Jio Cinema: జియో సినిమా నుంచి మూడు ప్లాన్లు.. ధరలు ఇవేనా..?

Jio Cinema subcription plans: జియో సినిమా కంటెంట్‌ను వీక్షించాలంటే ఇకపై రుసుములు చెల్లించాల్సిందే. త్వరలోనే దీనికి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌ విధానం అందుబాటులోకి రానుంది.

Updated : 25 Apr 2023 14:12 IST

దిల్లీ: రిలయన్స్‌కు చెందిన స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా (Jio Cinema) త్వరలో వినియోగదారుల నుంచి రుసుములు వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో క్రికెట్‌ అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ పొందుతున్న ఈ వేదిక.. కొత్తగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, మ్యూజిక్‌ వీడియోలతో అలరించనుంది. ఓ వైపు ఐపీఎల్‌ను ఫ్రీగా చూసే వెసులుబాటు కల్పిస్తూనే.. మరోవైపు కొత్తగా తీసుకొచ్చే కంటెంట్‌కు డబ్బులు వసూలు చేయబోతున్నామని రిలయన్స్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో జియో సినిమా తీసుకురాబోతున్న ప్లాన్లు ఇవేనంటూ ఆన్‌లైన్‌లో కొన్ని స్క్రీన్‌షాట్లు చక్కర్లు కొడుతున్నాయి.

జియో సినిమా నుంచి మూడు ప్లాన్లు రానున్నట్లు తెలుస్తోంది. జియో సినిమా టెస్టింగ్‌ వెబ్‌సైట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఓ యూజర్‌ రెడిట్‌లో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డైలీ, గోల్డ్‌, ప్లాటినమ్‌ పేర్లతో ఈ ప్లాన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

  • డైలీ ప్లాన్‌ను కేవలం రూ.2కే జియో అందించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవంలో ఈ ప్లాన్‌ ధరను జియో రూ.29గా పేర్కొన్నప్పటికీ.. డిస్కౌంట్‌లో రూ.2కే అందించనున్నట్లు తెలిసింది. అంటే ఒకసారి రూ.2 పెట్టి డైలీ ప్యాక్‌ కొనుగోలు చేస్తే 24 గంటల పాటు యాప్‌లో కంటెంట్‌ను వీక్షించొచ్చు. ఒకేసారి రెండు డివైజుల్లో వీక్షించే సదుపాయం ఉంది.
  • గోల్డ్‌ స్టాండర్డ్‌ ప్లాన్‌ ధరను రూ.299గా పేర్కొన్నప్పటికీ .. రిలయన్స్‌ రూ.99కే అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వ్యాలిడిటీ మూడు నెలలు. ఈ ప్లాన్‌లో సైతం రెండు డివైజుల్లో ఒకేసారి కంటెంట్‌ను వీక్షించొచ్చు. 
  • ప్రీమియం ప్లాన్‌ ధరను రిలయన్స్ రూ.1199గా పేర్కొంది. డిస్కౌంట్‌లో రూ.599కే అందిస్తోంది. ఏడాది వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌లో ఏకకాలంలో నాలుగు డివైజులను వినియోగించుకోవచ్చు. లైవ్‌ కంటెంట్‌ మినహా మిగిలిన కంటెంట్‌లో ఎలాంటి ప్రకటనలూ ఉండవు.

ఈ ప్లాన్లను అధికారికంగా రిలయన్స్‌ ప్రకటించలేదు. అయితే, అందరికీ ఒకేలాంటి ప్లాన్లు ఉంటాయా? జియో యూజర్లకు వేరే ప్లాన్లు ఏమైనా ఉంటాయా? అనేది చూడాలి. కంపెనీ అధికారికంగా ప్రకటించాక దీనిపై స్పష్టత వస్తుంది. మరోవైపు ప్రస్తుత సీజన్‌ పూర్తయ్యే వరకు ఐపీఎల్‌ ప్రసారాలను జియో సినిమాలో ఉచితంగా వీక్షించొచ్చని రిలయన్స్‌ ఇది వరకే  స్పష్టంచేసింది. మ్యాచ్‌లు పూర్తయ్యేలోపే కొత్త కంటెంట్‌ను యాడ్ చేసి సబ్‌స్క్రిప్షన్‌కు వెళ్లాలని రిలయన్స్‌ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని