Maruti Suzuki Invicto: మారుతీ సుజుకీ ఇన్విక్టో వచ్చేసింది..!

మారుతీ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఎంపీవీ ‘ఇన్విక్టో’ నేడు మార్కెట్‌లోకి విడుదలైంది.

Updated : 05 Jul 2023 14:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైబ్రిడ్‌ కార్ల మార్కెట్‌పై పట్టు బిగించేందుకు మారుతీ సుజుకీ (Maruti Suzuki) మరో అడుగు ముందుకేసింది. స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ విభాగంలో రెండో కారును వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ‘ఇన్విక్టో’ (Invicto) పేరిట ఎంపీవీని బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు బుకింగ్స్‌ను జూన్‌ 19 నుంచే మారుతీ స్వీకరించడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇన్విక్టో విక్రయాలను మారుతీ ప్రీమియం రేంజి కార్ల కోసం ఏర్పాటు చేసిన నెక్సా షోరూంలలో చేపట్టనున్నారు.

మూడు వరుసల సీట్లున్న ఈ కారు జెటా+ (7 సీటర్‌) ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.24.79 లక్షలు, జెటా+ (8 సీటర్‌) రూ. 24.84 లక్షలు, ఆల్ఫా+ (7 సీటర్‌) రూ.28.42 లక్షల్లో అందుబాటులో ఉంటుంది. ఈ కారు మారుతీ సబ్‌స్క్రైబ్‌లో కూడా నెలవారీ ఫీజ్‌ రూ.61,860తో అందుబాటులో ఉండనుంది. ఈ కారు 4,755 ఎంఎం పొడవు, 1,850 ఎంఎం వెడల్పు, 1,795 ఎంఎం ఎత్తు ఉంది. నెక్సా బ్లూ, మిస్టిక్‌ వైట్‌, మెజిస్టిక్‌ సిల్వర్‌, స్టెల్లార్‌ బ్రాంజ్‌ వర్ణాల్లో ఇది విక్రయానికి సిద్ధమైంది.

ఈ కారులో ఇంటెలిజెంట్‌ ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌తో 2.0 లీటర్‌ ఇంజిన్‌, 10.1 అంగుళాల స్మార్ట్‌ ప్లే మాగ్నమ్‌+ (యాపిల్‌, ఆండ్రాయిడ్‌),  డ్రైవ్‌ మోడ్‌ కలర్‌ థీమ్‌లతో కూడిన 7 అంగుళాల మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్‌, ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌, నెక్స్ట్‌ జెన్‌ సుజుకీ కనెక్ట్‌ నుంచి 50 ఫీచర్లు, వన్‌టచ్‌ పవర్‌ టెయిల్‌ గేట్‌, హిల్‌హోల్డ్‌ అసిస్ట్‌, టీపీఎంస్‌, డ్యూయల్‌ జోన్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, 360 డిగ్రీ వ్యూ మానిటర్‌, యాంబియంట్‌ లైటింగ్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లున్నాయి. మారుతీ తొలిసారి ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ ఫీచర్‌, మెమొరీ ఆధారంగా పనిచేసే డ్రైవర్‌ సీట్‌ను దీనిలో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ కారుకు 6,000కు పైగా బుకింగ్స్‌ వచ్చాయి.

‘‘ఇటీవల మా కొత్త కార్లు గ్రాండ్‌ విటారా, ఫ్రాంక్స్‌, జిమ్ని రాకతో విక్రయాలు స్థిరంగా వృద్ధి చెందుతున్నాయి. కార్బన్‌ న్యూట్రాలిటీకి మారుతీ సుజుకీ కట్టుబడి ఉంది. 2030-31 నాటికి సంస్థ మొత్తం ఆరు ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకురానుంది. భారత మార్కెట్లో నెక్సా లైనప్‌లోని ఎనిమిదో కారు ఇన్వెక్టో. ఈ కారు విజయవంతమై.. మార్కెట్లో మా విక్రయాల సంఖ్యను పెంచుతుందని బలంగా నమ్ముతున్నాం’’ అని ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో హిసాషీ టకేయుచి పేర్కొన్నారు.

‘‘యూవీ విభాగంలో గత ఆరేళ్లుగా మారుతీ లీడర్‌గా ఉంది. బ్రెజా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌-6 వాహనాలు బ్రాండ్‌ను నిలబెట్టాయి’’ అని సంస్థ విక్రయాలు, మార్కెటింగ్‌ విభాగం సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. సుజుకీ-టయోటా భాగస్వామ్యంలో విడుదల చేసిన నాలుగో మోడల్‌ కారు ఇది. ఇప్పటికే గ్లాంజా, అర్బన్‌ క్రూజర్‌, గ్రాండ్‌ విటారాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టయోటా ఇన్నోవా హైక్రాస్‌ వాహనాన్ని మారుతీ రీబ్యాడ్జ్‌ చేసి ఇన్విక్టోగా తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని