Buying Home: ఇల్లు కొనేందుకు సిద్ధమేనా? ఎలా తెలుస్తుంది?

ఇంటి కొనుగోలు కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామా లేదా అనే విషయంలో స్పష్టత అవసరం. మరి అది ఎలా తెలుసుకోవాలి?

Updated : 07 Feb 2023 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంతిల్లు (House) కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలా మంది జీవిత కాల ఆర్థిక లక్ష్యాల్లో ఇదీ ఒకటి. అయితే ఇల్లు కొనుగోలు చేయడం అంత సులభం కాదు. పెరుగుతున్న ఇళ్ల ధరలతో కావాల్సిన ఏరియాలో కావాల్సిన సదుపాయాలతో ఇంటి కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఒక్కోసారి ఇంటి కొనుగోలు ప్రణాళిక అయితే చేస్తారు.. కానీ, కొనుగోలుకు మాత్రం ముందడుగు వేయరు. కారణం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామా? లేదా? అనే విషయంలో స్పష్టత ఉండదు. ఈఎంఐ (EMI)లు చెల్లించకలేకపోతే..? అనే సందేహంతో చాలా మంది ముందడుగు వేయరు. అయితే తగిన ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళితే సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. ఇల్లు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అనేది ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుని తెలుసుకోవచ్చు.

పొదుపు..

ప్రతి నెలా ఎంత ఎక్కువగా పొదుపు చేస్తారో అంత వేగంగా సొంతింటి కలకు చేరువవుతారు. మీ నెలవారీ ఆదాయంలో కనీసం 25-30% పొదుపు చేయగలగాలి. అప్పుడే ఈఎంఐలను సకాలంలో చెల్లించగల సామర్థ్యం మీకు ఉంటుంది. గృహ రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆర్థిక సంస్థలు మీ చెల్లింపుల సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. దీని కోసం మీ ఆదాయం, ఉపాధి వంటి వాటిని పరిశీలిస్తాయి. అలాగే గతంలో తీసుకున్న రుణాలను ఎంత క్రమశిక్షణతో చెల్లించారో కూడా చూస్తారు.

డౌన్‌పేమెంట్‌..

ఇంటి కొనుగోలు కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణం ఇస్తాయి. అయితే, 100% రుణం ఇవ్వవు. కనీసం 10-20% మొత్తాన్ని డౌన్‌పేమెంట్‌ రూపంలో కొనుగోలుదారులు స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసే ఆస్తి విలువ, దరఖాస్తు చేసుకున్న ఆర్థిక సంస్థ ఆధారంగా డౌన్‌పేమెంట్‌ మరికొంత పెరగొచ్చు. కాబట్టి, ముందుగా ఈ మొత్తాన్ని సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు మీరు రూ. 50 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేస్తుంటే.. రూ.10 లక్షలు (20%) డౌన్‌పేమెంట్‌ రూపంలో కొనుగోలుదారులు చెల్లించాలి. డౌన్‌పేమెంట్‌ ఎంత ఎక్కువగా ఉంటే.. రుణ మొత్తం అంత తక్కువగా ఉంటుంది. కాబట్టి, సులభంగా రుణం చెల్లించగులుగుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

రిజిస్ట్రేషన్‌, ఇతర ఖర్చులు..

డౌన్‌పేమెంట్‌ కాకుండా, ఆస్తి రిజిస్ట్రేషన్‌ (చట్టపరంగా ఆస్తి మీ పేరుపైకి మార్చుకునేందుకు), బ్రోకరేజ్‌, ఇతర ఛార్జీలకు కూడా నిధులు అవసరమవుతాయి. మీరు ఇల్లు ఏ ప్రాంతంలో కొంటున్నారనేదాని బట్టి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఉంటాయి. వీటికి లక్షల్లో ఖర్చువుతుంది. కాబట్టి, ముందుగానే ఈ ఖర్చును అంచనా వేసి నిధులు సిద్ధం చేసుకోవాలి. 

ఈఎంఐ చెల్లంచగలరా?

ఉదాహరణకు మీరు రూ.40 లక్షల గృహ రుణాన్ని.. 9% వడ్డీ, 20 ఏళ్ల కాలపరిమితితో తీసుకున్నారనుకుందాం. ఈ లోన్‌ కోసం మీ నెలవారీ ఈఎంఐ దాదాపు రూ.36 వేలు. ఇక్కడ మీరు లోన్‌ పూర్తయ్యే నాటికి చెల్లించే మొత్తం దాదాపు రూ.86 లక్షలు (అసలు రూ.40 లక్షలు + వడ్డీ రూ.46 లక్షలు). అదే మీరు కాలపరిమితి 25 ఏళ్లు పెట్టుకుంటే.. నెలవారీ దాదాపు రూ.33,600 వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ సందర్భంలో మీరు చెల్లించే మొత్తం దాదాపు రూ.1 కోటి (అసలు రూ.40 లక్షలు + వడ్డీ రూ.60 లక్షలు). అంటే, కాలపరిమితి పెరిగే కొద్దీ ఈఎంఐ తగ్గుతున్నప్పటికీ చెల్లించాల్సిన వడ్డీ పెరుగుతుంది. అందువల్ల తక్కువ కాలపరిమితి ఎంచుకోవడమే మేలు. కానీ, మీరు ఎంత మొత్తంలో ఈఎంఐ చెల్లించగలరనేది కూడా చూసుకోవాలి. ఈఎంఐ ఆలస్యం కాకుండా ఒత్తిడి లేకుండా చెల్లించడమూ ముఖ్యమే.

భవిష్యత్‌ ఆదాయం..

మీరు కెరీర్‌ ప్రారంభ దశలో ఉంటే.. పోను పోనూ మరిన్ని అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్‌లో ఎక్కువ మొత్తంలో జీతం లభించే అవకాశం ఉంటుంది. అలా జీతం పెరిగినప్పుడు కొంత మొత్తం రుణం తీర్చేందుకు ప్రయత్నించవచ్చు. రుణ కాలపరిమితిలో మీ లోన్‌ ఎప్పుడైనా చెల్లించవచ్చు. 

క్రెడిట్‌ స్కోరు..

బ్యాంకులు రుణం ఇచ్చేందుకు పరిశీలించే ముఖ్యమైన అంశం క్రెడిట్‌ స్కోరు. గృహ రుణం వంటి పెద్ద, దీర్ఘకాల రుణాలకు తప్పకుండా క్రెడిట్‌ స్కోరును చూస్తారు. ఇది మీరు ఎంత క్రమశిక్షణతో రుణం చెల్లించగలరనేది తెలియజేస్తుంది. ఎక్కువ క్రెడిట్‌ స్కోరు (700 కంటే ఎక్కువ) నిర్వహించేవారి దరఖాస్తును తిరస్కరించే అవకాశం తక్కువ. అలాగే, తక్కువ వడ్డీకే రుణం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి, గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందే మీ క్రెడిట్‌ స్కోరును పెంచుకునే ప్రయత్నం చేయండి. 

చివరిగా: మీరు రుణ కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీ ఆర్థిక పరిస్థితులన్నింటినీ అంచనా వేసుకుని సిద్ధంగా ఉన్నామని నిర్ధారించుకున్న తర్వాతనే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని