RBI: ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్ల వడ్డీ రేటు పెంచిన ఆర్‌బీఐ

ఈ బాండ్ల వడ్డీ రేటు పోస్టాఫీసు నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్(NSC) వడ్డీ రేట్లతో ముడిపడి ఉంటుంది.

Published : 31 Dec 2022 18:46 IST

దిల్లీ: ఫ్లోటింగ్‌ రేట్స్‌ సేవింగ్స్‌ బాండ్లపై వడ్డీ రేటును ఆర్‌బీఐ సవరించింది. జనవరి 1 నుంచి పెరిగిన వడ్డీ రేట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం 7.15 శాతంగా ఉన్న వడ్డీని 7.35 శాతానికి పెంచింది. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌ (NSC)పై ప్రభుత్వం 6.80 నుంచి 7 శాతానికి వడ్డీ రేటును పెంచిన నేపథ్యంలో ఫ్లోటింగ్‌ బాండ్లపై వడ్డీ రేటులో ఆర్‌బీఐ మార్పు చేసింది. ఫ్లోటింగ్‌ బాండ్లపై వడ్డీ రేటు NSC రేటుతో ముడిపడి ఉంటుంది. ప్రస్తుత ఎన్‌ఎస్‌సీ రేటు కంటే 0.35% ఎక్కువ వడ్డీ రేటు ఉంది. 

ఈ బాండ్లలో భారత పౌరులు, హిందు అవిభక్త కుటుంబాలు (HUF) పెట్టుబడి పెట్టొచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000, గరిష్ఠ పెట్టుబడి పరిమితి లేదు. బాండ్లకు 7 సంవత్సరాల స్థిర కాలవ్యవధి ఉంటుంది. కనీస లాక్‌-ఇన్‌ పీరియడ్‌కు లోబడి 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిగత పెట్టుబడిదారులకు ముందస్తు ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. వడ్డీ మొత్తాన్ని అర్ధ సంవత్సరానికి.. అంటే జనవరి 1, జులై 1న  చెల్లిస్తారు. వడ్డీ రేటును ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షిస్తారు. బాండ్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ డబ్బు అవసరం ఉండదు. మొత్తం మీద పోర్ట్‌పోలియోను బ్యాలెన్స్‌ చేయడానికి బాండ్లు గొప్ప మార్గం. ఎక్కువ రిస్క్‌ తీసుకోకుండా ఈ బాండ్ల ద్వారా స్థిరమైన రాబడిని అందుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు