TSRTC నుంచి ఒలెక్ట్రాకు భారీ ఆర్డర్‌.. విజయవాడకు ఇక విద్యుత్‌ బస్సులు

Olectra bags order TSRTC: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నుంచి 550 విద్యుత్‌ బస్సులకు ఒలెక్ట్రా కంపెనీ ఆర్డర్‌ దక్కించుకుంది. దశలవారీగా ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

Published : 06 Mar 2023 19:24 IST

హైదరాబాద్‌: మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీ అనుబంధ విద్యుత్‌ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (Olectra) మరో భారీ ఆర్డర్‌ దక్కించుకుంది. 550 బస్సుల సరఫరాకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుంచి ఆర్డర్‌ లభించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణాది నుంచి ఇంత భారీ స్థాయిలో ఆర్డర్‌ దక్కడం ఇదే తొలిసారి అని ఆ కంపెనీ పేర్కొంది.

ఈ ఆర్డర్‌లో భాగంగా 50 స్టాండర్డ్‌ ఫ్లోర్‌ 12 మీటర్ల ఇంటర్‌సిటీ కోచ్‌లతో పాటు, 500 లోఫ్లోర్‌ ఇంట్రాసిటీ ఇ-బస్సులను టీఎస్‌ఆర్టీసీకి అందించనున్నట్లు సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీ ప్రదీప్‌ తెలిపారు. దశలవారీగా వీటిని అందించనున్నట్లు తెలిపారు. వీటి వల్ల హైదరాబాద్‌ మహా నగరంలో వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం సైతం భారీగా తగ్గనుందని తెలిపారు.

విజయవాడకు 50 బస్సులు

ఒలెక్ట్రా కంపెనీ అందించే 50 ఇంటర్‌సిటీ బస్సులను హైదరాబాద్‌ నుంచి విజయవాడకు నడపనున్నారు. ఎయిర్‌ కండీషన్‌ కలిగిన ఈ బస్సులు సింగిల్‌ ఛార్జ్‌తో 325 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. మిగిలిన 500 ఇంట్రాసిటీ బస్సులను హైదరాబాద్‌ నగర పరిధిలో వినియోగించనున్నారు. ఈ బస్సులు సింగిల్‌ ఛార్జ్‌తో 225 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఇప్పటికే ఒలెక్ట్రా గ్రీన్‌కు చెందిన 40 బస్సులను వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది.

పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా విద్యుత్‌ బస్సులను కొనుగోలుకు ఆర్డర్‌ చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 3400 వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు. 2025 నాటికి హైదరాబాద్‌ నగరమంతా విద్యుత్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఇందులో భాగంగా వినియోగానికి సిద్ధంగా ఉన్న 550 బస్సులను తొలి దశలో అందుకోనున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని