Salary Hike: సిబ్బంది వేతనాలు పెంచిన ఇండిగో.. అందుకేనా?

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తమ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది....

Published : 07 Jul 2022 15:08 IST

దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తమ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు 8 శాతం వరకు ఉండనున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌ సంక్షోభం ముగిసిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ తిరిగి పుంజుకొన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే సిబ్బంది జీతభత్యాలను పెంచుతున్నట్లు పేర్కొంది. అలాగే ఎక్కువ పనిగంటలు విధుల్లో ఉండే పైలట్లకు ఇచ్చే అదనపు భత్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. జులైలో సగటున రోజుకి 1,550 విమాన సర్వీసుల్ని ఇండిగో షెడ్యూల్ చేసింది.

కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో 2020లో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. విమానయాన సంస్థలు తీవ్రనష్టాల్ని మూటగట్టుకొన్నాయి. దీంతో ఇండిగో తమ సిబ్బంది వేతనాలను 28 శాతం తగ్గించింది. తాజాగా కొవిడ్‌ నుంచి పరిస్థితులు చక్కబడటంతో ప్రభుత్వాలు విమాన ప్రయాణాలపై ఆంక్షల్ని ఎత్తివేశాయి. విమాన సర్వీసుల్లో రద్దీ పుంజుకొంది. దీంతో వేతనాల సమీక్షకు ఇండిగో శ్రీకారం చుట్టింది. గత ఏప్రిల్‌లో 8 శాతం పెంచింది. తాజాగా మరో 8 శాతం పెంపుతో మొత్తం 16 శాతం పెంచినట్లయింది.

కొవిడ్‌ మునుపటి స్థాయి వేతనాలు ఇవ్వకపోవడంపై ఇండిగో పైలట్లు తీవ్ర అసహనంతో ఉన్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. విమాన సర్వీసులు కొవిడ్‌ మునుపటి స్థాయికి చేరుకున్నప్పటికీ.. జీతాలు పునరుద్ధరించకపోవడంపై వారంతా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. జులై 2న దాదాపు సగానికిపైగా ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచిన విషయం తెలిసిందే. క్యాబిన్‌ క్రూలో చాలామంది సెలవులపై వెళ్లడమే ఇందుకు కారణం. వారంతా ఇతర సంస్థల్లో నియామకాల కోసం జరుగుతున్న ఇంటర్వ్యూలకు హాజరైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వేతన పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఎయిరిండియా కొత్త యజమాని టాటా గ్రూప్‌ తమ ఉద్యోగుల వేతనాల్ని కొవిడ్‌ ముందునాటి పరిస్థితితో పోలిస్తే 75 శాతానికి పునరుద్ధరించింది. టాటా గ్రూప్‌కే చెందిన మరో సంస్థ విస్తారా సిబ్బంది వేతనాలు, ఇతర భత్యాలను కొవిడ్‌ మునుపటి స్థాయికి పెంచింది. స్పైస్‌జెట్‌ కూడా 10-15 శాతం వేతన పెంపు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని