Savings account: పోస్టాఫీసులో డిజిట‌ల్‌ పొదుపు ఖాతా తెర‌వండిలా..

ఖాతా తెరిచిన 12 నెల‌ల్లోపు కేవైసీ పూర్తిచేయ‌క‌పోతే ఖాతాను ర‌ద్దు చేస్తారు

Updated : 19 Aug 2022 18:47 IST

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ).. మొబైల్ యాప్ ద్వారా డిజిట‌ల్‌గా పొదుపు ఖాతాను తెరిచే స‌దుపాయం అందిస్తోంది. దీని ద్వారా పోస్టాఫీసు ఖాతాదారులు ప్రాథ‌మిక బ్యాంకు లావాదేవీల‌ను ఐపీపీబీ యాప్ ద్వారా సుల‌భంగా చూసుకోవ‌చ్చు. బ్యాలెన్స్ వివ‌రాలు తెలుసుకోవ‌డం, నగదు బ‌దిలీ (మీ ఖాతా నుంచి వేరే ఖాతాకి, వేరే దాంట్లో నుంచి మీ ఖాతాలోకి) చేయ‌డంతో పాటు పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ), ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్‌), సుక‌న్య స‌మృద్ధి యోజ‌న (ఎస్ఎస్‌వై) డిపాజిట్లను కూడా ఆన్‌లైన్‌ లో పూర్తి చేయవచ్చు.

పోస్టాఫీసు డిజిట‌ల్ పొదుపు ఖాతా తెరిచే విధానం.. 

 • ముందుగా ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 
 • యాప్‌లో అందుబాటులో ఉన్న‌ 'ఓపెన్ అకౌంట్' ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. 
 • ఇక్క‌డ మీ పాన్‌, ఆధార్ కార్డు నంబ‌ర్లను ఇవ్వాలి. 
 • ఇప్పుడు మీ ఆధార్ అనుసంధానిత మొబైల్‌కి ఓటీపీ వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేయాలి. 
 • ఇక్క‌డ మీ పేరు, చిరునామా, నామినీ వివ‌రాలు వంటి వ్య‌క్తిగ‌త స‌మాచారం ఇచ్చి స‌బ్మిట్‌పై క్లిక్ చేస్తే ఖాతా తెరుచుకుంటుంది. 

ముఖ్య ఫీచ‌ర్లు..

 • మీ సౌల‌భ్యం మేర‌కు బ్యాంకింగ్ లావాదేవీలు చేసుకోవ‌చ్చు. 
 • త‌క్ష‌ణ ఆన్-బోర్డింగ్ స‌దుపాయం (మొబైల్ యాప్ ద్వారా డిజిట‌ల్ ఖాతా తెర‌వ‌డం)
 • ఆన్‌లైన్ లావాదేవీల కోసం 'రూపే వర్చువ‌ల్' డెబిట్ కార్డును జారీ చేస్తారు. 
 • జీరో బ్యాలెన్స్‌తో ఖాతా తెర‌వ‌చ్చు. 
 • నెల‌వారీ స‌గ‌టు బ్యాలెన్స్ నిర్వ‌హించాల్సిన ప‌నిలేదు. 
 • నెల‌వారీ ఈ-స్టేట్‌మెంట్ ఉచితంగా ల‌భిస్తుంది. 
 • సుల‌భంగా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు చేసుకోవచ్చు. 

డిజిట‌ల్ ఖాతా తెరిచేట‌ప్పుడు గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు.. 

 • వ్య‌క్తులు భార‌తీయ నివాసులై ఉండాలి. 
 • 18 సంవ‌త్స‌రాలు నిండిన వ్య‌క్తులు మాత్ర‌మే ఖాతా తెరిచేందుకు వీలుంటుంది. 
 • ఖాతా తెరిచిన నాటి నుంచి 12 నెల‌ల్లో కేవైసీ పూర్తిచేయాలి. 
 • కేవైసీ ప్ర‌క్రియ‌ను ఏదైనా యాక్సెస్ పాయింట్‌కి వెళ్లి గానీ, జీడీఎస్‌/పోస్ట్‌మెన్ స‌హాయంతో పూర్తిచేయ‌వ‌చ్చు. 
 • గ‌రిష్ఠంగా రూ.1.20 లక్ష‌ల‌ వ‌ర‌కు క్యుమిలేటీవ్ వార్షిక డిపాజిట్‌ను అనుమ‌తిస్తారు. 
 • ఖాతా తెరిచిన 12 నెల‌ల్లోపు కేవైసీ పూర్తి చేయ‌క‌పోతే ఖాతాను ర‌ద్దు చేస్తారు. 
 • ఖాతా తెరిచిన 12 నెల‌ల్లోపు  కేవైసీ పూర్తి చేసిన వారి డిజిట‌ల్ పొదుపు ఖాతాను పీఓఎస్ఏ (పోస్టాఫీసు పొదుపు ఖాతా)కు అనుసంధానిస్తారు.
 • బిల్లు చెల్లింపులు, వ్యాపారుల వ‌ద్ద చేసే చెల్లింపులు, పోస్టాఫీసు పొదుపు ఖాతాల కోసం చేసే లావాదేవీలు మొత్తం విలువ‌ నెల‌వారీ ప్రాతిప‌దిక‌న చూస్తారు. 
 • పోస్టాఫీసు డిజిట‌ల్ పొదుపు ఖాతా ఒక సంవ‌త్స‌రం పాటు మ‌నుగ‌డ‌లో ఉంటుంది. ఈ లోపు బ‌యోమెట్రిక్ అథెంటికేష‌న్ పూర్తిచేసి రెగ్యుల‌ర్ ఖాతాకు మార్చుకోవాల్సి ఉంటుంది.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts