Comet EV: ఎంజీ కమెట్‌ వచ్చేసింది.. సింగిల్‌ ఛార్జ్‌తో 230km

Comet EV details: ఎంజీ మోటార్‌ ఇండియా కమెట్‌ వాహనాన్ని విడుదల చేసింది. దీని ధర రూ.7.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.  

Published : 26 Apr 2023 13:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ మోరిస్‌ గ్యారేజెస్‌ అనుబంధ ఎంజీ మోటార్‌ ఇండియా (MG) తన కమెట్‌ విద్యుత్‌ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. వారం క్రితం దీని ప్రివ్యూ విడుదల చేసిన ఆ సంస్థ.. తాజాగా ధర, బుకింగ్‌ వివరాలను వెల్లడించింది. ఈ కారు ధర రూ.7.98 లక్షల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. తక్కువ ఖర్చుతో పర్యావరణహితమైన వాహనాల కోసం చూస్తున్న అన్ని వయసుల వారిని లక్ష్యంగా చేసుకుని ఈ వాహనాన్ని ఎంజీ తీసుకొచ్చింది. మే 15 నుంచి బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి. గతంలో ఇదే కంపెనీ ZS EVని లాంచ్‌ చేసింది. ఆ కంపెనీ నుంచి వస్తున్న రెండో కారు ఇది.

ఎంజీ తీసుకొచ్చిన కమెట్‌ విద్యుత్‌ కారు వివిధ వేరియంట్లలో లభ్యమవుతుంది. కానీ, వాటి ధరల వివరాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఇందులో 17.3 kWh బ్యాటరీని అమర్చారు. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 230 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. 3.3 kW ఛార్జర్‌తో 0-100 బ్యాటరీని 7 గంటల్లో పూర్తి చేయొచ్చని కంపెనీ పేర్కొంది. 10-80 శాతం ఛార్జింగ్‌కు 5 గంటలు పడుతుందని తెలిపింది. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న ఈ కారులో ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగ్స్‌ ఇస్తున్నారు. రెండు డోర్లు మాత్రమే ఉండే ఈ కారులో నాలుగు సీట్లు ఉంటాయి. రివర్స్‌ పార్కింగ్‌ కెమెరా, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్‌, ఎల్‌ఈడీ రియర్‌ ఫాగ్‌ ల్యాంప్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి.

అర్బన్‌ కస్టమర్లే టార్గెట్‌..

నగరాలు, పట్టణాల్లో నివసించే కస్టమర్లను ఉద్దేశించి ఈ కారును ఎంజీ తీసుకొచ్చింది. రోజుకు 100 కంటే తక్కువ కిలోమీటర్లు ప్రయాణించే కస్టమర్లకోసం కమెట్‌ను తీసుకొస్తున్నట్లు ఎంజీ మోటార్‌ ఇండియా ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ చాబా పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో విద్యుత్‌ వాహనాల సంఖ్య 2 శాతంగా ఉందని, ఈ సంఖ్య 10 శాతానికి చేరుకుంటుందని అంచనా వేశారు. రూ.10 లక్షల్లోపు విద్యుత్‌ వాహనం కోసం చూసే వారికి కమెట్‌ ఈవీ మంచి ఎంపిక అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా టియాగో ఈవీ, సిట్రోయెన్ EC3 విద్యుత్‌ కార్లకు కమెట్‌ పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని