182 EVలకు సగటున ఒక ఛార్జర్‌! తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఎన్నంటే?

దేశ వ్యాప్తంగా 28,17,554 ఎలక్ట్రానిక్‌ వాహనాలు వినియోగంలో ఉండగా.. వీటికోసం 9,113 పబ్లిక్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు, 15,493 ఈవీ ఛార్జర్లు  అందుబాటులో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది.

Updated : 08 Aug 2023 20:37 IST

దిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందుకనుగుణంగానే పలు నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల(EVs)కు తగిన విధంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల (EV charging station) ఏర్పాటుపై కేంద్రం దృష్టిపెట్టింది. జులై 31 నాటికి దేశ వ్యాప్తంగా 28,17,554 ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలో ఉండగా.. వీటికోసం 9,113 పబ్లిక్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు, 15,493 ఈవీ ఛార్జర్లు  అందుబాటులో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలో ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లకు సంబంధించి భాజపా ఎంపీ మనోజ్‌ కోటక్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పబ్లిక్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు, ఛార్జర్లు, ఛార్జింగ్ పాయింట్ల వివరాలను ఆయన వెల్లడించారు.

182 వాహనాలకు ఒక పబ్లిక్‌ EV ఛార్జర్‌!

కేంద్ర విద్యుత్‌ శాఖ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు(EVలు), పబ్లిక్ EV ఛార్జర్‌ల నిష్పత్తి 1: 182గా ఉందని మంత్రి పేర్కొన్నారు.  దేశంలో 2030 నాటికి 4 మిలియన్లకు పైగా జనాభా కలిగిన తొమ్మిది నగరాలైన దిల్లీ, ముంబయి, పుణె, అహ్మదాబాద్‌, సూరత్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతాల్లో 18వేల పబ్లిక్‌ EV ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరమని ప్రాథమిక అధ్యయనాలు సూచిస్తున్నాయని తెలిపారు.  ఈవీ ఛార్జర్లు ఏర్పాటు విషయంలో ఎలాంటి టార్గెట్లు నిర్దేశించలేదన్నారు. అయితే, పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ 2024 డిసెంబర్‌ నాటికి 22వేల పబ్లిక్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా పనిచేస్తోందన్నారు. జులై 31 వరకు ఉన్న సమాచారం ప్రకారం ఏపీలో 307 పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు ఉండగా.. 348 ఛార్జర్లు, 355 ఛార్జింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఇకపోతే, తెలంగాణలో 412 ఛార్జింగ్‌ స్టేషన్లు ఉంటే.. 550 ఛార్జర్లు, 675 ఛార్జింగ్‌ పాయింట్లు ఉన్నట్టు తెలిపింది. మొత్తంగా దేశ వ్యాప్తంగా 9,113 కేంద్రాలు ఉంటే.. వీటిలో 14,493 ఛార్జర్లు, 17,236 ఛార్జింగ్‌ పాయింట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని