SCSS: సీనియర్‌ సిటిజన్ పథకంలో గరిష్ఠంగా ఎంత వడ్డీ పొందొచ్చు?

ఒక వ్యక్తి SCSSలో రూ.30 లక్షల వరకు గరిష్ఠ డిపాజిట్‌ చేస్తే ఎంత వడ్డీని పొందొచ్చో ఇక్కడ చూద్దాం.

Published : 03 Feb 2023 13:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (SCSS)లో ఒక వ్యక్తి ఇప్పటివరకు రూ.15 లక్షల వరకు గరిష్ఠ డిపాజిట్‌ చేసే అవకాశం ఉండేది. SCSS గరిష్ఠ డిపాజిట్‌ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకానికి ప్రభుత్వ మద్దతు  ఉంది కాబట్టి డిపాజిట్‌ చేసిన మొత్తానికి హామీ ఉంటుంది. ఈ పథకానికి ప్రస్తుత వడ్డీ రేటు 8%. ప్రముఖ బ్యాంకులు, పోస్టాఫీసులు అందించే వడ్డీ రేట్లతో పోల్చి చూసినా కూడా SCSS వడ్డీ రేటు మెరుగ్గా ఉంది.

SCSS పథకం (5 సంవత్సరాల) మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత ఖాతాను మరో 3 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది. 60 ఏళ్లు పైబ‌డిన ఎవ‌రైనా పోస్టాఫీస్ లేదా బ్యాంకు నుంచి ఈ ప‌థ‌కంలో చేర‌వచ్చు. త్రైమాసిక ప్రాతిప‌దిక‌న అధిక స్థిర రాబ‌డి, సాధార‌ణ ఆదాయం కోసం చూస్తున్న సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఈ సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌ స‌రిపోతుంది. SCSSలో పెట్టుబ‌డులు 1961 ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్షన్‌ 80సి కింద సంవత్సరానికి రూ.1.50 లక్షల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు అందిస్తాయి.

డిపాజిట్‌ గరిష్ఠ పరిమితిని ఇప్పుడు ఒక్కో ఖాతాకు రూ.30 లక్షల వరకు పెంచినందున సీనియర్‌ సిటిజన్లు ఇప్పుడు అధిక త్రైమాసిక ఆదాయాన్ని పొందుతారు. ఈ పథకంలో త్రైమాసిక ప్రాతిపదికన మాత్రమే వడ్డీ చెల్లిస్తారు. సగటు వడ్డీ రేటు 8% చొప్పున, రూ.30 లక్షలు డిపాజిట్‌ చేయడం ద్వారా త్రైమాసిక వడ్డీ ఆదాయం రూ.60,000 అవుతుంది. అంటే, రూ.30 లక్షలు డిపాజిట్‌ చేయడం ద్వారా నెలవారీ ఆదాయం రూ.20,000 పొందొచ్చు. ఈ డిపాజిట్‌ పరిమితి పెంపు ప్రభావం వల్ల సీనియర్‌ సిటిజన్లు మంచి రాబడిని సంపాదించి వారి పదవీ విరమణ అనంతర సమయంలో వారికి ఆర్థికంగా భరోసా ఉంటుందని, మధ్యతరగతి పెద్దలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని సీనియర్‌ సిటిజన్లు భావిస్తున్నారు.

రూ.1 లక్ష నుంచి రూ.30 లక్షల వరకు డిపాజిట్‌ చేయడం ద్వారా సీనియర్‌ సిటిజన్లు 5 ఏళ్లలో ఎంత వడ్డీ ఆదాయాన్ని పొందవచ్చో ఈ కింది పట్టికలో ఉంది.

గమనిక: ఈ పథకంలో వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన మాత్రమే చెల్లిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని