నెల‌కు ₹5వేలతో ₹8 కోట్లు.. ఎలా కూడ‌బెట్టొచ్చు?

ప‌ద‌వీ విర‌మ‌ణ వంటి దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం చేసే పెట్టుబ‌డుల విష‌యానికి వ‌స్తే.. పెట్టుబ‌డుల‌కు సుదీర్ఘ స‌మ‌యం ఉంటుంది. కాబ‌ట్టి ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించి అధిక రాబ‌డినిచ్చే పెట్టుబ‌డుల‌నే ఎంపిక చేసుకోవాలి.

Published : 26 Jul 2022 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలివిగా చేసే పెట్టుబ‌డులు మ‌దుప‌ర్లును ప్ర‌త్యేక స్థానంలో నిల‌బెడ‌తాయి. ప‌ద‌వీ విర‌మ‌ణ వంటి దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం చేసే పెట్టుబ‌డుల విష‌యానికి వ‌స్తే.. పెట్టుబ‌డుల‌కు సుదీర్ఘ స‌మ‌యం ఉంటుంది. కాబ‌ట్టి ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించి అధిక రాబ‌డినిచ్చే పెట్టుబ‌డుల‌నే ఎంపిక చేసుకోవాలి. అలాగే ఆదాయం, ఖ‌ర్చులు, పెట్టుబ‌డుల విష‌యంలో స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండాలి. సంపాద‌న పెరిగే కొద్దీ పెట్టుబ‌డుల‌ను పెంచుకుంటూ ఉండాలి. అప్పుడే అనుకున్న ల‌క్ష్యాన్ని స‌మ‌యం కంటే ముందుగానే చేర‌గ‌లుగుతారు.

  • మ‌దుప‌ర్లు స్టెప్ అప్ సిప్ విధానాన్ని ఎంచుకోవ‌డం ద్వారా.. చిన్న మొత్తాల‌తో మ‌దుపు చేయ‌డం ప్రారంభించిన‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలంలో కాంపౌండింగ్ ప్ర‌భావంతో ఎక్కువ మొత్తంలో నిధిని స‌మ‌కూర్చుకోగ‌లుగుతారు. ఒక వ్య‌క్తి 25 సంవ‌త్స‌రాల వ‌య‌సులో.. అంటే సంపాద‌న ప్రారంభ‌మైన కొత్త‌లోనే పెట్టుబ‌డులు మొద‌లు పెడితే.. ప‌ద‌వీవిర‌మ‌ణ‌కు 35 సంవ‌త్స‌రాల సుదీర్ఘ స‌మ‌యం ఉంటుంది. ఇంత సుదీర్ఘ‌కాలం పెట్టుబ‌డులు పెట్టేవారు మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ ద్వారా 12 నుంచి 16 శాతం వ‌ర‌కు రాబ‌డిని ఆశించవ‌చ్చు.
  • చాలా మంది నెలవారీ SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) మోడ్ ద్వారా పెట్టుబ‌డులు ప్రారంభిస్తున్నారు. కానీ వారిలో ఎంత మంది పెట్టుబ‌డుల విష‌యంలో స్వీయ-క్రమశిక్షణతో ఉన్నారు? ఎంత మంది వార్షిక ఆదాయం పెరిగిన ప్ర‌తిసారీ సిప్ మొత్తాన్ని పెంచుతున్నారు? అంటే చెప్పడం క‌ష్ట‌మే. ఒక‌వేళ క్ర‌మానుగ‌త పెట్టుబ‌డులు దెబ్బ‌తింటే దీర్ఘ‌కాలంలో వ‌చ్చే రాబ‌డిలో చాలా త‌గ్గుద‌ల న‌మోదు అవుతుంది. కాబ‌ట్టి, పెట్టుబ‌డులు చేసే వారికి నిబ‌ద్ధ‌త అవ‌సరం. ఆదాయం చేతికి అందిన త‌ర్వాత‌, ముందుగా పెట్టుబ‌డుల‌కు కావాల్సిన మొత్తాన్ని పక్క‌న పెట్టిన త‌ర్వాత మాత్ర‌మే ఖ‌ర్చులు చేయ‌డం మంచిది.
  • ఒక‌ వ్య‌క్తి త‌న 25 సంవ‌త్స‌రాల వ‌య‌సులో సిప్‌ను ప్రారంభించి నెల‌కు రూ.5000 మ‌దుపు చేస్తే.. 35 సంవ‌త్స‌రాల‌కు ఆ వ్య‌క్తి 12 శాతం రాబ‌డి అంచ‌నాతో రూ.3 కోట్ల నుంచి రూ.3.30 కోట్ల వ‌ర‌కు నిధిని స‌మ‌కూర్చుకోవ‌చ్చు. ఇందులో అత‌డి పెట్టుబ‌డి రూ.21 ల‌క్ష‌లు మాత్ర‌మే.
  • అదే వ్య‌క్తి ప్ర‌తి సంవ‌త్స‌రం స్టెప్ అప్ సిప్‌ను ఎంచుకుని వార్షికంగా 10 శాతం పెట్టుబ‌డుల‌ను పెంచుకున్న‌ట్ల‌యితే 35 సంవ‌త్స‌రాల‌కు 12 శాతం రాబ‌డి అంచ‌నాతో దాదాపు రూ.8 కోట్ల నుంచి రూ.8.50 కోట్ల వ‌ర‌కు స‌మ‌కూర్చుకోవ‌చ్చు. ఇందులో అత‌డి పెట్టుబ‌డి మొత్తం రూ.1.62 కోట్లు మాత్ర‌మే.
  • ప్ర‌తి సంవ‌త్స‌రం వార్షిక వేత‌నం పెరుగుతూనే ఉంటుంది. కాబ‌ట్టి వేతనం పెరిగిన‌ప్పుడు పెట్టుబ‌డుల‌ను పెంచుకుంటే దీర్ఘ‌కాలంలో కావాల్సిన నిధిని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. సిప్ కోసం ఫండ్‌ను ఎంచుకున్నప్పుడు మంచి ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది. మ్యూచువల్ ఫండ్‌లో రిస్క్ ఉంటుందని గమనించండి. ఒకోసారి ఫండ్‌లో నష్టాలు కూడా రావచ్చు. ఈ మేరకు రిస్క్ పరిమితి ఉన్న వారు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని