Maruti Suzuki: విస్తరిస్తున్న మారుతీ సేల్స్‌ నెట్‌వర్క్‌.. 3,500 ఔట్‌లెట్స్‌

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మారుతీ సుజుకీ తమ సేల్స్‌ నెట్‌వర్క్‌ను పెంచుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో 3,500వ ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. ఈ ఏడాది చివరకు 3,700 విక్రయ కేంద్రాలను తెరుస్తామని ధీమా వ్యక్తం చేసింది.

Published : 18 Nov 2022 21:37 IST

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి తమ సేల్స్‌ నెట్‌వర్క్‌ 3,700 ఔట్‌లెట్ల మైలురాయిని చేరుకుంటుందని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మానేసర్‌లోని ప్లాంట్‌ తయారీ సామర్థ్యాన్ని లక్ష యూనిట్లకు పెంచుకునే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో విక్రయ కేంద్రాల నెట్‌వర్క్‌ను కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. 

హైదరాబాద్‌లో శుక్రవారం మారుతీ సుజుకీ తమ నెక్సా సేల్స్‌ యూనిట్‌ 3,500వ ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. దశాబ్దం క్రితం 1,300గా ఉన్న డీలర్‌షిప్‌ల సంఖ్య ఇప్పుడు 3,500కు చేరాయి. భారత్‌లో మొత్తం 2,250 పట్టణాలు, నగరాలకు మారుతీ సుజుకీ ఇండియా ఔట్‌లెట్‌లు విస్తరించాయి. 2021-22లో కంపెనీ కొత్తగా 237 సేల్స్‌ ఔట్‌లెట్‌లను ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌- అక్టోబర్‌ మధ్య 170 విక్రయ కేంద్రాలను తెరిచింది. ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో కార్ల వినియోగం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కేవలం నగరాలకే కాకుండా చిన్న చిన్న పట్టణాలకు సైతం తమ నెట్‌వర్క్‌ విస్తరిస్తోందని పేర్కొన్నాయి. 

సోనీపట్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటులో 2025 నుంచి మారుతీ తయారీ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అంతకంటే ముందు మానేసర్‌లోని ప్లాంటు సామర్థ్యాన్ని లక్ష యూనిట్లకు విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం మారుతీ మొత్తం తయారీ వార్షిక సామర్థ్యం 15 లక్షల యూనిట్లుగా ఉంది. మానేసర్‌తో పాటు గురుగ్రామ్‌లోనూ తయారీ జరుగుతోంది. గుజరాత్‌లో సుజుకీ మోటార్స్‌కు చెందిన ప్లాంటులోనూ 7.5 లక్షల యూనిట్ల వాహనాలు తయారవుతున్నాయి. హరియాణాలోని ఖర్కోడాలో మరో కొత్త ప్లాంటును నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని