Health Insurance: ఆరోగ్య బీమా.. ఇవి మర్చిపోవద్దు
ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు వస్తుంటాయి. వీటిని మనం సరిగా అర్థం చేసుకోకపోతే..
ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు వస్తుంటాయి. వీటిని మనం సరిగా అర్థం చేసుకోకపోతే.. అవసరం వచ్చినప్పుడు పాలసీ ఉన్నా ఫలితం ఉండదు. బీమా పాలసీని ఎంచుకునేటప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. చివరి నిమిషంలో ఆందోళన పడక్కర్లేదు. పాలసీని తీసుకునేటప్పుడు పరిగణించాల్సిన విషయాలేమిటో చూద్దామా...
అనారోగ్యం వచ్చి, ఆసుపత్రిలో చేరిప్పుడు ఆరోగ్య బీమా పాలసీ కొండంత ధైరాన్ని ఇస్తుంది. మనం దాచుకున్న సొమ్ములు చికిత్స కోసం ఖర్చు చేయకుండా ఇది అడ్డుకుంటుంది. కానీ, నిబంధనలు తెలుసుకోకుండా పాలసీని తీసుకుంటే మాత్రం క్లెయిం చెల్లింపులో నిరాశ తప్పదు.
గది అద్దె...
చికిత్స ఖర్చులో గది అద్దె ఎంతో కీలకంగా ఉంటుంది. ఆరోగ్య బీమా పాలసీలో ఈ గది అద్దెపై ఎలాంటి పరిమితి లేకుండా చూసుకోవాలి. ఉదాహరణకు మీ పాలసీలో గది అద్దె రోజుకు రూ.6వేల వరకే చెల్లించే అవకాశం ఉందనుకుందాం. ఆసుపత్రిలో చేరినప్పుడు గది అద్దె రూ.10వేలు చెల్లించాలి. మిగతా రూ.4వేలను చేతి నుంచి పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా? ఇది పొరపాటే. ఎందుకంటే.. గది అద్దె ఆధారంగా మిగతా చికిత్స ఖర్చుల్లోనూ తేడా ఉంటుంది. కాబట్టి, బీమా సంస్థ దామాషా ప్రకారం బిల్లులను చెల్లిస్తుంది. ఆసుపత్రి పంపిన బిల్లును, రూ.6వేల గది అద్దె ఉన్న బిల్లుతో సర్దుబాటు చేసి, ఆ మేరకే క్లెయిం చెల్లిస్తుంది. కాబట్టి, పాలసీని ఎంచుకునేటప్పుడు ఎలాంటి గది అద్దె పరిమితి లేకుండా చూసుకోవాలి. ఇలాంటి పాలసీలు కాస్త ఖరీదైనవే ఉంటాయి. కానీ, అవసరం వచ్చినప్పుడు వచ్చే ప్రయోజనాలతో పోలిస్తే ఏమంత భారం కాదు.
చికిత్సకు ముందు.. తర్వాత
ఆసుపత్రిలో చేరే ముందు ఖర్చులూ ఆరోగ్య బీమా పాలసీ భరిస్తుంది. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లాకా ఖర్చులను క్లెయిం చేసుకోవచ్చు. సాధారణంగా పాలసీలు 30 రోజుల నుంచి 60 రోజుల వరకూ ఇలాంటి రక్షణను అందిస్తాయి. గరిష్ఠంగా 60-180 రోజుల వ్యవధి వరకూ ఖర్చులను చెల్లించే పాలసీలను ఎంచుకునేందుకు ప్రయత్నించండి.
ఉప పరిమితులు లేకుండా..
ఆరోగ్య బీమా పాలసీ వివిధ వైద్య ఖర్చులకు కొన్ని ఉప పరిమితులను విధిస్తుంటుంది. నిర్ణీత వ్యాధులకు ఇది వర్తిస్తుంది. అంటే, చికిత్స వ్యయంతో సంబంధం లేకుండా పాలసీ తన పరిమితి మేరకే పరిహారం ఇస్తుందన్నమాటు. ఉదాహరణకు కంటి శుక్లం శస్త్ర చికిత్సకు రూ.50వేలు పరిమితి పెట్టిందనుకుందాం. ఖర్చు రూ.80వేలైనా సరే.. గరిష్ఠంగా రూ.50వేలు చెల్లిస్తుంది. అదే సమయంలో రూ. 40 వేలు ఖర్చు అయితే.. అంత మేరకే పరిహారం ఇస్తుంది. గది అద్దె విషయంలోనూ పాలసీ మొత్తంలో 1 శాతం వరకే పరిమితి ఉంటుంది. ఎక్కువ ఉప పరిమితులు లేని పాలసీలను ఎంచుకోవడం ఎప్పుడూ మంచిది.
నిరీక్షణ తక్కువగా..
వైద్య పాలసీని తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకూ ఇవి పనిచేయవు. పాలసీలను కొనుగోలు చేసే సమయంలో మీకు అప్పటికే ఉన్న వ్యాధులకు నిర్ణీత కాలం వరకూ వేచి ఉండే వ్యవధి ఉంటుంది. రక్తపోటు, మధుమేహంవంటి కొన్ని వ్యాధులు ఈ జాబితాలోకి వస్తాయి. సాధారణంగా ఇది 2-4 ఏళ్ల వ్యవధి వరకూ ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడు వేచి ఉండే కాలం, మినహాయింపులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అనుమానం ఉంటే బీమా కంపెనీ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలి. తక్కువ వేచి ఉండే సమయంతో ఉన్న పాలసీని తీసుకోవచ్చు. కొన్ని పాలసీలు కాస్త అధిక ప్రీమియాన్ని వసూలు చేసి, ముందస్తు వ్యాధులను మొదటి రోజు నుంచే కవర్ చేస్తున్నాయి.
నగదు రహితంగా
మీరు తీసుకుంటున్న పాలసీ ఆసుపత్రుల జాబితాలో మీ దగ్గర్లో ఉన్నవి ఉన్నాయా చూసుకోండి. బీమా సంస్థతో ఒప్పందం ఉన్న ఆసుపత్రుల్లో చేరినప్పుడే నగదు రహిత చికిత్సకు అవకాశం ఉంటుంది. నాన్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటే, బిల్లు చెల్లించి, బీమా సంస్థ నుంచి ఆ మొత్తాన్ని తిరిగి పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నగదు రహిత చికిత్స అంత సులభంగా ఉండదని గుర్తించాలి.
రోజువారీ చికిత్సకూ..
ఆసుపత్రిలో చేరాల్సిన అనేక చికిత్సలు ఇప్పుడు ఒక రోజులోనే పూర్తవుతున్నాయి. ఇలాంటి చికిత్సలను డే కేర్ అంటారు. డయాలసిస్, కీమోథెరపీ లాంటివి ఇందుకు ఉదాహరణలు. మీరు తీసుకుంటున్న పాలసీలో డే కేర్ చికిత్సలకూ పరిహారం అందేలా ఉండాలి.
సహ చెల్లింపు...
సహ- చెల్లింపు అంటే.. బిల్లులో కొంత మొత్తాన్ని మీరు చెల్లించాలి. ఉదాహరణకు సహ-చెల్లింపు మొత్తం 20శాతం ఉంటే, బిల్లులో 20% మీరు చెల్లించాలి. ఇది మీ ముందస్తు ప్రీమియంను తగ్గిస్తుంది కానీ ఆసుపత్రిలో చేరినప్పుడు ఇది కచ్చితంగా భారం అవుతుంది. కాబట్టి, సహ చెల్లింపు తక్కువగా లేదా అసలు లేకుండా ఉండేలా పాలసీని తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?
-
Dulquer Salmaan: భీమ్స్ బీట్స్ విన్న ప్రతిసారి డ్యాన్స్ చేస్తున్నా: దుల్కర్ సల్మాన్
-
Viral video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన
-
CBFC: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం.. అదేంటంటే?
-
OBC census: ఓబీసీ గణన చేపట్టాల్సిందే..: మల్లికార్జున ఖర్గే డిమాండ్
-
BRS: భారాసలో చేరిన మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్