Indian aviation: కొత్త దశలోకి భారత విమానయాన రంగం: ఇండిగో సీఈఓ

Indian aviation: భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కుతోందని ఇండిగో సీఈఓ అన్నారు. ఎయిరిండియా చేపడుతున్న చర్యలు అందులో భాగమేనన్నారు. ఇండిగో సైతం తమ సేవల్ని అంతర్జాతీయంగా విస్తరించాలనుకుంటున్నట్లు తెలిపారు.

Published : 17 Feb 2023 15:45 IST

దిల్లీ: పౌర విమానయాన రంగానికి (Indian aviation) భారత్‌లో గణనీయ వృద్ధి అవకాశాలున్నాయని ఇండిగో (IndiGo) సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ అన్నారు. ఈ క్రమంలో కంపెనీల మధ్య పోటీ కూడా పెరుగుతుందన్నారు. ఇది భారత విమానయాన రంగాన్ని కొత్త దశలోకి తీసుకెళ్తుందని తెలిపారు. ఎయిరిండియా (Air India) తాజాగా చేపడుతున్న చర్యలు అందులో భాగమేనన్నారు. మరోవైపు వృద్ధికి అనుగుణంగా దేశంలో ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌లైన్లు ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఇండిగో (IndiGo)కు ప్రస్తుతం 300 విమానాలున్నాయి. వీటితో దేశీయంగా 76, అంతర్జాతీయంగా 26 గమ్యస్థానాలకు సర్వీసులను నడుపుతోంది. ధర్మశాల, నాసిక్‌కి కూడా సేవల్ని ప్రారంభిస్తామని ఇటీవలే ప్రకటించింది. కరోనా సంక్షోభం నుంచి భారత విమానయాన రంగం వేగంగా, బలంగా కోలుకుంటోందని పీటర్‌ అన్నారు. దేశ ఆర్థిక వృద్ధి ఇండిగోను ముందుకు నడిపిస్తోందని తెలిపారు. అదే సమయంలో భారత వృద్ధికి ఇండిగో నెట్‌వర్క్‌ దన్నుగా నిలుస్తోందని పేర్కొన్నారు. 

(Also Read: ఎయిర్‌ ఇండియా డీల్‌ అంత పెద్దదా..!)

వచ్చే వేసవిలో నైరోబీ (కెన్యా), జకార్తా (ఇండోనేషియా)కు కూడా సర్వీసులను విస్తరిస్తామని పీటర్‌ తెలిపారు. అదే సమయంలో మధ్య ఆసియాలో పలు ప్రాంతాలకు విమానాలను నడపాలనుకుంటున్నామన్నారు. దేశీయంగా ఉన్న బలమైన నెట్‌వర్క్‌ను అంతర్జాతీయ సేవలకూ విస్తరించాలనుకుంటున్నామని తెలిపారు. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఇండిగో నికర లాభం భారీగా పెరిగి రూ.1,422.6 కోట్లకు చేరిన విషయం తెలిసిందే. ఆదాయం రూ.15,410 కోట్లుగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని