Credit Cards: క్రెడిట్‌ కార్డు అప్‌గ్రేడ్‌ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

క్రెడిట్‌ కార్డుతో అనేక రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు పొందొచ్చు, మెరుగైన క్రెడిట్‌ స్కోరు నిర్వహణకు ఈ కార్డులను ఉపయోగించుకోవచ్చు.

Published : 10 Nov 2022 18:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత కాలంలో షాపింగ్‌కు, ఆన్‌లైన్‌ చెల్లింపులకు క్రెడిట్‌ కార్డులనే ఎక్కువుగా వాడుతున్నారు. డిజిటలైజేషన్‌లో భాగంగా క్రెడిట్‌ కార్డుల వినియోగం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. క్రెడిట్‌ రిస్క్‌లేని ఖాతాదారులకు క్రెడిట్‌ కార్డులను ఇవ్వడానికి బ్యాంకులు మొగ్గుచూపుతున్నాయి. అయితే ఇప్పటికే క్రెడిట్‌ కార్డు ఉన్నవారు ఆ కార్డుని అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటే కొన్ని విషయాలను తెలుసుకోవడం మంచిది.

క్రెడిట్‌ కార్డును చాలా చోట్ల వినియోగిస్తుంటాం. అయితే ఎక్కడ ఎక్కువగా వినియోగిస్తున్నామో గమనించి.. ఆ కేటగిరీలో ఎక్కువ ప్రయోజనాలను అందించే క్రెడిట్‌ కార్డుని ఎంపిక చేసుకోవడం ద్వారా లాభం పొందొచ్చు. ప్రాథమిక క్రెడిట్‌ కార్డులు వార్షిక ఫీజు లేకుండా గానీ తక్కువ ఫీజుతో గానీ వస్తాయి. మెరుగైన ఫీచర్లతో కూడిన క్రెడిట్‌ కార్డు కావాలంటే మాత్రం ఎక్కువ వార్షిక రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.

మొదటిసారి క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు.. జారీ సంస్థలు సాధారణంగా ప్రాథమిక ఫీచర్స్‌తో కూడిన ఎంట్రీ-లెవల్‌ కార్డును మాత్రమే అందిస్తాయి. కొత్తగా క్రెడిట్‌ ప్రయాణాన్ని ప్రారంభించేవారికి ఇటువంటి కార్డులు అనుకూలంగా ఉంటాయి. ప్రీమియం కార్డుల స్థాయిలో రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్‌, ట్రావెల్‌ బెనిఫిట్స్‌, లాంజ్‌ యాక్సెస్‌ వంటి ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందించవు. అయితే, కాలక్రమేణా మీ ఆదాయం పెరుగుతుంది. కార్డు లావాదేవీలు పెరుగుతాయి. దీంతో మీ క్రెడిట్‌ స్కోరు మెరుగుపడుతుంది. అప్పుడు అధిక ప్రయోజనాలను అందించే కార్డుకు అప్‌గ్రేడ్‌ అవ్వచ్చు.

ఎలాంటి ఫీచర్స్‌ ఉన్న క్రెడిట్‌ కార్డును తీసుకోవాలి?

ఖర్చులకు అనుగుణంగా

క్రెడిట్‌ కార్డులు అన్ని ఖర్చులకు సాధారణ ప్రయోజనాలు అందించినప్పటికీ నిర్దిష్ట కేటగిరీ (ప్రయాణాలు, ఇంధనం, షాపింగ్‌ ఇలా)పై అధిక ప్రయోజనాలను అందిస్తాయి. ఉదా: ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డులు.. ప్రయాణ బుకింగ్‌లపై అదనపు రివార్డులు / రాయితీ ఆఫర్లు, కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ లేదా ఉచిత విమాన టిక్కెట్లు వంటి ప్రయాణ ఖర్చులను ఆదా అయ్యే ప్రయోజనాలతో వస్తాయి. ఇంధన క్రెడిట్‌ కార్డులు..  పెట్రోల్‌ పంపుల వద్ద పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్లపై రాయితీ ఇస్తుంటాయి. అందుచేత మీరు ఎక్కువగా ఖర్చు చేసే కేటగిరీలను గుర్తించి, ఆ కేటగిరిలో కార్డుకు అప్‌గ్రేడ్‌ చేసుకుంటే అధిక ప్రయోజనాలను పొందే వీలుంటుంది.

రివార్డు వివరాలను తెలుసుకోండి

మీకు కావలసిన క్రెడిట్‌ కార్డు రకాన్ని తెలుసుకున్న తర్వాత నిబంధనలు, షరతులతో పాటు కార్డు ఫీచర్లను సవివరంగా తెలుసుకోవాలి. ఉదా: మీరు షాపింగ్‌ క్రెడిట్‌ కార్డుని ఎంచుకుంటే.. దానిలో లభించే రివార్డులు, క్యాష్‌బ్యాక్‌ వంటి వాటితో ఎంత ప్రయోజనం పొందుతారో తెలుసుకోవాలి.

గరిష్ఠ పరిమితి

కొన్ని కార్డులు ఎంపిక చేసిన బ్రాండ్లు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫ్లాట్‌ఫాంలపై మాత్రమే ప్రయోజనాలు అందిస్తాయి. మీరు ఆయా బ్రాండ్లు, ఫ్లాట్‌ఫాంలపై ఎక్కువగా షాపింగ్‌ చేసేవారైతేనే వాటిని ఎంచుకోవాలి. మరికొన్ని కార్డులు కొనుగోళ్లపై మంచి రాయితీనే అందించినప్పటికీ.. గరిష్ఠ పరిమితిని కూడా విధిస్తుంటాయి. ఉదా: క్రెడిట్‌ కార్డు ద్వారా రూ. 10 వేలు ఖరీదు చేసే ఒక మొబైల్‌ కొన్నారనుకుందాం. కార్డు కొనుగోలుపై 15% రాయితీ అని ఉంటుంది. అంటే రూ. 1,500 ధర తగ్గాలి. కానీ అక్కడ గరిష్ఠ రాయితీ పరిమితి రూ.1,000 అని కూడా ఉంటుంది. ఇక్కడ వినియోగదారుడికి లభించేది రూ.1000 మాత్రమే. కాబట్టి రాయితీపై గరిష్ఠ పరిమితిని కూడా చెక్‌ చేసుకోవాలి.

వార్షిక రుసుం..

మెరుగైన ప్రయోజనాలతో కార్డు వస్తుందంటే.. వార్షిక రుసుం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మీ బ్యాంకు విధించే వార్షిక రుసుమును.. మీరు పొందే ప్రయోజనాలు అధిగమించేలా ఉన్నాయా విశ్లేషించుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు కార్డును ఉపయోగించి చేయాల్సిన కనీస వ్యయ పరిమితిని ముందుగానే నిర్ణయిస్తాయి. ఈ పరిమితిని మించి ఖర్చు చేస్తే.. వార్షిక రుసుమును తిరిగి చెల్లిస్తాయి. ఒకవేళ మీ ఖర్చులు ఈ పరిమితి మించేలా ఉంటే కార్డు అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. అయితే వార్షిక రుసుమును తిరిగి పొందడం కోసమే అధిక స్థాయిలో ఖర్చు చేయడం మంచిది కాదు. 

అధిక క్రెడిట్‌ పరిమితి..

కార్డు అప్‌గ్రేడ్‌ చేసినప్పుడు సాధారణంగా క్రెడిట్‌ లిమిట్‌ కూడా పెరుగుతుంది. ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కొనుగోలు శక్తి పెరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ మొత్తం వినియోగించుకునేందుకు యాక్సెస్‌ లభిస్తుంది. అంతేకాకుండా క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి తగ్గుతుంది. అయితే ఎక్కువ పరిమితితో వచ్చే కార్డును ఇచ్చేటప్పుడు.. మీ ఆదాయంతోపాటు అనేక అంశాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి.

రివార్డు బ్యాలెన్స్‌ బదిలీ..

కొత్త కార్డుకు అప్‌గ్రేడ్‌ అయ్యే ముందు మీ ప్రస్తుత కార్డులో ఉన్న రివార్డు బ్యాలెన్స్‌, క్యాష్‌బ్యాక్‌ను చెక్‌ చేసుకోవాలి. ఇది మీ కార్డు ఖాతాకు ఇంకా క్రెడిట్‌ కాకపోవచ్చు. అందుచేత అప్‌గ్రేడ్‌ అయ్యే కొత్త కార్డులో, మీ పాత కార్డు రివార్డు బ్యాలెన్స్‌ బదిలీ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి. బదిలీ కాని పక్షంలో పాత కార్డుకు సంబంధించిన పాయింట్లను రీడీమ్‌ చేయాలి. దీంతో క్రెడిట్‌ కార్డులో సంపాదించిన రివార్డ్‌ పాయింట్లను కోల్పోకుండా చూసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని