Stock Market: ఫెడ్‌ ఎఫెక్ట్‌.. లాభాల్లో మార్కెట్‌ సూచీలు

ఫెడ్‌ వడ్డీరేట్ల ప్రభావం భారత్‌ మార్కెట్లపై పడింది. ఫలితంగా సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. 

Published : 27 Jul 2023 09:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతోంది. దీంతో భారత్‌ మార్కెట్లు కూడా నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.18 సమయంలో సెన్సెక్స్‌ 202 పాయింట్ల లాభంతో 66,909 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 19,845 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. విసువియస్‌ ఇండియా, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా, సిప్లా, ఆస్టెక్‌ లైఫ్‌ సైన్స్‌, వొడాఫోన్‌ ఐడియా షేర్ల విలువ పెరగ్గా.. రైల్‌ వికాస్‌ నిగమ్‌, జన్సన్‌ కంట్రోల్స్‌-హిటాచీ ఎయిర్‌ కండీషనింగ్స్‌, ఫైన్‌ ఆర్గానిక్, టెక్‌ మహీంద్రా, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్ల విలువ కుంగింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 82 వద్ద మొదలైంది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో ఖతర్‌ ప్రభుత్వ ఫండ్స్‌ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు రావడం, మరోవైపు ఎల్‌అండ్‌టీ ఆదాయంలో వృద్ధి కూడా సూచీలకు కలిసొచ్చింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును ముందుగా ఊహించినట్లే మరో 25 బేసిస్‌ పాయింట్లు (0.25%) పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. తద్వారా రుణ రేటు 5.25 - 5.50 శాతానికి పెరిగింది. 22 ఏళ్లలో ఇదే గరిష్ఠం. 2022 మార్చి నుంచి ఇప్పటివరకు ఫెడ్‌ 11 సార్లు వడ్డీ రేటును పెంచింది. జూన్‌లో ద్రవ్యోల్బణం 3 శాతంగా నమోదైంది. గతంతో పోల్చుకుంటే ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గినా, ఫెడ్‌ లక్ష్యమైన 2 శాతం కంటే అధికంగా ఉండడం, ఉద్యోగ వృద్ధి బలంగా కొనసాగుతున్నందున, వడ్డీరేట్ల పెంపునకే ఫెడ్‌ ఈసారి మొగ్గు చూపిందని సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని అత్యధిక విశ్లేషకులు ఊహించారు.

అమెరికా మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ట్రేడ్‌ అయ్యాయి. డోజోన్స్‌ లాభాల్లో ముగియగా.. నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ-500 సూచీ నష్టాల్లో ముగిశాయి. ఇక ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ సూచీ 0.74శాతం,  షాంఘై కాంపోజిట్‌ సూచీ 0.36 శాతం, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ 1.34 శాతం, జపాన్‌ సూచీ నిక్కీ 0.19 శాతం, తైవాన్‌కు చెందిన టీఎస్‌ఈసీ 50 సూచీ 0.56శాతం లాభాల్లో ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని