IRCTC Vikalp Scheme: వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నా.. టికెట్‌ కన్ఫర్మ్‌ అయ్యే ఛాన్స్‌!

IRCTC Vikalp Scheme: టికెట్‌ కన్ఫర్మ్‌ అయ్యే ఛాన్స్‌ను మెరుగుపర్చుకోవడం కోసం ఐఆర్‌సీటీసీ అవకాశం కల్పిస్తోంది. ఆటో అప్‌గ్రేడ్‌, వికల్ప్‌ స్కీం వాటిలో భాగమే.

Updated : 21 Feb 2023 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగల సీజన్‌లో రైలు టికెట్‌ కన్ఫర్మ్‌ అయ్యిందంటే ప్రయాణికులు ఎంత ఆనందిస్తారో! సాధారణ సమయాల్లోనూ రద్దీ రూట్లలో టికెట్‌ కన్ఫర్మ్‌ కావడం కొంత కష్టతరమే. దీనికి పరిష్కారంగానే భారతీయ రైల్వే (Indian Railways) అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో ఒకటి వికల్ప్‌ స్కీం (IRCTC Vikalp Scheme). వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు కన్ఫర్మ్‌ చేసిన బెర్త్‌ అందించడమే లక్ష్యంగా ఐఆర్‌సీటీసీ (IRCTC) ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీన్నే ‘ఆల్టర్నేటివ్‌ ట్రైన్‌ అకామడేషన్‌ స్కీం’ అని కూడా అంటున్నారు.

ఏంటీ స్కీం..

మనం వెళ్లాలనుకుంటున్న రైలులో బెర్త్‌లు ఖాళీ లేనప్పుడు ఒక్కోసారి మనకు వెయిటింగ్‌ లిస్ట్‌లో చోటు లభిస్తుంది. అంటే కన్ఫర్మ్‌ అయిన ప్రయాణికుల్లో ఎవరైనా టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే ప్రాధాన్య క్రమంలో ఆ సీటును వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నవారికి కేటాయిస్తారు. అయితే, చివరి వరకూ టికెట్‌ కన్ఫర్మ్‌ కాదనుకునే సందర్భంలో వికల్ప్‌ స్కీంను ఉపయోగపడుతుంది. టికెట్‌ను బుక్‌ చేసుకునే సమయంలో ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అదే మార్గంలో ప్రయాణిస్తున్న మరిన్ని రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తారు. వాటిలో దేంట్లో బెర్త్‌లు ఖాళీ ఉంటే దాంట్లో మనకు సీటు కేటాయిస్తారు. ఆ విధంగా వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నప్పటికీ.. బెర్త్‌ కేటాయించే వెసులుబాటును రైల్వేశాఖ వికల్ప్‌ ద్వారా కల్పిస్తోంది.

ఆటోమేటిక్‌ అప్‌గ్రేడ్‌..

రైల్వేలో కన్ఫర్మ్‌ అవ్వడానికి ఉన్న మరో మార్గం ఆటో అప్‌గ్రేడ్‌. టికెట్ కొనుగోలు సమయంలోనే ఆటో అప్‌గ్రేడ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం స్లీపర్‌ క్లాస్‌కు టికెట్‌ బుక్‌ చేసుకున్నాం అనుకుందాం. అలాంటప్పుడు ఆటో అప్‌గ్రేడ్‌ ఎంచుకుంటే.. స్లీపర్‌ కంటే పై తరగతిలో బెర్తులు ఖాళీ ఉంటే దాన్ని కేటాయిస్తారు. మూడో తరగతి ఏసీ, రెండో తరగతి ఏసీ.. ఒక్కోసారి ఒకటో తరగతి ఏసీలో కూడా మనకు బెర్త్‌ దొరికే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడంతో పాటు రైలులో ఖాళీ బెర్త్‌లు సద్వినియోగం అయ్యేలా రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. వికల్ప్‌ స్కీంను ఎంచుకున్న ప్రయాణికులకు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్‌ ఆప్షన్‌ అమలవుతుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..

  • వికల్ప్‌ స్కీంను ఎంచుకున్నంత మాత్రాన కచ్చితంగా వేరే ట్రైన్‌లో బెర్త్‌ లభిస్తుందన్న గ్యారంటీ ఉండదు. మనం ఎంచుకున్న రైళ్లలో ఉన్న ఖాళీ బెర్త్‌లు, సమయం, ప్రయాణించే మార్గంపై అది ఆధారపడి ఉంటుంది.
  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
  • ఒకసారి మరో రైలులో మనకు బెర్త్‌ కేటాయిస్తే.. క్యాన్సిలేషన్‌ ఛార్జీలు ఆ రైలు, బెర్త్‌ స్థితిపై ఆధారపడి ఉంటాయి.
  • రైలు ఎక్కే స్టేషన్‌, దిగే స్టేషన్‌లలో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
  • బుక్‌ చేసుకున్న టికెట్‌ హిస్టరీ లింక్‌ ద్వారా ఛార్టింగ్‌కు కొద్దిసేపటి ముందు కూడా వికల్ప్‌ స్కీంను ఎంచుకోవచ్చు.
  • ఛార్టింగ్‌ తర్వాత కచ్చితంగా ఒకసారి పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలి.
  • ఛార్టింగ్‌ తర్వాత కూడా ‘ఫుల్లీ వెయిటింగ్‌ లిస్ట్‌’లో ఉన్న ప్రయాణికులను మాత్రమే వికల్ప్‌ కింద మరో రైలులో బెర్త్‌ కేటాయించేందుకు పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఒకవేళ మరో ట్రైన్‌లో పై తరగతిలో బెర్త్ లభిస్తే ఎలాంటి అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  • వికల్ప్‌ ద్వారా మరో రైలులో బెర్త్‌ కన్ఫర్మ్‌ అయితే వారి పేర్లు ఒరిజినల్‌ ట్రైన్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండవు. అలా ఇతర రైళ్లకు బదిలీ చేసిన పేర్లతో ప్రత్యేక జాబితాను అతికిస్తారు.
  • ఒకవేళ ఇతర ట్రైన్‌లో బెర్త్‌ కేటాయించినప్పటికీ ప్రయాణం చేయకపోతే.. టీడీఆర్‌ రిక్వెస్ట్ ద్వారా రీఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు