Ola Electric: ఛార్జర్‌ సొమ్మును వెనక్కిస్తాం: ఓలా ఎలక్ట్రిక్‌

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ కస్టమర్ల అలర్ట్‌. గతంలో ఛార్జర్‌ కోసం చెల్లించిన మెత్తాలను తిరిగి చెల్లిస్తామని కంపెనీ వెల్లడించింది. ఎంత మొత్తం చెల్లించేదీ పేర్కొనలేదు.

Updated : 04 May 2023 20:22 IST

దిల్లీ: ప్రముఖ విద్యుత్‌ వాహన తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) కీలక నిర్ణయం తీసుకుంది. వాహన కొనుగోలు సమయంలో గతంలో ఛార్జర్‌ కోసం చెల్లించిన మెత్తాలను కస్టమర్లకు తిరిగి చెల్లించనుంది. ఈ విషయాన్ని ఓలా తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా గురువారం వెల్లడించింది. ‘‘వినియోగదారులే మాకు ప్రథమ ప్రాధాన్యం. అర్హులైన కస్టమర్లందరికీ ఛార్జర్ డబ్బులను తిరిగి చెల్లించాలని నిర్ణయించాం. ఈ నిర్ణయం కస్టమర్లకు కంపెనీపై ఉన్న నమ్మకాన్ని బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు కూడా మేలు జరుగుతుంది’’ అని ఓలా పేర్కొంది. అయితే ఎంత మొత్తం వినియోగదారులకు చెల్లించేదీ వెల్లడించలేదు. 

ఛార్జర్‌కు తిరిగి చెల్లింపుల్లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్‌ రూ.130 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఓలాతో పాటు టీవీఎస్‌ మోటార్స్‌ (TVS Motor) కంపెనీ సైతం ఛార్జర్‌ సొమ్ము కింద రూ.20 కోట్ల సొమ్మును తిరిగిచెల్లించనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఏథర్‌ ఎనర్జీ (Ather) సైతం ఛార్జర్‌ సొమ్మును తిరిగిచెల్లించాలని నిర్ణయించింది. 2023 ఏప్రిల్‌ 12కు ముందు ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఈ చెల్లింపులు అందుతాయని పేర్కొంది. విద్యుత్‌ వాహనాల కొనుగోలు సమయంలో కొన్ని కంపెనీలు ఛార్జర్‌కు గానూ అదనంగా డబ్బును వసూలు చేశాయి. ఫేమ్‌-2 సబ్సీడీ విషయంలో నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పలు సంస్థలకు ఇటీవల కేంద్రం షాకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ మొత్తాలను తిరిగి చెల్లించేందుకు సిద్ధమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని