఉపయోగించుకోండి. నగదు రహిత సేవలు ఇందులో లభిస్తాయి. అత్యవసర సమయాల్లో తక్షణ ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి. సాధ్యమైనంతవరకు ఖర్చుల గురించి ముందుస్తుగా విచారించండి. కొన్నిసార్లు ఆసుపత్రులు డిస్కౌంట్స్‌, బిల్లుల తగ్గింపులను అందించవచ్చు. అంతేకాకుండా, ఈ రోజుల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కోసం భౌతికంగా ఆసుపత్రిని సందర్శించకుండా ఆన్‌లైన్‌లోనే డాక్టర్స్‌ను సంప్రదించడం సాధ్యం. చిన్న ఆరోగ్య సమస్యల కోసం పొందే టెలిమెడిసిన్‌ సేవలు పెద్దగా ఖర్చుతో కూడుకున్నవి కూడా కావు. పైగా పేషెంట్‌కు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా కవర్ చేసే బీమా పాలసీ కోసం ప్రయత్నించండి.

క్రెడిట్‌ స్కోరు ముఖ్యం

ఏదైనా ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మీకు సహాయపడే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి క్రెడిట్‌ స్కోర్‌ను నిర్వహించడం. ప్రత్యేకించి అత్యవసర పరిస్థితుల్లో, మంచి క్రెడిట్‌ స్కోరు రుణ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా, మీకు తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందేలా చేస్తుంది. ఒక్కోసారి అనారోగ్యం పాలయినప్పుడు బీమా లేకపోయినా లేదా సరిపోకపోయినా అత్యవసరంగా రుణాలు తీసుకోవలసి రావచ్చు. వ్యక్తిగత రుణంలో వడ్డీ ఎక్కువగా ఉంటుంది. కానీ, ఆరోగ్య సంక్షోభ సమయంలో చివరి ప్రయత్నంగా రుణం సహాయపడుతుంది. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా తక్కువ వడ్డీ రేట్లతో వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్‌ కార్డుల వంటి ఎంపికలను అన్వేషించండి. మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉన్నవారికి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలిస్తాయి. కాబట్టి, రుణం అవసరమున్నా లేకపోయినా మెరుగైన క్రెడిట్‌ స్కోరును ఎల్లప్పుడూ నిర్వహించడం చాలా అవసరం. 

సమీక్ష, ప్రివెంటివ్‌ కేర్‌

మీ బీమా కవరేజీ, అత్యవసర నిధి, ఆర్థిక ప్రణాళికను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మీ ఆరోగ్యం, ఆదాయం, కుటుంబ పరిస్థితుల్లో మార్పుల ఆధారంగా వాటిని అప్‌డేట్‌ చేసుకోవాలి. అంతేకాకుండా ఆరోగ్య అత్యవసర పరిస్థితులను నివారించడానికి తగిన చర్యలపై దృష్టి పెట్టండి. మంచి అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల ఆహారం, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇంకా, వివిధ ఆరోగ్య సమస్యలు, సాధ్యమయ్యే నివారణ చర్యల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి. దీనివల్ల అనారోగ్య నివారణకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని