Income Tax: పన్ను చెల్లింపుదారులా? ఈ ఏడాది ముఖ్య తేదీలివే..

Imp dates for income tax payers: ఆదాయపు పన్ను విషయంలో ముఖ్య తేదీలను తెలుసుకుంటే.. గడువు తేదీలోపే పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

Published : 03 Jan 2023 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పరిమితికి మించిన ఆదాయం ఉన్న వారు ఆదాయపు పన్నును చెల్లించాలి. పన్ను చెల్లింపుల్లో ఎటువంటి ఆలస్యం లేకపోతే.. పెనాల్టీల నుంచి దూరంగా ఉండొచ్చు. 2023కి సంబంధించి ఆదాయపు పన్ను ముఖ్య తేదీలను తెలుసుకుంటే.. గడువు తేదీలోపే పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధిత తేదీలను తెలుసుకుందాం.

1. జనవరి 30

ఐటీఆర్‌ను దాఖలు చేసిన తర్వాత ధ్రువీకరించడం తప్పనిసరి. ఐటీఆర్‌ ధ్రువీకరించేందుకు ఉన్న సమయాన్ని 2022 ఆగష్టు 1 నుంచి సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్ను విభాగం) 120 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించింది. అందువల్ల ఆర్థిక సంవత్సరం 2021-22 (ఏవై 2022-23) కోసం ఆలస్యంగా అంటే 2022, డిసెంబరు 31కి ఐటీఆర్‌ దాఖలు చేసిన సవరించిన వ్యక్తులు 2023 జనవరి 30లోపు ధ్రువీకరణ పూర్తిచేయాలి. లేదంటే ఐటీఆర్‌ దాఖలు చేసినా ప్రయోజనం ఉండదు. 

2. మార్చి 15

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించే పన్ను చెల్లింపుదారులకు మార్చి 15 ముఖ్యమైన తేదీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చివరి వాయిదా చెల్లించేందకు ఇదే ఆఖరి తేదీ. ఒకవేళ సరైన సమయానికి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించకపోతే ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్‌లు 234బి, 234సి కింద పెనాల్టీ వర్తిస్తుంది. చెల్లించాల్సిన మొత్తంపై నెలకు 1% వడ్డీ వర్తిస్తుంది. ముందస్తు పన్ను చెల్లించడంలో ఒకసారి విఫలమైతే తర్వాతి వాయిదాకు మూడు నెలల సమయం ఉంటుంది. కాబట్టి మూడు నెలలకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. 

3. మార్చి 31

మార్చి 31తో 2022-23 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. కాబట్టి, ఈ తేదీ చాలా ముఖ్యమైనది. 

పన్ను ఆదా కోసం: మీరు పాత పన్ను విధానంలో రిటర్నులను ఫైల్‌ చేస్తుంటే.. పన్ను ఆదా పెట్టుబడులను పూర్తిచేసేందుకు చివరి తేదీ మార్చి 31. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు వివిధ మార్గాల ద్వారా పెట్టుబడి పెట్టి పన్ను మినహాయింపు పొందొచ్చు. ఉదాహరణకు సెక్షన్‌ 80సి తీసుకుంటే.. పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఎస్‌ఎస్‌వై వంటి వివిధ మార్గాల ద్వారా పెట్టుబడి పెట్టి ఏడాదికి రూ.1.50 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. అలాగే 80డి, 80టీటీఏ వంటి వివిధ సెక్షన్ల కింద మినహాయింపు కోసం మార్చి 31 లోపు పన్ను ఆదా పెట్టుబడులను పూర్తిచేయాలి.

ఐటీఆర్‌-U ఫైల్ చేసేందుకు: ఆర్థిక సంవత్సరం 2019-20 (ఏవై 2020-21) కోసం ఐటీఆర్‌ ఫైల్ చేయకపోయినా లేదా ఐటీఆర్‌ ఫైల్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఆదాయాన్నీ నివేదించకపోతే, మీరు అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌ లేదా ఐటీఆర్‌-U ఫైల్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం చివరి తేదీ 2023, మార్చి 31. ఐటీఆర్‌-U ప్రభుత్వం 2022 బడ్జెట్‌లో ప్రకటించింది. ఐటీఆర్‌ ఫైల్‌ చేసే సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాల లోపు ఐటీఆర్‌-U ఫైల్‌ చేయవచ్చు.

ఫారం 10F: ద్వంద్వ పన్ను రద్దు ఒప్పందం (DTAA) ప్రయోజనాన్ని పొందాలనుకునే నాన్-రెసిడెంట్ పన్ను చెల్లింపుదారులు ఫారమ్ 10Fను సమర్పించాలి. పాన్‌ కార్డు లేని ఎన్నారైలు ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించడం కుదరదు. కాబట్టి మాన్యువల్‌గా మార్చి 31 లోపు సమర్పించవచ్చు.

4. జూన్‌ 15

అడ్వాన్స్‌ ట్యాక్స్‌: ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం అడ్వాన్స్‌ ట్యాక్స్‌ మొదటి వాయిదా చెల్లించేందుకు చివరి తేదీ. 

ఫారం 16: ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం యజమాని నుంచి ఫారం 16 స్వీకరించేందకు చివరి తేదీ. ఫారం-16 అనేది టీడీఎస్‌ సర్టిఫికెట్‌. దీనిలో యాజమాని చెల్లించిన జీతం, మినహాయించిన పన్ను, ఇతర వివరాలు ఉంటాయి. ఆదాయపు పన్ను దాఖలు చేసేందుకు అవసరమైన ముఖ్య పత్రాల్లో ఇదీ ఒకటి. 

5. జులై 31

ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ 2023, జులై 31(ప్రభుత్వం చివరి తేదిని పొడిగిస్తే ఆ తేదీ వర్తిస్తుంది). ఒక వ్యక్తి ఈ గడువును కోల్పోతే ఆలస్య రుసుము చెల్లించి.. బిలేటెడ్‌ ITR ఫైల్ చేసే అవకాశం ఉంది.

6. సెప్టెంబరు 15

ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం అడ్వాన్స్‌ ట్యాక్స్‌ రెండో వాయిదా చెల్లించేందు చివరి తేదీ. 

7. డిసెంబరు 15

ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం అడ్వాన్స్‌ ట్యాక్స్‌ మూడో వాయిదా చెల్లించేందు చివరి తేదీ. 

8. డిసెంబరు 31

ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి ఆలస్యపు లేదా సవరించిన ఐటీఆర్‌ ఫైల్ చేసేందుకు చివరి తేదీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని