అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్‌ బుచరింగ్ స్కామ్స్‌’పై నితిన్‌ కామత్‌ టిప్స్‌..!

Nithin Kamath tips: పిగ్‌ బుచరింగ్‌ స్కామ్స్‌ దేశంలో పెరిగిపోయాయని జిరోదా సీఈఓ నితిన్‌ కామత్‌ అన్నారు. ఈ స్కామ్స్‌ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Updated : 14 Nov 2023 19:58 IST

Nithin Kamath | ఇంటర్నెట్‌ డెస్క్‌: డిజిటల్‌ యుగంలో ఆన్‌లైన్‌ మోసాలకు కొదవే లేదు. ఎప్పుడు ఏ రూపంలో ఎవరు వల వేస్తారో గుర్తించడం కష్టం. ఒక్కసారి అలాంటి వలకు చిక్కితే ఇక అంతే.. జీవితం తలకిందులైపోతుంది. సాధారణంగా ఉద్యోగాలు, పెట్టుబడికి అధిక ప్రతిఫలం వంటివి ఎక్కువ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. సరిగ్గా ఈ ఆశే నేరగాళ్లకు వరమవుతోంది. వీటినే ఆశ చూపి చనువుగా వ్యవహరించి మోసాలకు పాల్పడుతుంటారు. ఈ తరహా మోసాలనే పిగ్‌ బుచరింగ్‌ అంటారు. ఈ మోసాలు జరుగుతున్న తీరు.. వాటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై జిరోదా వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్‌ కామత్‌ కొన్ని ఆలోచనలను తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు.

భారత్‌లో ‘పిగ్‌ బుచరింగ్‌’ మోసాలు పదుల కోట్ల స్థాయికి చేరిందని నితిన్ కామత్‌ పేర్కొన్నారు. ఫేక్‌ జాబ్‌ ఆఫర్లు, అధిక మొత్తంలో ప్రతిఫలం, క్రిప్టోలో పెట్టుబడుల రూపంలో ఈ మోసాలు జరుగుతున్నాయన్నారు. ఈ తరహా మోసాలకు పాల్పడే వారు ముందుగా అవతలి వారి నమ్మకాన్ని గెలుచుకోవడడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. ఇందుకోసం ఫేక్‌ ప్రొఫైళ్లతో ప్రేమ, స్నేహం వంటివి నటిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఉద్యోగాలు, అధిక ప్రతిఫలం ఆశజూపి మోసగిస్తుంటారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ తరహా మోసాలే జరుగుతున్నాయని చెప్పారు.

2 దశాబ్దాల తర్వాత టాటాల నుంచి ఐపీఓ.. తేదీ, ఇతర వివరాలు ఇవే!

ఇలా మోసాలకు పాల్పడే వ్యక్తులు ఇంతకుముందు ఇదే తరహా మోసాలకు బాధితులేనంటూ ఓ ఉదంతాన్ని నితిన్‌ కామత్‌ ఉదహరించారు. ఉద్యోగాల కోసం వెళ్లిన వారు విదేశాల్లో మోసపోయి తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌కు చెందిన వారినే సోషల్‌మీడియా ద్వారా ఫేక్‌ ప్రొఫైల్స్‌తో మోసగిస్తుంటారని చెప్పారు. క్విక్‌ మనీ, విదేశాల్లో ఉద్యోగం వంటివి  సహజంగానే భారతీయులను ఆకర్షిస్తుంటాయని, ఇవే మోసగాళ్లకు వరంలా మారుతున్నాయని చెప్పారు. కాబట్టి ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్‌ పాటించాలని సూచించారు.

ఇవి చేయొద్దు

  • వాట్సప్‌ గానీ, ఇతర ఏ సామాజిక మాధ్యమం అయినా సరే తెలీని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలకు రిప్లయ్‌ ఇవ్వొద్దు.
  • ఎవరైనా కొత్త యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని గానీ, లింక్‌ ఓపెన్‌ చేయమని గానీ చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు.
  • మోసాలకు పాల్పడేవారు నమ్మకం, భయం, కల, అత్యాశ వంటి భావోద్వేగాలతో ఆడుకుంటారు. కాబట్టి దేనికీ అంతవేగంగా లొంగిపోవద్దు.
  • ఆలోచించకుండా ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకునేవారే ఇలాంటి మోసాల బారిన పడే అవకాశం ఉంటుంది.
  • మీకేదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లండి. లేదంటే ఎవరైనా లాయర్‌ను సంప్రదించండి.
  • ఎవరైనా జాబ్‌ అని గానీ, అధిక ప్రతిఫలం ఆశ చూపితే అనుమానపడాల్సిందే.
  • కొత్త వ్యక్తులెవరితోనూ ఆధార్‌, పాస్‌పోర్ట్‌, బ్యాంక్‌, పెట్టుబడులకు సంబంధించి వివరాలు పంచుకోవద్దు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని